Share News

రియల్‌ దందా

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:38 PM

రియల్‌ దందా

రియల్‌ దందా
మంత్రాలయం మండలం నాగులదిన్నె రహదారిలో వెలసిని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ ఇది.

మంత్రాలయంలో ఇష్టారాజ్యంగా వెంచర్లు

వంక, పోరంబోకు, ఇనామ్‌ భూములు కబ్జా

ముగ్గురు రియల్టర్లు 0.96 ఎకరాలకు పైగా ఆక్రమణ

ఆ భూమి విలువ రూ.15 కోట్లకు పైమాటే

ఆక్రమణదారులు వైసీపీ నాయకులే

కుడా, రెవెన్యూ అధికారుల కళ్లకు గంతలు

ఆధ్యాత్మికతను నెలవు రాఘవేంద్ర స్వామి కొలువైన మంత్రాలయం. స్వామివారి దర్శనానికి నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. భక్తుల వసతుల కోసం పెద్దసంఖ్యలో లాడ్జీలు వెలిశాయి. రియల్‌ ఎస్టేట్‌ భూమ్‌ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. డిమాండ్‌ను బట్టి సెంటు రూ.25-30 లక్షలకు పైగా పలుకుతోంది. ఇదే అదనుగా భావించిన రియల్టర్లు ఇష్టారాజ్యంగా వెంచర్లు వేస్తున్నారు. వాటిని అనుకొని ఉంటున్న వంక, పోరంబోకు, ఇనామ్‌ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. కుడా, రెవెన్యూ అధికారులు కళ్లకు గంతలు కట్టుకో వడంతో వైసీపీ నేతల భూకబ్జాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. మంత్రాలయంలో భూకబ్జాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల దందాకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. రియల్‌ వ్యాపారులు ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తూ వ్యాపారం జోరుగా కొనసాగిస్తున్నారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచే కాక కర్ణాటక, తమిళనా డు, మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రోజూ 40-50వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. గురు, శని, ఆదివారా ల్లోనూ, సెలవు రోజుల్లో లక్షకుపైగా వస్తుం టారని అంచనా. భక్తులకు వసతి కల్పించేందుకు ఇప్పటికే వందకు పైగా లాడ్జీలున్నాయి. తాజాగా మరో 75-100 వరకు కొత్తగా లాడ్జీల నిర్మిస్తున్నట్లు సమాచారం. అదే క్రమంలో రియల్‌ భూమ్‌ తారాజువ్వలా ఆకాశానికి చేరింది.

సెంటు రూ.25-30 లక్షలు

ప్రధాన రహదారుల్లో ఒక సెంటు(436 చదరపు అడుగులు) రూ.25-30 లక్షలకు పైగా పలుకుతోంది. రియల్‌ భూమ్‌ను సొమ్ము చేసుకోవడానికి స్థానిక రియల్టర్లతో పాటు ఎమ్మిగనూరుకు చెందిన రియల్‌ వ్యాపారులు మంత్రాలయంలో వాలిపో యారు. మంత్రాలయం నుంచి నాగులదిన్నె, ఎమ్మిగనూరు, మాధవరం వెళ్లే ప్రధాన రహదారుల్లో ప్రైవేటు భూములు కొనుగోలు చేసి వెంచర్లు వేశారు. ఆ ప్రాంతాల్లో సెంటు రూ.15-18లక్షలకు పైగా విక్రయిస్తున్నట్లు సమాచారం. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్లో మెజార్టీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలే ఉన్నట్లు తెలుస్తుంది.

దర్జాగా భూములు కబ్జా

రైతుల నుంచి ప్రైవేటు భూములు కొనుగోలు చేసి, ఖరారు చేసుకున్న భూమి ధరపై 25-30 శాతం అడ్వాన్స్‌గా చెల్లించి అగ్రిమెంట్‌ (ఒప్పందం) రాసుకుంటారు. ఆ భూముల్లో వెంచర్లు వేసి చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ భూముల పక్కనే ఉన్న వంక, పోరంబోకు, రస్తా పొరంబోకు, ఇనామ్‌ భూములను సైతం ఆక్రమించి తమ వెంచర్లలో కలిపేసుకొని ప్లాట్లు వేస్తున్నారు. మాధవరం వైపు రోడ్డు పక్కనే ఉన్న భూములు సెంటు రూ.30-35లక్షలు, కాస్త లోపలివైపు ఉంటే రూ.25-30 లక్షలకు విక్రయిస్తున్నారు. నాగులదిన్నె, ఎమ్మిగనూరు వైపు కూడా సెంటు రూ.15-18 లక్షలకు పైగా పలుకుతుందని అంచనా. ఎంత తక్కువ కాదన్నా ఎకరం రూ.15 కోట్లకు పైగా పలుకుతుంది. కబ్జాదారుల్లో మెజార్టీ వైసీపీకి చెందిన వారే ఉన్నారని సమాచారం.

ఇష్టారాజ్యంగా వెంచర్లు వేసి..

