ఆశల సాగు..
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:16 AM
వర్షాలు ప్రారంభం కావడంతో మండలంలో రైతులు ఖరీప్ సాగుకు సిద్ధమయ్యారు. జూన్‌లో ఇప్పటి వరకు 64.6 మి.మీ.ల వర్షపాతం నమోదు అయింది.
వర్షాలు కురవడంతో ఖరీఫ్‌లో విత్తనాలు వేస్తున్న రైతులు
ఆరుతడి పంటలు సాగుచేయాలని వ్యవసాయాధికారుల సూచన
బేతంచెర్ల, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): వర్షాలు ప్రారంభం కావడంతో మండలంలో రైతులు ఖరీప్ సాగుకు సిద్ధమయ్యారు. జూన్‌లో ఇప్పటి వరకు 64.6 మి.మీ.ల వర్షపాతం నమోదు అయింది.మెట్ట పంటలు వేరుశనగ, కంది, సజ్జలు, జొన్న, కొర్ర సాగుకు అనుకూలమైన వర్షం కురిసిందని రైతులు అంటున్నారు. 700 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.
అవగాహనతో సాగు చెయ్యాలి
జూన్‌లో సరిపడా వర్షం కురిసింది, రైతులు అవగాహనతో పంటలు సాగు చేయాలి. వ్యవసాయాధికారులను సంప్రదించి సలహాలు పొందాలి.- విజయ్ కుమార్ రెడ్డి, ఏవో.
ప్యాపిలి మండలంలో టమోటా సాగు..
ప్యాపిలి: వర్షాలు కురుస్తుండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మండలంలో 25వేల ఎకరాల సాగు భూమి ఉంది. టమోట, కంది సాగుచేస్తున్నారు. ప్యాపిలి, కలచట్ల, పెద్దపూదిళ్ల, చిన్నపూదిళ్ల, వెంగళాంపల్లి, పోతుదొడ్డి తదితర గ్రామాల్లో విత్తన, టమోట, మిరపనాట్లు ఊపందుకున్నాయి. గత ఏడాది టమోట ధరలు పతనం కావడంతో ఆర్థికంగా దెబ్బతిన్నామని, ఈ ఏడాదైనా దేవుడు కరుణిస్తారన్న ఆశలతో పంటను సాగు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు.