Share News

స్థానిక సంస్థలలో పట్టుకోసం మంతనాలు

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:11 AM

: వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పట్టు సాధించుకునేందుకు అధికార, ప్రతిపక్షల నాయకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరుపార్టీల నాయకులు తమ నమ్మకస్తులతో రహస్య చర్చలు జరుపుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం అన్నట్లు ప్రభుత్వం కూడా సంకేతాలు ఇస్తుంది. దీంతో నాయకులు మరింత పట్టు కోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు

స్థానిక సంస్థలలో పట్టుకోసం మంతనాలు
గోనెగండ్ల

రెండు పార్టీల్లో రహస్య చర్చలు

రిజర్వేషన్‌ ఏది వచ్చినా విజయం తమదేనంటున్న ఇరుపార్టీల నాయకులు

పంచాయతీల్లో ఓటర్ల జాబితా సిద్ధం

నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూపు

గోనెగండ్ల, జూలై 5(ఆంఽధ్రజ్యోతి): వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పట్టు సాధించుకునేందుకు అధికార, ప్రతిపక్షల నాయకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరుపార్టీల నాయకులు తమ నమ్మకస్తులతో రహస్య చర్చలు జరుపుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం అన్నట్లు ప్రభుత్వం కూడా సంకేతాలు ఇస్తుంది. దీంతో నాయకులు మరింత పట్టు కోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. హైకోర్టు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం స్పందించి ఎన్నికలకు సిద్ధం అన్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో పంచాయతీ ఓటర్లు జాబితాను అధికారులు సిద్ధం చేశారు. గ్రామాల్లో స్థానిక సంస్థల వేడి రాసుకుంది. ఆశావాహులు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఓటర్ల జాబితాను కూడా పంచాయతీ కార్యాలయాలలో ప్రదర్శించారు. గోనెగండ్ల మండలంలోని కొన్ని గ్రామాల్లోని నాయకులు ఇప్పటికే ఒక పర్యాయం గ్రామాల్లో పర్యటించి వార్డు సభ్యులను కూడా ఎంపిక చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అయితే రిజర్వేషన్‌ ఏది వచ్చినా సరేనన్న ధీమాతో నాయకులు ఉన్నారు. గత ఏప్రిల్‌లో సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసింది. ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. దీంతో గ్రామాల పాలన అస్తవ్యస్తంగా మారిందనే వివర్శలు ఉన్నాయి.

పట్టుకోసం ముందస్తు వ్యూహాలు

ఇరు పార్టీల అగ్రనేతలు స్థానిక ఎన్నికల్లో గెలిచి పట్టు చూపకపోతే చర్యలు తప్పవని హెచ్చరించడంతో మండలస్థాయి నాయకులు తమ పట్టును నిలుపుకునేందుకు ముందస్తు ప్యూహాలు చేసుకుంటున్నారు. గ్రామాల్లో ఏ పార్టీకి ఎంత పట్టు ఉంది... ఎవరిని పోటీల్లో నిలిపితే గెలుపు సాధించవచ్చుననే విధంగా గత నాలుగు రోజుల క్రితం నియోజకవర్గంలోని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుని ఇంట్లో చర్చలు కొనసాగించినట్లు తెలుస్తుంది. గోనెగండ్ల మండలంలో 20 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో ఎన్ని సులువుగా గెలుస్తాం.. కష్టపడితే ఎన్ని గెలవవచ్చున చర్చకొచ్చినట్లు తెలిసింది. ఎక్కడ ఏ రిజర్వేషన్‌ వస్తుందని ముందుగాను టీడీపీ అంచనాలు వేస్తున్నారు. ఇందులో తాము ఏమి తక్కువకాదు అన్నట్లు వైసీపీ నాయకులు కూడా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వైసీపీ నాయకులు వర్గవిభేదాలను పక్కన పెట్టి ఉమ్మడి అభ్యర్థిని పోటీలో దింపాలని చూస్తున్నట్లు సమాచారం.

గోనెగండ్ల మండలంలో

గ్రామ పంచాయతీలు 20

వార్డుసభ్యులు 226

ఓటర్లు 60,063

పురుషులు 30,018

స్ర్తీలు 30,044

ఇతరులు 1

సెప్టెంబరులో ముగియనున్న ఎంపీటీసీ, జడీ ్పటీసీల పదవికాలం

ఈ ఏడాది సెప్టెంబరలో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవికాలం ముగియనుంది. ఈ కారణంగా సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కలిపి నిర్వహిస్తారా లేదా అన్నది సందేహంగా నెలకొంది. అన్ని సవ్యంగా జరిగితే డిసెంబరులో ఎన్నికలు వస్తాయని పలువురు పంచాయతీ అధికారులు చెబుతున్నారు. అయితే బీసీ రిజర్వేషన్‌ విషయం కోర్టు పరిధిలో ఉండటంతో అది తేలే వరకు రిజర్వేషన్‌ ప్రక్రియ ముందుకు సాగదన్న వాదన వినిపిస్తోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బరిలో నిలిచేందుకు సర్వశక్తులతో స్థానిక నాయకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యలను తీర్చి ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు నాయకులు నానా తంటాలు పడుతున్నారు.

Updated Date - Jul 06 , 2026 | 12:11 AM