Share News

మరణంలోనూ వీడని బంధం

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:27 AM

పెళ్లినాటి ప్రమాణాలను ఆ దంపతులు అక్షరాల నిజం చేశారు. బ్రతికినా, చచ్చినా నీతోనే అంటూ కాలగమనాన్ని సైతం వారు శాషించారు. చావు కూడా వారి దాంపత్య బంధాన్ని వీడదీయలేకపోయింది.

మరణంలోనూ వీడని బంధం
సుబ్బరాయుడు, లక్ష్మీదేవి (ఫైల్‌)

భార్య అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగానే భర్త మృతి

ఆత్మకూరులో విషాదం

ఆత్మకూరు, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): పెళ్లినాటి ప్రమాణాలను ఆ దంపతులు అక్షరాల నిజం చేశారు. బ్రతికినా, చచ్చినా నీతోనే అంటూ కాలగమనాన్ని సైతం వారు శాషించారు. చావు కూడా వారి దాంపత్య బంధాన్ని వీడదీయలేకపోయింది. అనారోగ్యంతో భార్య మృతిచెందగా ఆ శోకాన్ని తట్టుకోలేక భర్త గుండె కూడా గంటల వ్యవధిలోనే ఆగిపోయింది. ఈ విషాద ఘటన బుధవారం ఆత్మకూరు పట్టణంలో జరిగింది. వివరాలివీ.. ఆత్మకూరు పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన మంగలి సుబ్బరాయుడు (63), లక్ష్మీదేవి (56) దంపతులకు 33ఏళ్ల క్రితం వివాహమైంది. సుబ్బరాయుడు ఎల్‌ఐసీ ఏజెంట్‌గా ఆత్మకూరులో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు సంతానం. అయితే గత కొంతకాలంగా సుబ్బరాయుడు భార్య లక్ష్మీదేవి అనారోగ్యంతో బాధపడుతుండేవారు. ఈక్రమంలో ఆమె మంగళవారం మృతిచెందారు. ఆమె అంత్యక్రియలను బుధవారం ఉదయం మొదలుపెట్టగానే ఆమె భర్త సుబ్బరాయుడు ఇంటి వద్దే ఉన్నట్లుండి గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే బంధువులు ఆయనను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే సుబ్బరాయుడు మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆ ఇంట్లో మరింత విషాదం అలుముకుంది. భార్యతో పాటు ఆమె భర్త అంత్యక్రియలను కొనసాగించారు. మరణంలోనూ భార్య భర్తల బంధాన్ని వీడని వీరిని చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.

Updated Date - Aug 20 , 2026 | 12:27 AM