రెండో విడత పోరుకు సై
ABN , Publish Date - Nov 24 , 2026 | 11:49 PM
జిల్లాలో రెండో విడత పోరుకు అభ్యర్థులు, నిర్వహణలో అధికారులు సన్నద్ధం అయ్యారు. 9 మండలాల్లో 186 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
13 సర్పంచ్‌లు ఏకగ్రీవం
173 పంచాయతీలకు ఎన్నికలు
కర్నూలు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో విడత పోరుకు అభ్యర్థులు, నిర్వహణలో అధికారులు సన్నద్ధం అయ్యారు. 9 మండలాల్లో 186 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో 13 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 5, మంత్రాలయం నియోజకవర్గంలో 8 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన చోట్ల బరిలో అభ్యర్థులు పోటీకి సై అన్నారు. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. సర్పంచ్ పీఠాల కోసం ప్రధాన పార్టీల మద్దతుదారులు, స్వతంత్య్ర అభ్యర్థులు పోటీకి సిద్దమయ్యరు. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు కాగా, మిగిలిన పంచాయతీల్లో ఎన్నికల వేడి రాజుకుంది.
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 52 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సర్పంచ్ స్థానాలకు 366 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉపసంహరణల అనంతరం 149 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఐదు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దైవందిన్నె, కులుమాల, పుట్టపాశం, నేరేడుప్పల, పెద్దకొతిలి గ్రామాల్లో సర్పంచ్ పదవికి సింగిల్ నామినేషన్లు వచ్చాయి. వీటిలో 245 ఉపసంహరణలు కాగా, 87 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన వార్డుల్లో అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
మంత్రాలయం నియోజకవర్గంలో 94 గ్రామ పంచాయతీలు, 960 వార్డులు ఉన్నాయి. సర్పంచ్ స్థానాలకు 564 నామినేషన్లు రాగా, 329 మంది ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం 231 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎనిమిది పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రాంపురం, కాచాపురం, బసాపురం, కగ్గల్, జుమాలదిన్నె, గోతులదొడ్డి, జమ్ములదిన్నె, పీగలబెట్ట గ్రామాల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. వార్డు సభ్యుల స్థానాలకు 2,101 నామినేషన్లు రాగా, 571 మంది ఉపసంహరించుకున్నారు. 117 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో 1451 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.