Share News

శ్రీశైలంలో రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:51 AM

శ్రీశైల దర్శనార్థం వచ్చిన భక్తుల కారు అదుపుతప్పి ఘోర ప్రమాదానికి గురైంది.

 శ్రీశైలంలో రోడ్డు ప్రమాదం
ధ్వంసమైన వాహనం

టోల్‌గేట్‌ను ఢీకొన్న కారు.. ఒకరు దుర్మరణం

ఏడుగురికి తీవ్ర గాయాలు

సురక్షితంగా బయటపడ్డ రెండేళ్ల చిన్నారి

శ్రీశైలం, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల దర్శనార్థం వచ్చిన భక్తుల కారు అదుపుతప్పి ఘోర ప్రమాదానికి గురైంది. టోల్‌ గేట్‌ దాటిన తర్వాత యుటర్న్‌ చేసిన కారు మితిమీరిన వేగంతో వస్తుండగా అలంకారేశ్వరస్వామి ఆలయం వద్ద అడ్డం వచ్చిన కుక్కను తప్పించబోయి పక్కన ఉన్న చెక్‌పోస్టును బలంగా ఢీ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన మహిళను దేవస్థానం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేలోపే మృతి చెందింది. తెలంగాణ రాష్ట్రం మెదక్‌ జిల్లా పఠాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌కు చెందిన రవిచంద్ర, సాయికీర్తి, జగదీష్‌, మంజుల, మల్లమ్మ, కార్తీక్‌ (డ్రైవర్‌), సాయిప్రవళి, ప్రవీణ్‌, శ్రియాన్‌(2)లు ఒకే కుటుంబానికి చెందిన మెత్తం 9 మంది టీఎస్‌ 15 ఎఫ్‌పి 4020 మారుతీ ఎర్టిగా కారులో సోమవారం మధ్యాహ్నం బయలుదేరి రాత్రి 9 గంటలకు శ్రీశైలం చేరుకున్నారు. టోల్‌ గేట్‌ దాటి యుటర్న్‌ చేసుకుని మితిమీరిన వేగంతో వస్తున్న కారుకు అలంకారేశ్వర స్వామి ఆలయం వద్ద రోడ్డుకు కుక్క అడ్డుగా వచ్చింది. దీంతో డ్రైవర్‌ తప్పించబోయి కుడి వైపున ఉన్న చెక్‌పోస్టును బలంగా ఢీ కొట్టాడు. ఘటనా స్థలంలో ఉన్న స్థానికులతోపాటు ఆలయ ఈవో కారు డ్రైవరు రాము, కానిస్టేబుల్‌ రాంబాబు నాయక్‌లు కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి అంబులెన్స్‌లో దేవస్థానం ఆస్పత్రికి తరలించారు. కారు ముందు భాగంలో ఉన్న ఎయిర్‌ బెలూన్స్‌ ఓపెన్‌ కావడంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మధ్య సీట్‌లో ఉన్న మల్లమ్మ (50) కంటి భాగం, నుదుటికి తీవ్ర గాయాలు కాగా, మంజుల సాయికీర్తిలకు బలంగా గాయాలయ్యాయి. అధిక రక్తస్రావం అవుతున్న మల్లమ్మను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే లోపు మృతి చెందింది. ఘటనలో ప్రవీణ్‌, కార్తీక్‌లకు తలకు గాయాలు కాగా రెండేళ్ల శ్రియాన్‌తోపాటు రవిచంద్ర, సాయిప్రవళి సురక్షితంగా బయటపడ్డారు. ఆస్పత్రి వద్ద మల్లమ్మ మృతి చెందిందని తెలిసిన కుటుంబసభ్యుల రోదనలు కలచివేశాయి. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సీఐ జీవన్‌ గంగనాథ్‌బాబు, సీఎ్‌సవో శ్రీనివాసరావులు ఆస్పత్రి వద్దకు చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. తీవ్ర గాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

ఉపాధ్యాయులకు గాయాలు

కొత్తపల్లి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): కొత్తపల్లి మండలం శివపురం జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. శివపురం జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో హిందీ పండిట్‌గా విధులు నిర్వహిస్తున్న ఖాజా మొహిద్దీన్‌, ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయుడు షహీన్షాలు సోమవారం ఆత్మకూరు నుంచి శివపురం పాఠశాలకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. శివపురం గ్రామ శివారులోని జమ్ములమ్మ గుడి వద్ద మేకలు అడ్డుగా రావడంతో ప్రమాదవశాత్తు బైక్‌ అదుపు తప్పి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఖాజా మొహిద్దీన్‌కు బలమైన గాయాలు కావడంతో కర్నూలు వైద్యుల సలహా మేరకు హైదరాబాదుకు తరలించారు. షహీన్షా అనే ఉపాధ్యాయునికి కూడా గాయాలు కావడంతో కర్నూలులోని ఓ వైద్యశాలలో చికిత్సలు తీసుకుంటున్నారని ఎంఈవోలు నాగరాజు, ఇనయతుల్లా తెలిపారు.

దుకాణంలోకి దూసుకెళ్లిన కారు

పత్తికొండ, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పాల శీతలకేంద్రం సమీపంలోని ఒక కూల్‌డ్రింక్‌ దుకాణంలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో పెండ్లిమాను తండాకు చెందిన రేఖానాయక్‌కు గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తున్న కారు పట్టణలోని పాల శీతల కేంద్రం మలుపు వద్ద సోమవారం మధ్యాహ్నం అదుపుతప్పి పక్కనే ఉన్న కూల్‌డ్రింక్‌ షాప్‌లో ఉన్న రిఫ్రిజిరేట్‌, అక్కడే ఉన్న ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసుకుంటూ పొదల్లోకి దూసుకొళ్లి ఆగింది. అయితే ప్రమాద సమయంలో దుకాణంలో ఉన్న బాలిక పని నిమిత్తం లోపలకి వెళ్లి ఉండడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఓ వ్యక్తి గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తప్పిన పెను ప్రమాదం

మంత్రాలయం, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మాధవరం సమీపంలో తుంగభద్ర నది వద్ద ట్రస్‌ బ్రిడ్జిని పత్తి గింజల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్‌ ఢీకొట్టింది. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. మంత్రాలయం హెడ్‌కానిస్టేబుల్‌ వీరేశ్‌ కథనం మేరకు... ఆదోని నుంచి గుజరాత్‌ వెళ్తున్న కంటైనర్‌ వాహనం అదుపు తప్పి ట్రస్‌ బ్రిడ్జిని ఢీకొట్టింది. దీంతో వాహనం ముందుభాగం పూర్తిగా దెబ్బతింది. డ్రైవర్‌ కర్ణాటకలోని బెలగామ్‌కు చెందిన ప్రకాష్‌ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌తో పాటు మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీని మాధవరం పోలీసులు యంత్రాల సాయంతో అక్కడి నుంచి తొలగించారు.

Updated Date - Apr 14 , 2026 | 12:52 AM