Share News

పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలి

ABN , Publish Date - Mar 30 , 2026 | 11:49 PM

50 సంవత్సరాలు పైబడిన కార్మికుల విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని కోరుతూ సోమవారం మధ్యాహ్నం కర్నూలు జీజీహెచ్‌లోని పద్మావతి శానిటేషన్‌ ఏజెన్సీ ఆఫీసు ఎదుట విధులు బహిష్కరించి పారిశుధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల వరకు ఆఫీసు ఎదుట ఆందోళన చేశారు

పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలి
ఏజెన్సీ ఆఫీసు ఎదుట ఆందోళన చేస్తున్న పారిశుధ్య కార్మికులు

ఏజెన్సీ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికుల ఆందోళన

కర్నూలు హాస్పిటల్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): 50 సంవత్సరాలు పైబడిన కార్మికుల విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని కోరుతూ సోమవారం మధ్యాహ్నం కర్నూలు జీజీహెచ్‌లోని పద్మావతి శానిటేషన్‌ ఏజెన్సీ ఆఫీసు ఎదుట విధులు బహిష్కరించి పారిశుధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల వరకు ఆఫీసు ఎదుట ఆందోళన చేశారు. మేనేజర్లు వేధింపులు ఆపాలని, పెండింగ్‌ జీతాలు విడుదల చేయాలని, అక్రమంగా తొలగించిన పారిశుధ్య కార్మికులను విధుల్లోనికి తీసుకోవాలని నినాదాలు చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్‌ రాధాకృష్ణ, నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు మాట్లాడుతూ రాయలసీమలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుధ్య పనుల టెండర్లు దక్కించుకున్న తిరుపతికి చెందిన పద్మావతి ఫెర్టిలిటీ ఏజెన్సీ యాజమన్యం కార్మికులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తోందని అన్నారు. జీతం అడిగితే 50 సంవత్సరాలు పైబడిన వారిని తొలగించాలన్న లింకు పెట్టి బెదిరిస్తున్నారన్నారు. ఓ పక్క ప్రభుత్వ సంస్థల్లో 62 సంవత్సరాలకు రిటైర్మెంట్‌ ఉంటుందని జీవోలు ఉండగా.. కర్నూలు జీజీహెచ్‌లో మాత్రం 50 సంవత్సరాల కార్మికులు ఉండకూడదని చెబుతున్నారని, హైకోర్టు స్టే ఇచ్చిన ఇక్కడ అవి చెల్లవని ఏజెన్సీ మేనేజర్లు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్మికుల ఆందోళన ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఏజెన్సీ మేనేజర్లతో మాట్లాడించారు. 50 సంవత్సరాల అంశం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తామని, జీతాలు వారం రోజుల్లో విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళనను విరమించారు.

Updated Date - Mar 30 , 2026 | 11:49 PM