Share News

తొలి విడత పల్లె పోరుకు సిద్ధం

ABN , Publish Date - Nov 23 , 2026 | 01:00 AM

జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సమరంలో తలపడే అభ్యర్థులు ఎవరో ఖరారైంది.

తొలి విడత పల్లె పోరుకు సిద్ధం

నామినేషన్ల పరిశీలన పూర్తి

13 మంది సర్పంచులు, 501 వార్డు సభ్యులు ఏకగ్రీవం

135 సర్పంచ్‌ స్థానాలకు 432 మంది..

1,005 వార్డులకు 2,339 మంది అభ్యర్థులు

14 వార్డులకు దాఖలుకాని నామినేషన్లు

కర్నూలు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సమరంలో తలపడే అభ్యర్థులు ఎవరో ఖరారైంది. ఆదోని, పత్తికొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 8 మండలాల్లో నామినేషన్ల ఉపసంహరణ ఆదివారం ముగియడంతో బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాను జిల్లా ఎన్నికల అధికారులు విడుదల చేశారు. ఈ నెల 26న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. బరిలో తలపడే అభ్యర్థులు, వారికి మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి హామీల వర్షం కురిపిస్తూ.. ముందుకు సాగుతున్నారు. ఫలితంగా పల్లెసీమల్లో రాజకీయం వేడెక్కింది.

జిల్లాలో 484 గ్రామ పంచాయతీలు, 5,100 వార్డులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా నోటిఫికేషన్‌, షెడ్యూల్‌ జారీ చేశారు. మూడు విడతల్లో ఎన్నికలు జరిగేలా షెడ్యూల్‌ ఖరారు చేశారు. తొలి విడతలో ఆదోని-1, ఆదోని-2, ఆలూరు, హొళగుంద, హాలహర్వి, చిప్పగిరి, ఆస్పరి, దేవనకొండ మండలాల్లో 148 గ్రామ పంచాయతీలకు, 1520 వార్లుకు ఈ నెల 15న నామినేషన్లు స్వీకరించారు. ఆదివారం విత్‌డ్రా గడువు ముగిసింది. ఆయా మండలాల్లో రాజకీయ ముఖ్య నేతలు బరిలో దిగి ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు చేశారు. కొన్ని గ్రామాల్లో సర్పంచి పదవి వేలానికి పెట్టారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, రాజకీయ ఒత్తిళ్లు తెచ్చినా గ్రామాల్లో మాత్రం పోటీకి కొందరు సై అన్నారు. కేవలం గ్రామ 13 పంచాయతీ సర్పంచ్‌ పదవులు మాత్రం ఏకగ్రీవం కాగా, 134 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు 432 మంది అభ్యర్థులు సమరానికి సై అన్నారు.

ఏకగ్రీవాల్లో హాలహర్వి టాప్‌

తొలి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో 13 పంచాయతీ సర్పంచ్‌ పీఠాలు ఏకగ్రీవం అయ్యాయి. వాటిలో హాలహర్వి మండలంలో అత్యధికంగా నాలుగు పంచాయతీల్లో సర్పంచి పదవులు ఏకగ్రీవం అయ్యాయి. దేవనకొండలో 3, హొళగుందలో 2, ఆలూరులో 2, ఆదోని-2, ఆస్పరి మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏకగ్రీవమయ్యాయి.

పోటీకి సై: ఎన్నికలు జరిగే 135 పంచాయతీల్లో అత్యధికంగా ఆదోని-1, మండలంలో 21 పంచాయతీల సర్పంచ్‌ స్థానాలకు 74 మంది, దేవనకొండలో 23 స్థానాలకు 73 మంది, ఆదోని-2లో 18 స్థానాలకు 69 మంది అభ్యర్థులు పోటీ పడుతుండటంతో ఇక్కడ రసవత్తర పోరు నెలకొంది.

విత్‌డ్రా: సర్పంచ్‌ స్థానాలకు 1048 మంది నామినేషన్లు వేశారు. రాజకీయ ఒత్తిళ్లతో కొందరు, గ్రామ ఐక్యత కోసం స్వచ్ఛందంగా మరి కొందరు.. మొత్తం 603 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వారిలో సింగిల్‌ నామినేషన్‌ మిగలిన స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 134 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు 432 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు.

501 వార్డులు ఏకగ్రీవం

తొలి విడతలో 148 పంచాయతీల్లో 1,520 వార్డులకు ఎన్నికలు జరగాలి. 3054 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వారిలో 214 మంది అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. 2,840 మంది పోటీకి సై అన్నారు. 501వార్డులకు సింగిల్‌ నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1,005 వార్డులకు 2,339 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆస్పరి మండలంలో అత్యధికంగా 105 వార్డులు, హొళగుందలో 97, హాలహర్విలో 90 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

నాలుగు మండలాల్లోని 14 వార్డులకు ఒక్క నామినేషన్‌ కూడా రాలేదు. చిప్పగిరి దౌలతాపురం గ్రామ పంచాయతీలోని మొత్తం 8 వార్డులు, బంటనహాల్‌ పంచాయతీ 2వ వార్డుకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఆదోని-1 మండలంలో పెద్దపెండేకల్లు గ్రామ పంచాయతీలో 2 వార్డులు, హొళగుంద మండలంలో నేరణికి తండా 8వ వార్డు, చిన్నహ్యాటలో 10వ వార్డుకు, హాలహర్వి మండలంలో కొక్కెరచేడు 9వ వార్డుకు నామినేషన్‌ వేయలేదు.

ప్రచారజోరు: సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవులకు పోటీ పడే అభ్యర్థులు ఎవరో స్పష్టత వచ్చింది. గ్రామ పంచాయతీల్లో ఆర్వోలు అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించారు. గుర్తులు కేటాయింపు కూడా దాదాపు నేడు పూర్తి అవుతుంది. ఈలోగా ఎవరికి వారే ప్రచార వ్యూహాలకు పదును పెట్టారు. సోషల్‌ మీడియాను కూడా కొందరు వాడుకుంటున్నారు. నిన్నటి దాకా అన్నదమ్ముల్లా కలిసి మెలిసిన ఉన్న పల్లెసీమలు ఎన్నికల పుణ్యమా అంటూ గ్రూపులుగా విడిపోయి.. తమ అభ్యర్థిని గెలిపించుకునే ఎత్తులు వేస్తున్నారు. ఈ ప్రచార హోరు మత్తులో ముంచేస్తోంది.

మండలాల వారీగా ఏకగ్రీవాలు పోను.. ఎన్నికలు జరిగే సర్పంచ్‌, వార్డు స్థానాలు పోటీ చేసే అభ్యర్థుల వివరాలు

మండలం సర్పంచ్‌ అభ్యర్థులు వార్డులు.. అభ్యర్థులు

ఆదోని-1 21 74 156 377

ఆదోని-2 18 69 202 459

హొళగుంద 15 43 75 180

ఆలూరు 14 36 124 260

ఆస్పరి 20 62 121 267

చిప్పగిరి 13 40 75 161

దేవనకొండ 23 73 222 507

హాలహర్వి 11 35 59 128

మొత్తం 138 432 1005 2339

Updated Date - Nov 23 , 2026 | 01:00 AM