స్థానిక సమరానికి సిద్ధం
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:23 PM
స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం అవుతోంది.
జిల్లాలో ఎన్నికల కసరత్తు షురూ
నగర, పురపాలకాల్లో 7.59 లక్షల మంది ఓటర్లు
148 నుంచి 187 పెరిగిన వార్డులు
హైకోర్టు తీర్పుతో రాజకీయ వేడి
రిజర్వేషన్లపై తదుపరి కసరత్తు
స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం చేసింది. నగరపాలక సంస్థతో పాటు ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లపై కసరత్తు దాదాపుగా పూర్తయ్యింది. వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) చేయడంతో నాలుగు పట్టణ సంస్థల్లో వార్డులు 148 నుంచి 187 వార్డులకు పెరిగాయి. ఎన్నికల ప్రక్రియకు ‘సర్’ అడ్డంకి కాదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పట్టణాల్లో ఎన్నికల సందడి జోరందుకుంది. దీంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
కర్నూలు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కర్నూలు నగరపాలక సంస్థ, ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీల ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టరు ఏ. సిరి ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. కీలకమైన వార్డుల పునర్విభజన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. స్థానిక సంస్థల్లో కొత్తగా 39 కొత్త వార్డులు ఏర్పడ్డాయి. ప్రతి వార్డులో అభ్యర్థుల ఎంపిక, రిజర్వేషన్లు, రాజకీయ సమీకరణాలు కొత్త రూపు దాల్చనుంది. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం 52 వార్డులు ఉంటే.. డీలిమిటేషన్ వల్ల 68 వార్లుకు పెరిగాయి. 16 వార్డులు ఏర్పాటు చేశారు. ఆయా వార్డుల్లో 4,79,861 ఓటర్లు ఉన్నారు. ఆదోని మున్సిపాలిటీలో 42 నుంచి 52 వార్డులకు పెరిగి, కొత్తగా పది వార్డులు ఏర్పడ్డాయి. మొత్తం వార్డుల్లో 1,76,676 మంది ఓటర్లు ఉన్నారు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో వార్డులకు సంఖ్య 34 నుంచి 44 పెరిగాయి. కొత్తగా పది వార్డులు ఏర్పడ్డాయి. పట్టణంలో 84,939 మంది ఓటర్ల ఉన్నారు. గూడూరు నగర పంచాయతీ పరిధిలో ప్రస్తుతం ఉన్న వార్డులు 20 కాగా, పునర్విభజన వల్ల 23 వార్డులు పెరగడంతో కొత్తగా మూడు వార్డులు ఏర్పాటు చేశారు. మొత్తం 17,665 మంది ఓటర్లు ఉన్నారు. అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేసింది. రాజకీయ పార్టీలు మేయర్, చైర్మన్ అభ్యర్థుల నుంచి వార్డు అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలు పెట్టారు. దీంతో ఎల్‌నినో ప్రభావంతో సెగలు కక్కుతున్న ఎండల్లో.. రాజకీయంగా మరింత వేడి రాజుకుంది.
సగానికి పైగా ఓటర్లు కర్నూలులోనే
జిల్లాలో ఎన్నికలు జరిగే నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న మొత్తం ఓటర్లలో సగానికి పైగా కర్నూలు నగరపాలక సంస్థలోనే ఉన్నారు. నాలుగు పట్టణాల్లో 7,59,141 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 63 శాతానికి పైగా 4,79,861 మంది ఓటర్లు కర్నూలు నగరంలో ఉండడం చూస్తే, నగర పాలక సంస్థ మేయర్ పీఠానికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఒక ఎమ్మెల్యేని 2.50 - 3 లక్షల ఓటర్లు ఎన్నుకుంటే, మేయర్‌ను నేరుగా 4.79 లక్షల మంది ఓటర్లు ఎన్నుకోవాల్సి ఉంది. అంటే.. ఇద్దరు ఎమ్మెల్యేలకు మేయర్ సమానమనే చర్చ రాజకీయ శిబిరాల్లో జోరుగా సాగుతోంది. దీంతో నగరపాలక సంస్థ మేయర్, కార్పొరేటర్ల ఎన్నిక అత్యంత కీలకం కానుంది. ఆ తరువాత 1,76,676 ఓటర్లతో ఆదోని రెండో స్థానంలో ఉంది. ఇక్కడ కూడా చైర్మన్ పీఠానికి ఎంతో ప్రధాన్యత చేకూరింది.
మహిళల తీర్పే కీలకం
జిల్లాలో ఎన్నికలు జరిగే నగర, పట్టణాల్లో మహిళా ఓటర్ల తీర్పే కీలకం కానుంది. పురుష ఓటర్లు 3,69,070 మంది ఉంటే, మహిళా ఓటర్లు 3,89,946 మంది ఉన్నారు. ఇతరులు 175 ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన చూస్తే పురుషుల కంటే మహిళా ఓటర్లు 20,876 మంది అధికంగా ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలిచిన అభ్యర్థులు ఉన్నారు. ఒక్క ఓటు తేడాతో పరాజయం పాలైన నాయకులు లేకపోలేదు. త్వరలో జరగబోయే పుర పోరులో .నారీమణుల తీర్పు ఎంతో కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. వారిచ్చే తీర్పు బరిలో దిగే అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
రిజర్వేషన్లపై ఆసక్తికర చర్చ
కర్నూలు నగర పాలనాధీశుడు (మేయర్), ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు మున్సిపాలిటీల చైర్మన్లను ఓటర్లే నేరుగా (డైరెక్ట్) ఎన్నుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే.. ఆ పీఠాలకు ఎంతో ప్రాధాన్యత పెరిగింది. ఎందుకుంటే.. అభ్యర్థులను ముందే బరిలో దింపక తప్పడం లేదు. దీంతో మేయర్, చైర్మన్ అభ్యర్థుల ఎంపిక రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. అలాగే.. పోటీకి ఆసక్తి చూపుతున్న ఆశావాహుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ఏ చైర్మన్ పీఠం ఏ సామాజిక వర్గానికి రిజర్వు చేస్తారు..? అనే చర్చ జోరందుకుంది. ఏ ఇద్దరు కలసినా ఇదే చర్చ. ఉమ్మడి రాష్ట్రంలో, రాష్ట్ర విభజన తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ చైర్మన్ పీఠం ఏ సామాజికవర్గానికి రిజర్వు చేశారు? రోటేషన్ సిస్టమ్‌లో ఇప్పుడు ఏ సామాజిక వర్గానికి రిజర్వు చేసే అవకాశం ఉందో..? అంచనాలు వేస్తున్నారు. ఏ వార్డు ఏ సామాజిక వర్గానికి రిజర్వు అవుతుంది..? కొత్తగా పెరిగిన వార్డుల్లో బరిలో దిగేది ఎవరు..? ఏ వార్డులోకి ఏ కాలనీ, ఏ ప్రాంతాలు వస్తాయి..? ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు స్థానికంగా బలం ఉన్న నాయకుల కోసం అన్వేషణ చేస్తూనే, తమ వద్దకు వచ్చిన ఆశావహులకు మాత్రం చూద్దాం.. రిజర్వేషన్ ఎవరికి వస్తుందో..! మీరు మాత్రం వార్డుల్లో తిరుగుతూ ఓటర్లకు చేరువ కండి అంటూ సలహా ఇచ్చి పంపుతున్నారు.
కర్నూలు జిల్లా స్థానిక ఎన్నికల ముఖచిత్రం
పట్టణ స్థానిక సంస్థలు : 4
మొత్తం ఓటర్లు : 7,59,141
తాజా జనాభా : 8,85,922
తాజా వార్డులు : 187
ప్రస్తుత వార్డులు : 148
పెరిగిన వార్డులు : 39
మహిళా ఓటర్లు : 3,89,946
పురుష ఓటర్లు : 3,69.070
ఇతర ఓటర్లు : 175
పుర పోరు నిర్వహణకు కావాల్సిన సిబ్బంది
నగర/ పోలింగ్ పీవోలు ఏపీవోలు ఓపీవోలు
పురపాలికలు స్టేషన్లు
కర్నూలు 486 600 600 3,000
ఆదోని 179 198 198 594
ఎమ్మిగనూరు 91 100 100 225
గూడూరు 23 26 26 72
మొత్తం 779 924 924 3,895
మున్సిపాలిటీల వారిగా వార్డులు, ఓటర్లు, పోలింగ్ స్టేషన్లు, అవసరమైన బ్యాలెట్ బాక్సులు:
నగర/ వార్డులు ఓటర్లు పోలింగ్ల్ బ్యాలెట్
పురపాలికలు స్టేషను బాక్సులు
కర్నూలు 68 4,79,861 486 1,100
ఆదోని 52 1,76,676 179 430
ఎమ్మిగనూరు 44 84,939 91 220
గూడూరు 23 17,665 23 56
మొత్తం 187 7,59,141 779 1,806