పప్పుశనగ రైతులకు ఊరట
ABN , Publish Date - Mar 02 , 2026 | 11:54 PM
ఇప్పటిదాకా కర్నూలు మార్కెట్ యార్డులో పప్పుశనగ రైతులకు అంతంత ధర మాత్రమే అందింది.
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాలో 40వేల మెట్రిక్ టన్నులు కొనడానికి ఏర్పాట్లు
కర్నూలు అగ్రికల్చర్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఇప్పటిదాకా కర్నూలు మార్కెట్ యార్డులో పప్పుశనగ రైతులకు అంతంత ధర మాత్రమే అందింది. కేంద్ర ప్రభుత్వం క్వింటా పప్పుశనగలకు రూ.5850 మద్దతు ధరగా నిర్ణయించింది. బహిరంగ మార్కెట్లో రైతులకు కేవలం రూ.5వేలు మాత్రమే దక్కుతోంది. దీంతో పాటు తరుగు పేరుతో వ్యాపారులు రైతులను నిండా ముంచుతున్నారు. ఈ పరిస్థితి నుంచి రైతులను గట్టెక్కించి మద్దతు ధరకు పప్పు శనగలను రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు కేంద్ర సంస్థ నాఫెడ్‌ను కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. దీంతో పప్పుశనగను సాగు చేసిన రైతులు నష్టాల బారి నుంచి గట్టెక్కే అవకాశం దక్కింది. నాఫెడ్ సంస్థ కర్నూలు జిల్లాలో మార్క్‌ఫెడ్ సంస్థను నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాలను మార్క్‌ఫెడ్ సంస్థ ఏర్పాటు చేసి రైతుల నుంచి పప్పుశనగలను కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు సేకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 40వేల మెట్రిక్ టన్నుల శనగలను నాఫెడ్ సంస్థ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. రబీలో ఉమ్మడి జిల్లాలో 2,59,920 ఎకరాల్లో పప్పుశనగ పంటను సాగు చేశారు. కర్నూలు జిల్లాలో 1,14,025 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 1,45,895 ఎకరాల్లో శనగ పంటను రైతులు సాగు చేశారు. ఎకరాకు కనిష్ఠంగా 5 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్ల దాకా రైతులకు అందే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి.
జేసీ ఆదేశాలతో మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలు..
గ్రామాల్లో వ్యాపారులు రైతుల నుంచి పప్పుశనగ కొనుగోళ్లలో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. తక్కువ ధరను చెల్లించడంతో పాటు తరుగు పేరుతో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతుండటంతో రైతులు కర్నూలు మార్కెట్ యార్డుకు పప్పుశనగలను అమ్మకానికి తీసుకువస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన కలెక్టర్ డా. సిరి జిల్లాలోని మార్కెట్ యార్డులో పప్పుశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్క్‌ఫెడ్ సంస్థ అధికారులను ఆదేశించారు. దీంతో ఇటీవల కర్నూలు మార్కెట్ యార్డులో డీసీఎంఎస్ అధికారులు రాజీవ్, సంతోష్‌లు పప్పుశనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ప్రస్తుతం రైతులు నాఫెడ్ సంస్థ నిర్ణయించిన నిబంధనల మేరకు పప్పుశన గలను తమ కేంద్రానికి తీసుకురావాలని రైతుల కు విజ్ఞప్తి చేశారు. ఆధార్ కార్డుతో పాటు సాగు చేసిన పంట వివరాలను అదే విధంగా బ్యాంకు పుస్తకాలను వెంట తెచ్చుకోవాలని, శాంపుల్స్‌ను పరిశీలించిన తర్వాత తాము తేదీని నిర్ణయించి రైతులకు సమాచారం అందిస్తామని, వెంటనే పప్పుశనగలను వారి నుంచి కొనుగోలు చేసి 15రోజుల్లోపు డబ్బులను రైతుల ఖాతాలకు జమ చేస్తామని డీసీఎంఎస్ అధికారి రాజు తెలిపారు.
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
రైతుల నుంచి వద్ద మాత్రం మద్దతు ధరపై పప్పుశనగలను కొనుగోలు చేస్తాం. చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇస్తాం. పైన పేర్కొన్న నిర్దేశిత నాణ్యత ప్రమాణాలు ఉన్న వాటిని మాత్రమే కొంటాం. రైతు బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని డీసీఎంఎస్ అధికారి రాజు తెలిపారు.
- రాజు, డీసీఎంఎస్ అధికారి
పప్పుశనగ నాణ్యత ప్రమాణాలు ఈ విధంగా ఉండాలి
వివరాలు నాణ్యత
ప్రమాణాలు
వ్యర్థ పదార్థాలు ఒక శాతం
పప్పుదినుసుల గింజలు 3 శాతం
దెబ్బతిన్న పప్పుదినుసుల గింజలు 3 శాతం
కొద్దిగా దెబ్బతిన్న, 4 శాతం
రంగులేని పప్పుదినుసుల గింజలు
పక్వానికి రాని పప్పుదినుసు గింజలు 6 శాతం
ఇతర శనగ పంట రకాల గింజలు 2 శాతం
పురుగుపట్టిన పప్పు దినుసుల గింజలు 4 శాతం
తేమ శాతం 14 శాతం