రెడ్‌క్రాస్ సేవలు విస్తృతం : కలెక్టర్
ABN , Publish Date - Aug 29 , 2026 | 11:43 PM
జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తృతం చేసి, ప్రజలకు మెరుగైన మానవతా సేవలు అందించే దిశగా ముమ్మరంగా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు.
నంద్యాల నూనెపల్లి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తృతం చేసి, ప్రజలకు మెరుగైన మానవతా సేవలు అందించే దిశగా ముమ్మరంగా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శనివారం మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రెడ్‌క్రాస్ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన జిల్లాగా ఏర్పడిన సమయంలో రెడ్‌క్రాస్ సొసైటీకి సొంత భవనం, బ్లడ్‌స్టోరేజ్ యూనిట్ వంటి మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి నుంచి ప్రస్తుతం అనేక సేవలను అందించే స్థాయికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రజలకు తక్కువ ధరలకు మందులు అందుబాటులో ఉండేలా జీజీహెచ్ ఆవరణలో స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తల సహకారంతో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. డోన్, శ్రీశైలం ప్రాంతాలతో పాటు ఎన్‌హెచ్-40, 340 సీ జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ కొత్తగా బ్లడ్ స్టోరేజీ యూనిట్లు, జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. రక్తదానం, అవయవదానంపై అవగాహన కల్పించాలన్నారు. నైట్‌షెల్టర్లను రెడ్‌క్రాస్ పర్యవేక్షణలోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ.. బస్టాండు, రైల్వే స్టేషన్లు, ఫుట్‌పాత్‌లపై రాత్రి వేళల్లో ఆశ్రయం లేకుండా ఉంటున్న వృద్ధులు, నిరాశ్రయుల కోసం ప్రత్యేకంగా హోమ్‌లెస్ సెంటర్ ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల, సెక్రటరీ శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా కోశాధికారి డా.అరుణకుమారి, వైస్ చైర్మన్ డా.మమతారెడ్డి, కార్యవర్గ సభ్యులు మారుతి కుమార్, ఉస్మాన్‌బాషా, డా.నిషితరెడ్డి, యాకుబ్ పాల్గొన్నారు.