కష్టకాలంలోనూ రైతన్నపై దోపిడీ!
ABN , Publish Date - Oct 07 , 2026 | 11:27 PM
కష్టకాలంలోనూ రైతన్నపై దోపిడీ!
శనగ విత్తనాల ధరను పెంచేసిన వ్యాపారులు
కర్నూలుకు 33,200 క్వింటాళ్లు, నంద్యాలకు 38వేల క్వింటాళ్ల కేటాయింపు
నీరుగారుతున్న ప్రభుత్వ ఆశయం
ఉచితంగా విత్తనాలు ఇవ్వాలంటున్న రైతులు
కర్నూలు అగ్రికల్చర్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): కష్టకాలంలో రైతులపై కాస్తయినా కనికరం చూపిద్దామన్న ఆలోచన వ్యాపారులకు కలగడం లేదు. లాభాల కోసం తెగబడుతూ అన్నదాతలను నిలువునా ముంచేస్తున్నారు. కేవలం రెండు నెలల్లోనే ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వానికి సప్లయ్ చేస్తున్న శనగ విత్తనాలపై వ్యాపారులు పొందుతున్న లాభాలే ఇందుకు నిదర్శనం. రైతులపై భారాన్ని తగ్గించి తక్కువ ధరకే రాయితీ విత్తనాలను అందించాలన్నది ప్రభుత్వ ఆలోచన. కానీ క్షేత్ర స్థాయిలో వ్యాపారులు మాత్రం ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తూ రైతులను అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రస్తుతం రబీలో కర్నూలు, నంద్యాల జిల్లాలో పప్పుశనగ పంటను సాగు చేసేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ప్రభుత్వం ఎప్పుడెప్పుడు రాయితీ శనగ విత్తనాలను అందిస్తుందా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. కర్నూలు జిల్లాలో 33,200 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాలో 38వేల క్వింటాళ్ల శనగ విత్తనాలను రైతులకు రాయితీపై అందించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రస్తుతం రెండు జిల్లాల్లో వ్యాపారుల నుంచి శనగ విత్తనాలను క్వింటాకు రూ.9వేలు చెల్లించి కొనుగోలు చేసేందుకు ఏపీ సీడ్స్ సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. రెండు జిల్లాల్లో ఇప్పటికీ వ్యాపారుల నుంచి ఏపీ సీడ్స్ అధికారులు 40వేల క్వింటాళ్ల దాకా విత్తనాలను సేకరించి గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల వద్దకు చేర్చారు. ప్రస్తుతం ఆయా రైతు సేవా కేంద్రాల్లో రైతులకు విత్తనాలు పంపిణీ చేసే కార్యక్రమం మొదలైంది.
దోపిడీ ఇలా..?
ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు ప్రభుత్వం 35 శాతం నుంచి 50 శాతం సబ్సిడీతో విత్తనాలను అందిస్తుంది. ఇందుకోసం రూ.కోట్లను ఖర్చు చేస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే కార్యక్రమాన్ని వ్యాపారులు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంలోని కీలక నేతలతో వ్యాపారులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం ఏపీ సీడ్స్ సంస్థ ఈ ఖరీఫ్, రబీ సీజన్లలో రైతుల నుంచి ప్రధాన పంటలకు సంబంధించిన విత్తనాలను ఉత్పత్తి చేయించాలి. కానీ పలు కారణాల నేపథ్యంలో ఏపీ సీడ్స్ సంస్థ దశాబ్ద కాలం నుంచి ఆ కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. దీంతో మరోదారి లేక ఆ సంస్థ వ్యాపారులు (ఆర్గనైజర్లు)పైనే ఆధారపడింది. వ్యాపారులు రైతుల నుంచి మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకే వేరుశనగ, పప్పుశనగ, కందులు, తదితర పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి రెండు మూడు నెలలు కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లలో నిల్వ చేస్తున్నారు. పంట సీజన్ మొదలయ్యేసరికి వాటిని బయటకు తీసి ప్రభుత్వానికి పెద్ద మొత్తం ధరను డిమాండ్ చేసి అనుమతులు తీసుకుని తిరిగి రైతులకు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం రబీ సీజన్‌లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 71,000 క్వింటాళ్లు రైతులకు 35 శాతం రాయితీపై అందించేందుకు వ్యవసాయ శాఖ యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. వాస్తవాలను పరిశీలిస్తే వ్యాపారులు మార్కెట్ యార్డులో రైతుల నుంచి కేవలం క్వింటాకు రూ.7వేలు మాత్రమే చెల్లించి కొనుగోలు చేశారు. