హంద్రీ నీవాలోనే..
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:28 PM
వినాయక ఉత్సవాల్లో కాస్త నిరాశపరిచే సమాచారం ఇది. ప్రతి ఏటా నగరం నడిబొడ్డున ప్రవహించే కేసీ కెనాల్ వద్ద వినాయక ఘాట్‌లో జరిగే నిమజ్జన వేడ ుకల్లో ఈసారి మార్పు తప్పనిసరిగా మారింది.
గణేశ్ నిమజ్జనానికి ప్రత్యామ్నాయం ‘హంద్రీ నీవా’
వర్షాలోస్తేనే కేసీ కెనాల్‌లో నిమజ్జనం
సుంకేసుల బ్యారేజీలో ఉన్నదే 0.378 టీఎంసీలు
తాగునీటికే ప్రాధాన్యం : కలెక్టర్ సిరి
చిన్న విగ్రహాలు ఏర్పాటు చేయాలని పిలుపు
కర్నూలు, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): వినాయక ఉత్సవాల్లో కాస్త నిరాశపరిచే సమాచారం ఇది. ప్రతి ఏటా నగరం నడిబొడ్డున ప్రవహించే కేసీ కెనాల్ వద్ద వినాయక ఘాట్‌లో జరిగే నిమజ్జన వేడ ుకల్లో ఈసారి మార్పు తప్పనిసరిగా మారింది. నీటి కొరత కారణంగా కేసీ కెనాల్‌లో కాకుండా ఈ ఏడాది హంద్రీనీవాలో నిమజ్జనానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఏ.సిరి వెల్లడించారు. వినాయక చవితి మహోత్సవాలు నిర్వహణ, నిమజ్జనం ఏర్పాట్లుపై బుధవారం కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తడంతో తుంగభద్ర చుక్కనీరు లేక ఒట్టిపోయింది. అదే క్రమంలో కేసీ కాలువ, నగర ప్రజల ప్రాణాధారమైన సుంకేసుల బ్యారేజీలో నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి. సుంకేసులు జలాశయంలో ఉన్నదే 0.378 టీఎంసీలే. ఆరు లక్షలకు పైగా జనాభా కలిగిన నగర ప్రజల దాహం తీర్చేందుకు 20-25 రోజులకు మించి సరిపోవడంతో లేదు. ఈ పరిసితుల్లో ఉత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. గణేశ్ మహోత్సవాల కేంద్ర సమితి సభ్యులు, నగరపాలక సంస్థ, జలవనరుల శాఖ, పోలీస్, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ అధికారులు హాజరయ్యారు. ప్రధానంగా ఏకదంతుడి నిమజ్జనంపై చర్చించారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా వచ్చే ఏడాది జూలై వరకు నగరంలో పాటు జిల్లాలో తాగునీటి ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సుంకేసుల జలాశయంలో ఉన్న నీటినిల్వలు గణేశ్‌చతుర్థి నాటికే ఖాళీ అయ్యే అవకాశం ఉంది. తుంగభద్ర డ్యాంలో కేసీ వాటాగా 4.50 టీఎంసీలు నిల్వ ఉన్నా.. తాగునీటికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. అంతేకాదు చుక్కనీరు లేకుండా ఒట్టిపోయిన నది ద్వారా తుంగభద్ర నీటిని తీసుకోవడం కష్టంతో కూడుకున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్సవ కేంద్ర సమి తి సభ్యులు, భక్తులు సంపూర్ణ సహకారం అందించి రాబోయే రోజుల్లో తాగునీటి సమస్య రాకుండా సహకరించాలని కలెక్టర్ సిరి సూచించారు. 2024లో ఇలాంటి పరిస్థితే తలెత్తిందని, నిమజ్జనానికి ఒక రోజు ముందు భారీ వర్షాలు రావడంతో తుంగభద్రకు వరదొచ్చి కేసీ కాలువకు నీటిని విడుదల చేశారని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఏడాది కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర కమిటీతో మాట్లాడి తుంగభద్ర డ్యాం నుంచి నీటిని విడుదల చేసేందుకు కృషి చేస్తామని సమితి సభ్యులు పేర్కొన్నారు. వర్షాలు కురిసి తుంగభద్రకు వరదొస్తే కేసీ కాల్వ వినాయక ఘాట్‌లోనే నిమజ్జన మహోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చే ద్దాం. వర్షాలు రాకపోతే ప్రత్యామ్నాయంగా నగర శివారులో ప్రవహిస్తున్న హంద్రీనీవా కాలువ నన్నూరు టోల్‌ప్లాజా, తడకనపల్లె, ఉల్లిందకొండ వద్ద లేదా గార్గేయపురం చెరువులో నిమజ్జనం చేసేందుకు భక్తులు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి హంద్రీనీవా కాలువనే ఉత్తమ ప్రత్యామ్నాయమని అధికారులు అంటున్నారు. మరో సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. ఈ సమావేశంలో కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసు, ఎస్‌ఈ రమణమూర్తి, ఏఎస్పీ హుస్సేన్‌పీరా, హంద్రీ నీవా ప్రాజెక్టు కర్నూలు సర్కిల్-1 ఎస్‌ఈ రాజన్‌బాబు, ఈఈ ప్రసాద్‌రావు, జలనవరుల శాఖ కర్నూలు సర్కిల్ డిప్యూటీ ఎస్‌ఈ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిన్న విగ్రహాలు ఏర్పాటు చేయండి : కలెక్టర్
ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు చిన్న విగ్రహాలను ఏర్పాటు చేసి సహకరించాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా తాగునీటి అవసరాల కోసమే వినియోగించాల్సి ఉంది. తాగునీటి అవసరాల కోసం కేటాయించిన నీటిని నిమజ్జనం కోసం విడుదల చేయడం సాధ్యం కాదు. వచ్చే ఏడాది జూలై, ఆగస్టు వరకు తాగునీటి అవసరాల కోసం నీటిని సంరక్షించాల్సి ఉంది. హంద్రీ నీవా కాలువలో 3,050 క్యూసెక్కులు ప్రవాహం ఉంది. నన్నూరు టోల్‌ప్లాజా, తడకనపల్లె, ఉల్లిందకొండ దగ్గర హంద్రీనీవా కాలువలో నిమజ్జనం చేసే కృష్ణమ్మ ఒడిలో గణనాథుడిని చేర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. గార్గేయపురం చెరువు కూడా పరిశీలిద్దాం. ఈ ఏడాది పెద్ద సంఖ్యలో విగ్రహాలు ఏర్పాటు చేసే అవకాశం ఉండడం, ప్రకృతి విపత్తులు, నీటి కొరత దృష్ట్యా ప్రజలు కూడా సహకారం అందిస్తూ చిన్న విగ్రహాలు ఏర్పాటు చేయాలి. నిమజ్జన ప్రదేశాల్లో ప్రజలు, భక్తగణం భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన ఏర్పాటు చేస్తాం.