ప్రభుత్వ, పట్టణ ప్రణాళిక నిబంధనల ప్రకారం వెంచర్లు వేసి స్థిరాస్తి వ్యాపారాలు చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వెంచర్లు వేసి ప్లాట్ల విక్రయిస్తున్నారని తెలిసింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ‘ఎల్‌ఆర్‌ఎస్‌’ కింద మంత్రాలయం నుంచే కుడాకు 3,600కుపైగా దరఖాస్తులు వచ్చాయంటే లే- అవుట్‌ ప్లాన్‌ (ఎల్‌పీ) అప్రూవల్‌ లేకుండా నాన్‌ అవుట్‌ ప్లాట్లు ఏ స్థాయిలో విక్రయాలు చేశారో తెలుస్తుంది.

ఆభూముల విలువ రూ.15కోట్లకు..

గత నెలలో రెవెన్యూ అధికారులు మూడు వెంచర్లు తనిఖీ చేస్తే 0.96ఎకరాలు వంక, పోరంబోకు, రస్తా పోరంబోకు భూములు కబ్జాచేసి తమ వెంచర్లో కలి పేసుకొని ప్రహరీ నిర్మించి నట్లు గుర్తించారు. ఆభూముల విలువ రూ.15కోట్లకు పైగా ఉంటుందని అంచ నా. అక్రమార్కులకు వైసీపీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి అం డదండలు ఉండడంతో అధికారులు కూడా కళ్లకు గంతలు కట్టుకున్నారనే ఆరోపణలు లేకపోలేదు.

కలెక్టర్‌ స్థానిక అధికారులను కాకుండా రెవెన్యూ, సర్వే అధికారులతో ప్రత్యేక టీంను నియమించి ప్రతి వెంచర్‌ను సర్వే చేయిస్తే భారీ భూ కుంభకోణం వెలుగు చూసే అవకాశం ఉంది. ఆదిశగా కలెక్టర్‌ చర్యలు తీసుకుంటారో? లేదో? వేచి చూడాల్సిందే.

వెలుగు చూసిన నిజాలు

మంచాల (మంత్రాలయం) గ్రామం సర్వే నంబరు.178/1లో ప్రభుత్వ వంక పోరంబోకు భూమి 1.11ఎకరకాలు ఉంది. అందులో 0.72 సెంట్లు అదే గ్రామానికి చెందిన ఎస్‌.రాఘవేంద్రరావు ఆక్రమించి ఎలాంటి అనుమతుల్లేకుండా అక్రమంగా ప్రహరీ నిర్మించారని రెవెన్యూ అధికారులు గుర్తించారు. గతనెల 11న మంత్రాలయం తహసీల్దారు రమాదేవి ఆంధ్రప్రదేశ్‌ భూఆక్రమణ చట్టం-1905, 3వ యాక్ట్‌, 7వ సెక్షన్‌ కింద నోటీస్‌ జారీచేసింది. ఆయన నుంచి భూమి కొనుగోలు చేసి వెంచర్‌ వేసిన రియల్టర్‌ ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని తెలుస్తుంది.

అదే సర్వే నంబరు.178/1లోని 1.11 ఎకరాల ప్రభుత్వ వంక పోరంబోకు భూమిలో 0.22సెంట్లు అదే గ్రామానికి చెందిన మడ్రీ డేవిడ్‌, మడ్రీ మారెప్ప ఆక్ర మించుకొని అక్రమంగా ప్రహరీ నిర్మించారని తహసీల్దారు గత నెల 11న నోటీసులు జారీ చేశారు. అలాగే సర్వే నంబరు.132లో 0.99 సెంట్లు ఎల్‌ఎఫ్‌ రోడ్డు పోరంబోకు భూమి ఉంది. అందులో 0.02 సెంట్లు అదే గ్రామానికి చెందిన మడ్రీ డేవిడ్‌ అనే వ్యక్తి అక్రమించుకున్నాడని తహల్దారు పంపిన నోటీసులో స్పష్టంగా చూపారు.

గత నెల 11న నోటీసులు పంపి రెవెన్యూ అధికారులు తమపని అయిపోయిందని చేతులు దులుపుకున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది.

విచారణ చేయాలి

కలుదేవకుంట గ్రామానికి దగ్గర్లో మంత్రాలయంకి చెందిన 3.50 ఎకరాల్లో వైసీపీ ముఖ్య నాయకుడు ఒకరు వెంచర్‌ వేశారు. ఆవెంచర్‌లో దాదాపు 0.35 సెంట్లు ప్ర భుత్వ వంక పోరంబోకు భూమిని ఆక్రమించి ప్లాట్లువేసి విక్రయిస్తున్నట్లు సమా చారం. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.

మంత్రాలయం గ్రామ కంఠం సర్వే నంబరు.163లో 0.20-0.30 సెంట్లు వైసీపీ నాయకులు ఆక్రమించుకొని, గతంలో ఇక్కడ పనిచేసిన ఓతహసీల్దారు సం తకాలతో బినామీ పట్టాలు సృష్టించినట్లు ఆరోపణలున్నాయి.

సమగ్ర విచారణ చేపడుతాం

మంత్రాలయంలో వంక, పోరంబోకు భూములను అక్రమించుకొని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో కలుపుకొని ప్లాట్లు విక్రయించడం చట్టరీత్యా నేరం అవుతుంది. వంక, పోరంబోకు ఆక్రమణపై సమగ్ర విచారణ చేయిస్తాం. ఆక్రమణలున్నాయని తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.

మధుసూదన్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్‌, ఆదోని

Updated Date - Jun 06 , 2026 | 11:38 PM