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం రూ.9వేలు ధర అందేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. స్టోరేజీ, రవాణా ఇతరత్రా ఖర్చులన్నీ కలిపినా కూడా వ్యాపారులపై అధిక మొత్తంలోనే సబ్సిడీ విత్తనాలను అందజేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వంపై మోయలేని భారం
ప్రభుత్వం ఏటా రైతులకు తప్పనిసరిగా నాణ్యమైన విత్తనాల అవసరం ఉంటుంది. అందువల్ల గతంలో ఏపీ సీడ్స్, మార్క్‌ఫెడ్, ఆయిల్ ఫెడ్ సంస్థల నుంచి ఫౌండేషన్ సీడ్స్‌ను ఉత్పత్తి చేయించి రైతులకు అందించేవారు. ఈ సంస్థల అధికారులు రైతులకు తక్కువ ధరకే ఫౌండేషన్ సీడ్స్‌ను అందించడమే కాకుండా పొలాలకు వెళ్లి అధిక దిగుబడిని సాధించేలా చర్యలు తీసుకోవడం జరిగేది. ఈ వ్యవహారాన్ని భారంగా భావించిన అధికారులు విత్తనాల సేకరణ బాధ్యత నుంచి తప్పుకున్నారు. ప్రభుత్వం కూడా ఇంత ప్రయాస ఎందుకనే ధోరణితో ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో వ్యాపారులు (ఆర్గనైజర్లు) నుంచే విత్తనాలను కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే విత్తనాలను వ్యాపారులు రైతుల చేత కొనుగోలు చేసి కేవలం రెండు, మూడు నెలలు కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లలో నిల్వ చేసి వాటిని రైతులకు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రైతులకు ప్రస్తుతం పంపిణీ చేస్తున్న 71వేల క్వింటాళ్ల శనగలపై లెక్క వేస్తే వ్యాపారులకు దాదాపు రూ.కోట్లలోనే లాభం అందుతోంది.
ఉచితంగా అందించాలని రైతుల డిమాండ్
గత ఖరీ్‌ఫలో ఎల్‌నినో ప్రభావంతో పంటలన్నీ ఎండిపోయి చేతికందక రైతులు నష్టాల్లో మునిగిపోయారు. కనీసం రబీలోనైనా ప్రభుత్వం తమకు నూరు శాతం సబ్సిడితో శనగ విత్తనాలను అందిస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం గతం మాదిరిగానే 35 శాతం సబ్సిడీతో శనగ విత్తనాలను పంపిణీ చేసేందుకు సిద్ధం కావడం రైతుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. శనగ విత్తనాల పూర్తి ధర రూ.9వేలు కాగా, అందులో 35 శాతం పోను రైతులు క్వింటం విత్తనాలకు రూ.5,850 చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడున్న గడ్డు పరిస్థితుల్లో ఒక క్వింటా విత్తనాలకే అంత పెద్ద మొత్తం ఏ విధంగా భరించాలని రైతులు మధనపడుతున్నారు. తమకు ఉచితంగా విత్తనాలను అందిస్తే విత్తనాలు కొనే భారం తగ్గిపోతుందని వారి ఆవేదన.
ధర నిర్ణయం మా చేతుల్లో లేదు
ప్రభుత్వం సబ్సిడీపై ఆయా పంటలకు సంబంధించి నాణ్యమైన విత్తనాలను రైతులకు అందిస్తోంది. ప్రస్తుత రబీలో ఉమ్మడి జిల్లాలోని రైతులకు 71 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పూర్తి స్తాయిలో నాణ్యత కలిగిన విత్తనాలను సేకరిస్తున్నాం. పప్పుశనగ విత్తనాల ధర నిర్ణయం మా పరిధిలో ఉండదు. రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ ఏపీ సీడ్స్, మార్కెటింగ్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన విత్తనాలను సేకరించేందుకే ప్రభుత్వం ఆ ధరను నిర్ణయించడం జరిగింది. విత్తనాలను పూర్తి స్థాయిలో నాణ్యతను పరిశీలించిన తర్వాతనే ఆయా సంస్థల నుంచి విత్తనాలను సేకరిస్తాం.
- ధనలక్ష్మి, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్