కాలువలకు పునర్జీవం..!
ABN , Publish Date - May 22 , 2026 | 11:29 PM
కాలువలు బాగుంటేనే చివరి ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. పంట చేలు పచ్చని పైర్లతో సస్యశ్యామలం అవుతాయి.
మరమ్మతులపై ప్రభుత్వం ఫోకస్
కేసీ, టీబీపీ ఎల్లెల్సీ, జీడీపీ సహా మైనర్ ఇరిగేషన్ కాలువలకు మరమ్మతులు
298 పనులకు రూ.28.47 కోట్లు
సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో మరమ్మతులకు శ్రీకారం
కాలువలు బాగుంటేనే చివరి ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. పంట చేలు పచ్చని పైర్లతో సస్యశ్యామలం అవుతాయి. అన్నదాతల మోమున దరహాసం చిందుతుంది. అయితే.. దశాబ్దాలు కాలంగా పంట కాలువలు, తూములు, డిస్ట్రిబ్యూటర్లకు మరమ్మతు చేయడం లేదు. కాల్వలు పూడికతో నిండిపోగా, గట్లు పటిష్టత దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ప్రధాన కాలువలతో పాటు ఆయకట్టుకు సాగునీరు అందించే మేజరు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, పంట కాలువల మరమ్మతులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. జూన్ 15 నుంచి ఖరీఫ్ ప్రారంభం ప్రారంభం అవుతుంది. ఈలోగా శిథిలమైన పంట కాలువల మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. కేసీ, టీబీపీ ఎల్లెల్సీ, గాజులదిన్నె ప్రాజెక్టు, మైనర్ ఇరిగేషన్ కాలువలకు పునర్జీవం తీసుకొచ్చేందుకు 298 పనులకు రూ.28.47 కోట్లు మంజూరు చేశారు. సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో పనులు మొదలు పెట్టారు. ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కర్నూలు, మే 22 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలు సహా కడప జిల్లాలో కర్నూలు-కడప (కేసీ) కాలువ కింద 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ) ద్వారా ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో 1.51 లక్షల ఎకరాలకు సాగు, 196 గ్రామాలకు తాగునీరు, గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ) ద్వారా గోనెగండ్ల, కోడుమూరు, దేవనకొండ, కృష్ణగిరి మండలాల్లో 25 వేల ఎకరాలుకు సాగునీరు అందించాల్సి ఉంది. గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకాలు ద్వారా ఎల్లెల్సీ ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలి. చిన్ననీటి పారుదల శాఖ పర్యవేక్షణలోని 246 చెరువుల కింద 33 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. ఆయా సాగునీటి వనరుల ద్వారా ఉమ్మడి జిల్లాలో 4.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంటే, సగం ఆయకట్టుకు కూడా సాగునీరు అందని దైన్యపరిస్థితి ఉంది. ఇందుకు ప్రధాన కారణం.. పంట చేలు తడిపే కాలువలు పూడికతో నిండిపోవడం, తూములు, డిస్ట్రిబ్యూటరీలు, షట్టర్లు శిథిలావస్థకు చేరడమే. నీటి కాలువల పునరుద్ధరణకు గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైతుల పాలిట జీవనాడులైన సాగునీటి కాలువలు బాగు చేయడం వల్ల వ్యవసాయ ఆదాయం పెరుగుతుంది. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త జీవం వస్తుందని సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఖరీఫ్ ప్రారంభానికి ముందే పంట కాలువల మరమ్మతులకు శ్రీకారం చుట్టింది. సాగుకు భరోసా ఇస్తూ.. మరమ్మతుల పంటలకు సకాలంలో సాగునీరు అందించడం వల్ల నిరుపయోగంగా మారిన చివరి ఆయకట్టు భూములను కూడా పచ్చన పైర్లతో సస్యశ్యామలం చేసేందుకు నడుం బిగించింది.
298 పనులు.. రూ.28.47 కోట్లు:
కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల రైతుల ప్రాణాధారమైన కేసీ కాలువ పరిధిలో తూములు, డిస్ర్టిబ్యూటరీలు, షట్టర్లు పూర్తిగా పాడైపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరు ఎండమావిగా మారింది. వీటి మరమ్మతుల కోసం కర్నూలు జిల్లాలో 25 పనులకు రూ.2.50 కోట్లు, నంద్యాల జిల్లాలో 90 పనులకు రూ.8.23 కోట్లు, కడప జిల్లాలో 41 పనులకు రూ.3.10 కోట్లు మంజూరు చేశారు. కర్నూలు జిల్లాలో ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాల్లో టీబీపీ ఎల్లెల్సీ (ఎల్లెల్సీ, జీడీపీ) డివిజన్ పరిధిలో 64 పనులకు రూ.5.49 కోట్లు, గురురాఘవేంద్ర ప్రాజెక్టు డివిజన్ పరిధిలో 10 పనులకు రూ.91.70 లక్షలు, పీడబ్ల్యూ డివిజన్‌ల పరిధిలో ఒక పనికి రూ.2.50 కోట్లు, మైనర్ ఇరిగేషన్ (ఎంఐ) డివిజన్ పరిధిలో 67 పనులకు రూ.5.73 కోట్లు చొప్పున 167 పనులకు రూ.17.13 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులను సాగునీటి సంఘాల పర్యవేక్షణలో చేపడుతున్నారు. ఎలాంటి టెండర్లు లేకుండా సాగునీటి సంఘాలకే నామినేషన్ కింద పనులు కేటాయించడంతో ఇక ఆయా సంఘాల అధ్యక్షులకు కాసులు పండినట్లేనని పలువురు పేర్కొంటున్నారు. అయితే.. రైతుల ప్రాణాధారమైన కాలువల మరమ్మతు పనుల నాణ్యతా ప్రమాణాల్లో రాజీపడకుండా చేయాల్సిన బాధ్యత ఇంజనీర్లదే.
జిల్లాలో నియోజకవర్గాల వారీగా మంజూరైన పనులు, నిధులు. రూ.కోట్లల్లో
నియోజకవర్గం పనులు నిధులు
ఆదోని 21 2.50
ఆలూరు 36 2.00
కోడుమూరు 25 2.50
కర్నూలు 1 2.50
మంత్రాలయం 32 2.54
పత్తికొండ 18 2.10
ఎమ్మిగనూరు 34 2.99
మొత్తం 167 17.13
వివిధ కాలువల కింద చేపట్టే పనులు, నిధులు రూ.కోట్లల్లో
సాగునీటి కాలువ పనులు నిధులు
కేసీ కాలువ 156 13.83
టీబీపీ ఎల్లెల్సీ, జీడీపీ 64 5.49
గురురాఘవేంద్ర 10 0.92
పీడబ్ల్యూ డివిజన్ 1 2.50
మైనర్ ఇరిగేషన్ 67 5.73
మొత్తం 298 28.47