Share News

గమ్యం మారి.. మృత్యువుకు చేరి!

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:25 AM

వారి గమ్యం తప్పింది. వివాహానికి వెళ్దామనుకున్న వారు అనుకోకుండా దైవదర్శనం కోసం మధ్యలో రూట్‌ మార్చారు. కానీ నిద్రమత్తు వారి పాలిట శాపమైంది.

గమ్యం మారి.. మృత్యువుకు చేరి!
కారులో నుంచి ప్రయాణికులను బయటకు తీస్తున్న స్థానికులు

వివాహానికి బయల్దేరిన బెంగళూరు యువ ఉద్యోగులు

ఆదోనిలో చెట్టుకు ఢీకొన్న కారు

ఓ యువతి దుర్మరణం, కోమాలోకి స్నేహితుడు

నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణం

ఆదోని రూరల్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): వారి గమ్యం తప్పింది. వివాహానికి వెళ్దామనుకున్న వారు అనుకోకుండా దైవదర్శనం కోసం మధ్యలో రూట్‌ మార్చారు. కానీ నిద్రమత్తు వారి పాలిట శాపమైంది. అతివేగం ప్రమాదానికి కారణమైంది. స్నేహితురాలి పెళ్లికి బెంగళూరు నుంచి కారులో బయల్దేరిన నలుగురు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కారు చెట్టుకు వేగంగా ఢీకొనడంతో ఓ యువతి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో యువకుడి పరిస్థితి విషమంగా మారి కోమాలోకి వెళ్లాడు. మరో ఇద్దరు యువతులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ విషాద సంఘటన ఆదోని మండలం ఆదోని-శిరుగుప్ప ప్రధాన రహదారిపై శనివారం ఉదయం చోటు చేసుకుంది.

నిద్రమత్తు, అతివేగమే కారణం

బెంగుళూరుకు చెందిన హార్డ్‌వేర్‌ ఉద్యోగులు ప్రదీప్‌, అర్పిత, షర్మిల, క్షిప్రా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడంతో నిద్రమత్తు అతివేగమే కారణం అన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రమాదానికి ముందురోజు వారంతా విధులు చేశారు. అప్పటికే అలసిపోయిన వారు రాత్రి 11 గంటల సమయంలో బెంగళూరు నుంచి బయల్దేరారు. ఎక్కడా కూడా విశ్రాంతి తీసుకోకపోవడంతో డ్రైవింగ్‌ చేస్తున్న ప్రదీప్‌ అలసిపోయాడు. దీంతో రెప్పపాటు కాలంలో నిద్రమత్తు రావడం, క్షణాల్లో కారును చెట్టును ఢీకొనడం వెనువెంటనే జరిగిపోయాయి. అదేవారు విశ్రాంతి తీసుకుని ఉన్నా లేక.. డ్రైవర్‌ను నియమించుకుని వెళ్లి ఉన్నా ప్రమాదం జరిగేది కాదు.

సంతోషంగా బయల్దేరి.. విషాదంగా మారి..!

కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా తోడరనాళ్‌ గ్రామానికి చెందిన ప్రదీప్‌ ఇంజనీర్‌ పూర్తి చేసుకుని బెంగుళూరులోని కార్లకు సంబంధించిన సీట్‌బెల్ట్‌, ఎయిర్‌ బ్యాగ్స్‌ తయారు చేసే ఆటో లీవ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా చిత్రదుర్గ జిల్లా హలికేరి తాలుక కుడినీరకట్టు గ్రామానికి చెందిన అర్పిత, మాండ్య జిల్లా మొలగవల్లి తాలుకా హలిడ కొప్పల్‌ గ్రామానికి చెందిన షర్మిల, దక్షిణ కన్నడ జిల్లా సుళాయి తాలుక దొడ్డితోట గ్రామానికి చెందిన కృష్ణభట్టు శశికళ దంపతుల కుమార్తె క్షిప్రా(25) ఒకే కంపెనీలో హార్డ్‌వేర్‌ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరంతా శనివారం రాయచూరు జిల్లా లింగసూగూరులో జరిగే సహాద్యోగి, స్నేహితురాలు నందిని వివాహం నిమిత్తం శుక్రవారం రాత్రి బెంగళూరు నుంచి కారులో బయల్దేరారు. ప్రదీప్‌ కారును డ్రైవింగ్‌ చేస్తుండగా ముందు సీట్లో క్షిప్రా, వెనుక సీట్లో అర్పిత, షర్మిల సరదగా బెంగళూరు నుంచి మాట్లాడుకుంటూ బయల్దేరారు. సంతోషంగా బయల్దేరిన వారు రాయచూరు వైపు కాకుండా ఆదోనివైపు కారును మళ్లించారు. వివాహానికి ఇంకా సమయం ఉందని ఈలోపు మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకునేందుకు వారు రూట్‌ను మార్చినట్లు తెలిసింది. ముందు రోజు విధులు నిర్వహించడం రాత్రంతా నిద్ర లేకపోవడంతో ప్రదీప్‌ రెప్పపాటు కాలంలో నిద్రమత్తులోకి జారినట్లు ప్రమాదాన్ని బట్టి తెలిసింది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో లక్ష్మమ్మవ్వ వేర్‌హౌస్‌ వద్ద కారు వేగంగా ఎడమవైపు నుంచి కుడివైపునకు తిరిగి చెట్టును బలంగా ఢీకొంది. ఆ సమయంలో ఎయిర్‌బ్యాగ్స్‌ తెరుచుకున్నప్పటికీ ముందు సీట్లో కూర్చున్న క్షిప్రా అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. డ్రైవింగ్‌ చేస్తున్న ప్రదీప్‌ తలకు బలమైన గాయాలు కావడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. కోమాలోకి వెళ్లిన ఆయన ప్రస్తుతం ఆదోనిలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వెనుక సీట్లో కూర్చున్న అర్పిత రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతినగా, షర్మిల నడుం భాగం ఫ్రాక్చర్‌ అయింది. వీరిద్దరి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో కంపెనీ సిబ్బంది చేరుకుని బెంగళూరుకు తరలించారు. చెట్టును ఢీకొన్న కారు నుజ్జునుజ్జయినప్పటికీ స్థానికులు గాయపడిన వారిని బయటకు తీసి రక్షించారు. ఇస్వీ ఎస్‌ఐ మహేష్‌ కుమార్‌ కేసు నమోదు చేసుకుని క్షిప్రా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Updated Date - Apr 12 , 2026 | 12:25 AM