Share News

కృష్ణమ్మకు జలకళ..!

ABN , Publish Date - Jul 31 , 2026 | 11:29 PM

కర్ణాటక, మహారాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ జలకళ సంతరించుకుంది. ఆల్మట్టి, నారాయణపుర్‌, జూరాల జలాశయాలు పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకున్నాయి.

కృష్ణమ్మకు జలకళ..!
సుంకేసుల డ్యాంలో తగ్గిన నీటి నిల్వలు

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద

కర్నూలు, జూలై 31 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక, మహారాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ జలకళ సంతరించుకుంది. ఆల్మట్టి, నారాయణపుర్‌, జూరాల జలాశయాలు పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకున్నాయి. క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద క్రమక్రమంగా పెరుగుతోంది. శుక్రవారం జూరాల నుంచి 1,31,094 క్యూసెక్కులు విడుదల చేశారు. శ్రీశైలం డ్యాం వద్ద 92,709 క్యూసెక్కులు నమోదైంది. మూడు రోజుల్లోనే 13 టీఎంసీల వరద చేరింది. డ్యాం గరిష్ట నీటి మట్టం 855 అడుగులు, పూర్థిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా.. 834.40 అడుగుల వద్ద 54.349 టీఎంసీలు చేరింది. ప్రస్తుతం రోజు సగటున 8-9 టీఎంసీలు చేరుతోంది. ఇదిలా ఉండగా తుంగభద్ర జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. 15,690 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే కొనసాగుతోంది. డ్యాం గరిష్ట నీటి మట్టం 1633 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 105,788 టీఎంసీలు కాగా.. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో 1609.74 అడుగుల లెవల్‌లో 37.063 టీఎంసీలు వరద చేరింది. రెండు రాష్ట్రాల్లో తాగునీటి అవసరాల కోసం 3,643 క్యూసెక్కులు కాలువలకు వదులుతున్నారు.

Updated Date - Jul 31 , 2026 | 11:29 PM