గాలి వాన ప్రభావంతో..
ABN , Publish Date - Sep 29 , 2026 | 12:18 AM
ఇటీవల కురిసిన వర్షాలలో రహదారులు దెబ్బతిని నడిచేందుకు కూడా వీలు లేకుండా పోయాయి. గుంతలు పడటంతో వర్షపు నీరు నిలిచి బురదమయంగా మారాయి
దెబ్బతిన్న రహదారులు, కూలిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు
చాగలమర్రి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన వర్షాలలో రహదారులు దెబ్బతిని నడిచేందుకు కూడా వీలు లేకుండా పోయాయి. గుంతలు పడటంతో వర్షపు నీరు నిలిచి బురదమయంగా మారాయి. గొడిగనూరు-కొత్తపల్లె, కొత్తపల్లె-డి.వనిపెంట రహదారి పొడవునా గుంతలతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కలుగొట్లపల్లె నుంచి గొట్లూరు రహదారి వర్షానికి గ్రావెల్‌రోడ్డు దెబ్బతినడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే నేలంపాడు, గొట్లూరు తారురోడ్డు వర్షాలకు కోతకు గురై కంకర బయటపడింది. చింతలచెరువు గ్రామానికి వెళ్లే రహదారి నీటి కుంటలుగా మారింది. జ్ఞానాపురం, ఓజీ తండా, చాగలమర్రి గ్రామంలోని కూరపాటివీధి అధ్వానంగా ఉంది. అధికారులు స్పందంచి మరమ్మతులు చేయించాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
కాలిపోయిన 20 వీధి దీపాలు
చిన్నవంగలిలో ఇటీవల కురిసిన వర్షంతో 20 వీధి దీపాలు కాలిపోయని గ్రామస్తులు అన్నారు. రాత్రి చీకటితో ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి కొత్త వీధిదీపాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
విద్యుత్‌శాఖకు రూ.5 లక్షల నష్టం
గాలి, వాన భీభత్సంతో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు విరిగిపడి విద్యుత్ శాఖకు రూ.5లక్షల నష్టం వచ్చినట్లు ఏఈ రమణయ్య సోమవారం తెలిపారు. పెద్దబోదనం, రాంపల్లె, చిన్నబోదనం, తోడెండ్లపల్లె తదితర గ్రామాల్లో 70 స్తంభాలు, మూడు ట్రాన్స్‌ఫార్మర్లు విరిగిపడ్లాయని నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపామన్నారు.