Share News

సా..గుతున్న పనులు

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:23 AM

మండలంలో నిర్మిస్తున్న రహదారి విస్తరణ పనులు ఏళ్లుగా కొనసాగుతుండటంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

సా..గుతున్న పనులు
నరసాపురం, తిప్పారెడ్డిపల్లె గ్రామాల మధ్య నిర్మిస్తున్న కల్వర్టు

ఆరేళ్లుగా పూర్తికాని చాగలమర్రి- మహదేవపురం రహదారి విస్తరణ

ఆగిపోయిన కల్వర్టుల నిర్మాణం.. అవస్థలు పడుతున్న వాహనదారులు

రుద్రవరం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): మండలంలో నిర్మిస్తున్న రహదారి విస్తరణ పనులు ఏళ్లుగా కొనసాగుతుండటంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాగలమర్రి మహదేవపురం ఆర్‌అండ్‌బీ రహదారి పనులను 2020 అక్టోబరు 10న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వర్చువల్‌గా ప్రారంభించారు. 27.77 కి.మీ. లకు రూ.33.55 కోట్లు మంజూరు చేశారు. సింగిల్‌ రోడ్డును డబుల్‌ రోడ్డు విస్తరిచడం లక్ష్యం.. కాగా పనులు మాత్రం పూర్తికాలేదు.

నత్తనడకన నిర్మాణం

ఆరేళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. నరసాపురం, రుద్రవరం, చిన్నకంబలూరు, కోడిపిల్లవాగు, చెంచుగూడెం, మహదేవపురం మధ్య కల్వర్టుల పనులు నిలిచిపోయాయి. ఉన్న రోడ్డును ధ్వంసం చేసి ఇలా పూర్తిచేయకుండా వదిలేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాహనదారుల అవస్థలు..

నత్తనడకన ఆర్‌అండ్‌బి రోడ్డు పనులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. ఈ దారిలో వెళ్లే వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అడుగడుగునా గుంతలు ఉండటం చిన్న వర్షం కురిసినా వాహనాలు ఇరుక్కుపోతుండటం ఇక్కడ సాధారణమైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అహోబిళం, తిరుపతి, శ్రీశైలం, మహానంది పుణ్యక్షేత్రాలకు వెళ్లే ఇఇబ్బందులు పడుతున్నారు.

పూర్తికాని కల్వర్టులు, అధ్వానంగా సర్వీస్‌ రోడ్డు

కల్వర్టు నిర్మాణాలు పూర్తికాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. తిప్పారెడ్డిపల్లె గ్రామ సమీపంలో కల్వర్టు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఈ దారిలో వెళ్లే ట్రాక్టర్లు, ఇతర వాహనాలు ఇరుక్కుపోతున్నాయి. అదే విధంగా నరసాపురం, తిప్పారెడ్డిపల్లె గ్రామాల మధ్య కల్వర్టు పనులు సాగుతున్నాయి.

రహదారి పనులు పూర్తి చేస్తాం

రహదారి పనులను త్వరలో పూర్తి చేస్తాం. క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకుని వాహనదాలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. - సుబ్బరాయుడు, డీఈ, ఆర్‌అండ్‌బీ, నంద్యాల

Updated Date - Oct 08 , 2026 | 12:23 AM