Share News

ఎట్టకేలకు రోడ్డుకు మరమ్మతులు

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:50 PM

నాసికరం పనుల కారణంగా కర్నూలు జిల్లా హొళగుంద - ఢాణాపురం ప్రధాన రహదారి రోజులు గడవకనే ధ్వంసమైన తీరుపై ఈనెల 19న ‘30 ఏళ్ల రోడ్డు కల.. 30 రోజుల్లో తారుమారు..!’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది.

ఎట్టకేలకు రోడ్డుకు మరమ్మతులు
ఆంధ్రజ్యోతి కథనం తరువాత చేసిన మరమ్మతులు

నిర్మించి రోజులు గడవకనే ధ్వంసమైన హొళగుంద రోడ్డు

నాసిరకం పనులపై మంత్రి బీసీ ఆగ్రహం

విజిలెన్స్‌ అధికారుల విచారణ

ఆగమేఘాలపై మరమ్మతులు చేయించిన ఇంజనీర్లు

కాంట్రాక్టర్‌ నిర్వహణ గడువు మూడేళ్లకు పెంపు

కర్నూలు, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): నాసికరం పనుల కారణంగా కర్నూలు జిల్లా హొళగుంద - ఢాణాపురం ప్రధాన రహదారి రోజులు గడవకనే ధ్వంసమైన తీరుపై ఈనెల 19న ‘30 ఏళ్ల రోడ్డు కల.. 30 రోజుల్లో తారుమారు..!’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై స్పందించిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పనుల్లో నాణ్యతా లోపాలపై ఇంజనీర్లు, ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ విజిలెన్స్‌ ఈఎన్‌సీ విచారణతో పాటు ఏపీ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు ఆదేశించారు. 30 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ క్వాలిటీ కంట్రోల్‌ అధికారి శేషుకుమార్‌, ఆర్‌అండ్‌బీ కర్నూలు ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి రెండు రోజుల క్రితం క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. పనులు పూర్తి కాకుండానే.. ఓ వైపు పనులు జరుగుతుండగా మరో వైపు తారు పెచ్చులుపెచ్చులుగా ఊడిపోయి రహదారికి ధ్వంసం కావడానికి గల కారణాలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హొళగుంద - ఢాణాపురం రోడ్డు మరమ్మతులు, నిర్వహణ కోసం గత వైసీపీ హయాంలో ఒక్కపైసా కూడా ఖర్చు చేయలేదు. రహదారి ఆధునికీకరణ కోసం రూ.62 కోట్లు మంజూరు చేసినా గంపెడు మట్టి తీయలేదు. పూర్తిగా గుంతలమయంగా మారింది. కూటమి ప్రభుత్వం రాగానే ఈ రహదారి ఆధునికీకరణ కోసం రూ.13.70 కోట్లు మంజూరు చేసింది. రెండు ప్యాకేజీలుగా విభజించి ఇద్దరు కాంట్రాక్టర్లకు అప్పగించారు. పనులు పూర్తి కాకుండా మొదటి లేయర్‌ తారు పెచ్చులు పెచ్చులుగా లేచి నాణ్యతా లోపాలను ఎత్తిచూపుతోంది. ఆంధ్రజ్యోతి కథనంతో రోడ్డు భవనాలు శాఖ క్వాలిటీ కంట్రోల్‌ ఈఎన్‌సీ శేషుకుమార్‌ ఈ నెల 21న తనిఖీ చేసి పలు లోపాలు గుర్తించారు. అదే క్రమంలో ఆ శాఖ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి, ఈఈ పద్మనాభరెడ్డి ఆదేశాల మేరకు కాంట్రాక్టర్‌ ధ్వంసమైన రోడ్డును ఆఘమేఘాలపై మరమ్మతులకు శ్రీకారం చుట్టి దాదాపుగా పూర్తి చేశారు. తారు రోడ్డు వేయడానికి ముందు వెట్‌ మిక్స్‌ మకాడమ్‌ (డబ్ల్యూఎంఎం) వేసి, ఆ రోడ్డు ఇరువైపు బర్మ్‌ మట్టిని పూర్తిగా తొలగించకుండానే తారు వేయడం, డబ్ల్యూఎంఎంతో సరైన బాండింగ్‌ లేకపోవడం, నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగానే రోడ్డు ధ్వంసం అయ్యిందని క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు గుర్తించారు. దెబ్బతిన రోడ్డును సకాలంలో మరమ్మతులు చేయడమే కాకుండా, గడువులోగా టాప్‌ లేయర్‌ తారు రోడ్డు (బిటుమినస్‌ మకాడమ్‌-బీఎం) పనులు పూర్తి చేస్తామని రోడ్ల భవనాలు శాఖ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి ఆంధ్రజ్యోతికి వివరించారు. ఒప్పందం ప్రకారం రోడ్డు నిర్మాణం చేసిన నాటి నుంచి రెండేళ్లు కాంట్రాక్టరే నిర్వహణ (డిఫెక్ట్‌ లబబిలిటీ పీరియడ్‌) చేయాల్సి ఉంటుందని, ఆ గడువును మూడేళ్లకు పెంచామని తెలిపారు.

Updated Date - Aug 29 , 2026 | 11:50 PM