రెవెన్యూ శాఖ పాత్ర కీలకం: కలెక్టర్
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:16 AM
పుట్టినప్పటి నుంచి మరణానంతర సేవల వరకు ప్రజల జీవితంలో ప్రతి దశలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ డా. ఎ. సిరి తెలిపారు.
కర్నూలు కలెక్టరేట్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): పుట్టినప్పటి నుంచి మరణానంతర సేవల వరకు ప్రజల జీవితంలో ప్రతి దశలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ డా. ఎ. సిరి తెలిపారు. నగరంలోని కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన రెవెన్యూ దినోత్సవంలో కలెక్టర్‌తో పాటు జేసీ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, భూ సమస్యల పరిష్కారం, ఎన్నికల నిర్వహణ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలు, శాంతిభద్రతల పరీరక్షణ, మెజిస్ర్టేట్ విధులు, కొవిడ్ వంటి అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించడంలో రెవెన్యూశాఖ విశిష్టమైన బాధ్యతలను నిర్వహిస్తోందన్నారు. నేటి తరానికి చెందిన కొత్త రెవెన్యూ ఉద్యోగులకు శాఖ విధులు, బాధ్యతలు, చట్టాలు, పరిపాలనా విధానాలపై పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.