Share News

ప్రశాంతంగా రీ-ఎగ్జామినేషన్‌

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:22 AM

ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా ఉన్న వైద్యకళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ రీ-ఎగ్జామినేషన్‌ ఆదివారం ప్రశాంతంగా జరిగింది.

ప్రశాంతంగా రీ-ఎగ్జామినేషన్‌

జిల్లాలో ‘నీట్‌’కు 92.29 శాతం హాజరు నమోదు

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

కర్నూలు ఎడ్యుకేషన్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా ఉన్న వైద్యకళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ రీ-ఎగ్జామినేషన్‌ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఎన్‌టీఏ ఆధ్వర్యంలో నీట్‌ ఎగ్జామినేషన్‌ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు కొనసాగింది. దివ్యాంగుల అభ్యర్థులకు 6.15 గంటల వరకు అనుమతించారు. అభ్యర్థులను ఉదయం 11.30 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. 1.30 గంటల తర్వాత అభ్యర్థులు ఎవరినీ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు. కర్నూలు నగరంలో 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 4995 మంది అభ్యర్థులు నీట్‌ పరీక్షకు నమోదు చేసుకున్నారు. 4610 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 375 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. కర్నూలులోపరీక్షకు 92.29 శాతం హాజరు నమోదైంది. కలెక్టర్‌ డా.ఎ.సిరి నగరంలోని పరీక్ష కేంద్రాల ను పర్యవేక్షించారు. పరీక్షను పారదర్శ కంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్‌ పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలో తాగునీరు, విద్యుత్‌, వైద్యసదుపాయాలు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచామన్నారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారని కలెక్టర్‌ చెప్పారు. పరీక్ష సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు విద్యాశాఖ, పోలీసు, వైద్య, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

పరీక్ష కేంద్రాల తనిఖీ

కర్నూలు క్రైం: నగరంలో ఆదివారం జరిగిన ‘నీట్‌’ పరీక్ష కేంద్రాలను ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్‌ నియంత్రణ, అభ్యర్థుల ప్రవేశాలను ఎస్పీ స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. కేవీఆర్‌ డిగ్రీ కళాశాల, సిల్వర్‌ జూబ్లీ కళాశాల, కేంద్రీయ విద్యాలయం తదితర కేంద్రాలను ఎస్పీ తనిఖీ చేశారు. ఎస్పీ వెంట కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర, సీఐలు, ఎస్‌ఐలు ఉన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 12:22 AM