Share News

కోటి ఆశలతో..

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:36 AM

మండలంలో ఇటీవలే భారీ వర్షం కురవడంతో ఖరీఫ్‌ సాగుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. గత వారంలో 43.2 మీ.మీ వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారుల సమాచారం. దీంతో అన్నదాతలు పొలాలను దుక్కిదున్ని, విత్తనం వేస్తున్నారు

కోటి ఆశలతో..
పసుపు విత్తనం వేస్తున్న మహిళా కూలీలు

భారీ వర్షం కురవడంతో ఖరీఫ్‌ సాగుకు సిద్ధమైన రైతులు

వ్యవసాయ పనుల్లో బిజీ, జోరుగా విత్తనాలు

చాగలమర్రి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఇటీవలే భారీ వర్షం కురవడంతో ఖరీఫ్‌ సాగుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. గత వారంలో 43.2 మీ.మీ వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారుల సమాచారం. దీంతో అన్నదాతలు పొలాలను దుక్కిదున్ని, విత్తనం వేస్తున్నారు. చిన్నవంగలి, గొడిగనూరు, శెట్టివీడు, మల్లేవేముల, ముత్యాలపాడు తదితర గ్రామాల్లో పసుపు, మొక్కజొన్న, పత్తి విత్తనాలు నాటుతున్నారు. అలాగే ఇది వరకే సాగు చేసిన మొక్కజొన్న, పత్తి, వేరుశనగ పంటలకు ఈ వర్షం జీవం పోసినట్లైందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సాగు వివరాలు ఇలా..

ఆళ్లగడ్డ అసెంబ్లీ పరిధిలో ఖరీ్‌ఫలో చాగలమర్రి 6,527 హెక్టార్లు, ఆళ్లగడ్డ 8,300 హెక్టార్లు, రుద్రవరం 13,747 హెక్టార్లు, శిరివెళ్ల 9,061 హెక్టార్లు, ఉయ్యాలవాడ 2,911, దొర్నిపాడు 3,660 హెక్టార్లలో పంటలు సాగవుతున్నట్లు సమాచారం.

జీలుగ విత్తనాలు పంపిణీ

సాగుకు ముందు విత్తేందుకు వ్యవసాయధికారులు జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. చాగలమర్రి మండలానికి 154.4 క్వింటాల్లు, ఆళ్లగడ్డలో 249.50 క్వింటాళ్లు, శిరివెళ్ల 500 క్వింటాళ్లు, ఉయ్యాలవాడ 90 క్వింటాళ్లు, దొర్నిపాడు 92 క్వింటాళ్లు, రుద్రవరం 800 క్వాంటాళ్ల విత్తనాలు మంజూరైనట్లు తెలిపారు.

విత్తనశుద్ధి తప్పనిసరి

విత్తనం వేసే ముందు రైతులు తప్పనిసరిగా విత్తనశుద్ధి చేయాలి. ఈనెల 30 వరకు విత్తనాలు వేయవచ్చు. ఈనెలలో రెండు దఫాలుగా వర్షం కురవడంతో మినుము, కొర్ర, వేరుశనగ, పెసర, కంది, పసుపు సాగుకు అనుకూలం. సేంద్రియ ఎరువులు వాడితే దిగుబడి వస్తుంది. - రంగనేతాజీ, ఏవో, చాగలమర్రి

Updated Date - Jun 22 , 2026 | 12:36 AM