రావణ వాహనంపై విహారం
ABN , Publish Date - Feb 12 , 2026 | 11:56 PM
శ్రీగిరిపై మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేత్రానందభరితంగా సాగుతున్నాయి.
ఆది దంపతులను దర్శించుకున్న భక్తజనం
వైభవంగా శ్రీగిరిపై బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): శ్రీగిరిపై మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేత్రానందభరితంగా సాగుతున్నాయి. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన గురువారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి రావణ వాహనంపై పుర వీధుల్లో విహరించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పుష్పాలంకరణ చేసిన ప్రత్యేక వేదికపై రావణ వాహనంలో ఆశీనులైన స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన గోపురం నుండి మాడవీధి, నందిమండపం, బయలు వీరభద్రస్వామి ఆలయాల గుండా గ్రామోత్సవం చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు చేసిన నృత్యాలకు ఆకర్షితులైన మంత్రి ఆనం కళాకారులతో కలిసి అడుగులు కలిపారు. గ్రామోత్సవంలో ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్‌బోర్డు ఛైర్మెన్ పోతుగుంట రమేష్‌నాయుడు, సభ్యులు దేవకి వెంకటేశ్వర్లు, ఏవీ రమణ. అనిల్ కుమార్, శివమ్మ, ఆలయ అధికారులు ఈఈ నర్సింహారెడ్డి, బాలమురళీకృష్ణ, పీఆర్‌వో శ్రీనివాసరావు, ఎడిటర్ అనీల్ కుమార్ ఆలయ ముఖ్య భద్రతాధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ప్రభుత్వ పట్టు వస్త్రాల సమర్పణ
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ రాంచంద్రమోహన్, కలెక్టర్ రాజకుమారితో కలిసి మంత్రి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకోగా దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి ఛైర్మెన్ పోతుగుంట రమేష్‌నాయుడు, సభ్యులు దేవకి వెంకటేశ్వరరావు, ఆల అనీల్‌కుమార్, కట్ట సుధాకర్ రెడ్డి, ఏవీ రమణ, మురళీధర్, శివమ్మ ఆలయ సంప్రదాయం ప్రకారం తిలక ధారణ చేసి మేళతాళాలతో స్వాగతం పలికారు. కృష్ణ దేవరాయ గోపురం వద్ద పట్టు వస్త్రాలకు పూజాదికాలు నిర్వహించి ఆలయ ప్రదక్షిణలు చేసిన అనంతరం స్వామి అమ్మవార్లకు సమర్పించారు. ప్రభుత్వ ప్రతినిధులు మల్లన్నకు ప్రత్యేక పూజలు చేసుకుని పరివార దేవతాలయాలను దర్శించుకున్నారు. ఆశీర్వచన మండపంలో వేదపండితులు మంత్రి, ఎమ్మెల్యే, కమిషనర్, కలెక్టర్‌లను ఆశీర్వదించి ్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు.