Share News

గురుకుల ఆణిముత్యాలు

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:12 AM

మండలంలోని ఆరేకల్‌ జాతిబా పూలే గురుకుల బాలికల కళాశాల విద్యార్థినులు ఇంటర్‌ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో 107మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 107మంది మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. సీబీ శ్రీలక్ష్మీ తేజస్విని బైపీసీలో 453 మార్కులతో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించింది

గురుకుల ఆణిముత్యాలు
విద్యార్థినులను సన్మానిస్తున్న ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌

ఇంటర్‌లో ప్రభంజనం సృష్టించిన విద్యార్థినులు

పేదింట సరస్వతీ పుత్రికలు

ఫలితాల్లో స్టేట్‌ ర్యాంకులు

అభినందనలు తెలిపిన ప్రజాప్రతినిధులు

ఆదోని రూరల్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆరేకల్‌ జాతిబా పూలే గురుకుల బాలికల కళాశాల విద్యార్థినులు ఇంటర్‌ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో 107మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 107మంది మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. సీబీ శ్రీలక్ష్మీ తేజస్విని బైపీసీలో 453 మార్కులతో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించింది. సీఈసీలో పి.సురేఖ 496 మార్కులతో స్టేట్‌ మొదటి ర్యాంకు ఎంపికైంది. కారుమంచి మంజుల 500కు 494మార్కులు సాధించి స్టేట్‌ 3వ ర్యాంకుగా నిలిచింది. ఎల్లబోయిన జట్టు లక్ష్మీదేవి, తోడేల పూజ, షేక్‌ దిల్సన్‌, దూదేకుల రజియా బైపీసీలో 452మార్కులు సాధించి స్టేట్‌ రెండో ర్యాంకుకు ఎంపికయ్యారు. వీరు స్టేట్‌ ర్యాంకు సాధిం చడంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వెబ్‌సెట్‌లో వీర పేర్లు నమోదు చేస్తూ స్టేట్‌ ర్యాంకు జాబితాలను విడుదల చేసింది.

ఇంటర్‌ సెకండియర్‌లో 142మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 114మందికి వెయ్యి మార్కులకు 900 మార్కులకుపైగానే వచ్చాయి.

ప్రతిభను చాటిన పేదింటి విద్యార్థినులు

పేదింటి విద్యార్థినులు రాష్ట్రస్థాయిలో ప్రతిభను చాటారు. దీంతో గురుకుల కళాశాల సిబ్బంది, విద్యార్థినుల తల్లిదండ్రులు ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి. ప్రజా ప్రతినిధులు సైతం వీరిని అభినందించారు. త్వరలో వీరిని ఘనంగా సన్మానించారు. లక్షల కు లక్షలు పెట్టి ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు సాధించలేని విజ యాలను ఈ పేదింటి విద్య కుసుమాలు సాధించడంతో మరికొంతమంది పేద విద్యార్థులకు వీరు ఆదర్శంగా నిల్వబోయారు.

డాక్టర్‌ అయి పేదలకు సేవలందిస్తా

బాగా చదివి డాక్టర్‌ అవుతా. పేదలకు సేవలందిస్తా. మాది సి.బెళగల్‌ గ్రామం. నాన్న రాఘవరెడ్డి, అమ్మ సౌమ్య. ఆరేకల్‌ బాలికల గురుకుల కళాశాలలో చదువుతున్నా. బైపీసీలో 453 మార్కులు వచ్చాయి. అధ్యాపకుల, తల్లిదండ్రుల అండతోనే ఇది సాధ్యం. - సీబీ శ్రీలక్ష్మీ తేజస్విని, బైపీసీ, స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌

టీచర్‌ అవుతా..

సీఈసీలో 496 మార్కులు వచ్చాయి. ఆనందంగా ఉంది. ఇంకా బాగా చదివి ఉపాధ్యాయురాలు అవుతా. మాది కోడుమూరు మండలం కొత్తపల్లి గ్రామం. నాన్న లక్ష్మన్న, అమ్మ సావిత్రి. మేము ఐదుగురు ఆడపిల్లలం. అమ్మానాన్నలు రోజువారి రైతు కూలీలు. కష్టపడి చదివిస్తున్నారు. ఆరేకల్‌ గురుకుల బాలికల కళాశాలలో చదువుతున్నా. - పి.సురేఖ, సీఈసీ, స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌

స్టేట్‌ ర్యాంకులు రావడం ఆనందంగా ఉంది

తమ కళాశాలకు చెందిన విద్యార్థినులకు స్టేట్‌ ర్యాంకులు రావడం ఆనందంగా ఉంది. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌లో 100 శాతం ఉత్తీర్ణం సాధించాం. విద్యార్థినులకు కార్పొరేట్‌ కళాశాలలకు దీటుగా విద్యను అందించాం. - శ్రీదేవి, ప్రిన్సిపాల్‌, ఆరేకల్‌ బాలికల గురుకుల కళాశాల, ఆదోని

విద్యార్థినులకు విజయానికి నిరంతరం శ్రమించాం

ఇంటర్‌ సిలబ్‌సను సకాలంలో పూర్తి చేశాం. నిరంతరం పరీక్షలను రాయించాం. ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థినుల విజయానికి కృషిచేశాం. స్టేట్‌ ర్యాంకులు రావడంతో సంతోషంగా ఉంది. - యమునాదేవి, వైస్‌ ప్రిన్సిపాల్‌, ఆరేకల్‌ బాలికల గురుకుల కళాశాల, ఆదోని

Updated Date - Apr 19 , 2026 | 12:12 AM