అవినీతి సీఐపై వేటుకు రంగం సిద్ధం?
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:19 AM
ఎక్సైజ్ శాఖలోని కొందరు సీఐలతో పాటు ఉన్నతాఽధికారుల తీరుపై అవినీతి ఆరోపణలు రావడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇందుకు నిదర్శనమే డోన్ పోలీసుల ఆకస్మిక తనిఖీలతో ఎక్సైజ్‌శాఖ లోని ఓసీఐ అవినీతి వ్యవహారం బట్టబయలైంది.
సీజ్ చేసిన మద్యం విక్రయం
పోలీసుల తనిఖీలో బట్టబయలు
ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు సరెండర్
నంద్యాల, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్ శాఖలోని కొందరు సీఐలతో పాటు ఉన్నతాఽధికారుల తీరుపై అవినీతి ఆరోపణలు రావడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇందుకు నిదర్శనమే డోన్ పోలీసుల ఆకస్మిక తనిఖీలతో ఎక్సైజ్‌శాఖ లోని ఓసీఐ అవినీతి వ్యవహారం బట్టబయలైంది. సదరు అధికారి ఏకంగా పట్టుబడిన ఎక్సైజ్ మద్యాన్ని సైతం విక్రయించి క్యాష్ చేసుకున్నారనే పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ విషయం తెలియగానే ఆశాఖ ఉమ్మడి జిల్లా ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి సదరు అధికారిని ఆశాఖ కమిషనర్‌కు సరెండర్ చేశారు.
వాహనాల తనిఖీలో భాగంగా..
ప్యాపిలి మండలం పీఆర్‌పల్లి గ్రామానికి చెందిన సోమనాథ్ మూడు రోజుల కింకిందట డోన్ నుంచి ఓ కారులో 379 మద్యం బాటిళ్లు(సీజ్ చేసిన మద్యం) తమ స్వగ్రామానికి తరలిస్తున్నాడు. డోన్ టౌన్ సీఐ ఇంతియాజ్ బాషా వాహనాల తనిఖీలో భాగంగా పట్టణంలోని చాకిరేవుమిట్ట వద్ద సదరు వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా విషయం బయటపడింది. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఎక్సైజ్ అధికారుల అవినీతి బట్టబయలైంది. ఏకంగా వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యం బాటిళ్లను డోన్ ఎక్సైజ్ సీఐ వరలక్ష్మి సదరు వ్యక్తికి విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈవిషయాన్ని పోలీసు అధికారులు ఎక్సైజ్ ఉన్నతాధికారులకు నివేదించారు. వెంటనే ఆశాఖ డీసీ శ్రీదేవి సదరు సీఐని ఆశాఖ ప్రధాన కార్యాలయాని మంగళవారం సరెండర్ చేశారు. ఇదే విషయాన్ని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ కూడా వెల్లడించారు.
ఇద్దరు ఉన్నతాధికారులపై ఫిర్యాదులు...
ఉమ్మడి కర్నూలు జిల్లా ఎక్సైజ్‌శాఖ పరిధిలోని కీలక ఉన్నతాధికారితో పాటు నంద్యాల జిల్లాలోని ఓ ఉన్నతాధికారి తీరుపై కూడా ఆశాఖ రాష్ట్రస్థాయి అధికారులకు అనేక ఫిర్యాదులు వె ళ్ల్లినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఓ అధికారిపై అనంతపురం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌ను సైతం విచారణకు వేయడంతో విచారణ పక్రియ కూడా సాగుతోందని ఆశాఖ వర్గాల నుంచి తెలిసింది. ఈ ఇద్దరు అధికారుల్లో ఓ అధికారి మాత్రం స్థానికంగా లేకుండా ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తించి అనేక అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిసింది. మరో అధికారి సైతం బెల్ట్ నుంచి మద్యం దుకాణాల వరకు నెలవారి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఆయా వ్యవహరాల్లో ఈ ఇద్దరు అధికారులతో పాటు కొందరు సీఐల పాత్ర కూడా కీలకంగా ఉందని తెలుస్తోంది.
త్వరలోనే సస్పెన్షన్
సీఐ వరలక్ష్మి పట్టుబడిన మద్యాన్ని విక్రయించి క్యాష్ చేసుకోవడంపై ఆ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు సైతం సీరియ్‌సగా పరిగణించారు. నేడో రేపో సదరు అధికారిని సస్పెన్షన్ చేసే అవకాశం ఉందని తెలిసింది. గతంలో కూడా సదరు అధికారి తీరుపై పలు విమర్శలు ఉన్నట్లు ఆశాఖ విచారణలో వెలుగు చూసిందని సమాచారం. ఆశాఖ వర్గాల్లో కలవరం మొదలైంది.
మామూళ్ల మత్తులో..
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎక్సైజ్ శాఖలో కొందరు అధికారులు నెలవారీ మాముళ్ల మత్తులో మునిగిపోయారు. ఇంకెముందీ.. అడిగేవారెవరు అన్న చందంగా కొందరు మద్యం దుకాణదారులతో పాటు బెల్ట్‌షాపుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా మద్యం విక్రయాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు.