ఆర్లబండలో ప్రశాంతంగా రీ పోలింగ్
ABN , Publish Date - Nov 06 , 2026 | 11:58 PM
కోసిగి మండలం ఆర్లబండ గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నంబర్-2లో శుక్రవారం నిర్వహించిన రీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
62.37 శాతం ఓటింగ్ నమోదు
భారీ పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్
కోసిగి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): కోసిగి మండలం ఆర్లబండ గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నంబర్-2లో శుక్రవారం నిర్వహించిన రీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం జరిగిన పోలింగ్ సందర్భంగా బూత్ క్యాప్చరింగ్ ఆరోపణలు రావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు శుక్రవారం రీపోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 62.37 శాతం ఓటింగ్ నమోదైనట్లు కోసిగి మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ లోకరాజు వెల్లడించారు. రీ పోలింగ్ నేపథ్యంలో ఆర్లబండ గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వందలాది మంది పోలీసు సిబ్బందిని మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామంలోకి ఇతర గ్రామాల వ్యక్తులు ప్రవేశించకుండా ప్రధాన రహదారులతో పాటు వివిధ మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఏఆర్ ఏఎస్పీ కృష్ణమోహన్, ఎమ్మిగనూరు డీఎస్పీ ఎ.శ్రీనివాస్, కర్నూలు మహిళా పోలీ్‌సస్టేషన్ డీఎస్పీ ఎం.ఉపేంద్రబాబు, ఎస్బీ-2 డీఎస్పీ పి.టి.కేశవరెడ్డితో పాటు సీఐలు మంజునాథ్, చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, కంబగిరి రాముడు, చిరంజీవి, మస్తాన్‌వలి, ఎస్‌ఐలు రమే్‌షరెడ్డి, మారుతి, తిమ్మారెడ్డి, విజయ్‌కుమార్‌నాయక్‌తో పాటు పోలీసు సిబ్బంది రీపోలింగ్ సందర్భంగా పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. రీపోలింగ్ నిర్వహణ తీరును మంత్రాలయం నియోజకవర్గ ఎన్నికల అధికారి, పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, ఆదోని ఆర్డీఓ అరుణాదేవి, కర్నూలు జెడ్పీ సీఈఓ సుధాకర్‌రెడ్డి వేర్వేరు సమయాల్లో పరిశీలించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారుల పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇందులో అసిస్టెంట్ ఆర్వో అధికారులు తహసీల్దార్ గీత ప్రియదర్శిని, ఎంపీడీఓ ఎస్‌ఎం బాషా తదితరులు ఉన్నారు.