Share News

పుర పోరుకు సై

ABN , Publish Date - Oct 19 , 2026 | 12:32 AM

పుర పోరులో తొలి అంకానికి తెర పడింది. కీలకమైన నామినేషన్ల ఘట్టం ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది.

పుర పోరుకు సై
కర్నూలు మేయర్‌ అభ్యర్థిగా నామినేషన్‌ టీడీపీ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూష, పక్కన మంత్రి టీజీ భరత్‌, ఎంపీ బస్తిపాటి నాగరాజు

1,442 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు

మేయర్‌, చైర్మన్‌ స్థానాలకు 59 మంది

కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా 1,383 మంది పోటీ

చివరి రోజు పోటాపోటీ.. 1,001 నామినేషన్లు దాఖలు

ప్రశాంతంగా ముగిసిన కీలక ఘట్టం

నేడు పరిశీలన.. 21న విత్‌డ్రాకు ఆఖరు

కర్నూలు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): పుర పోరులో తొలి అంకానికి తెర పడింది. కీలకమైన నామినేషన్ల ఘట్టం ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. చివరి రోజున అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. కర్నూలు నగరపాలక సంస్థ సహా ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీలో ఎక్కడా ఏ ఒక్క చిన్న ఘటన జరగకుండా నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మేయర్‌, చైర్మన్‌ స్థానాలకు 59 నామినేషన్లు రాగా, కార్పొరేటరు, కౌన్సిలర్ల స్థానాలకు 1,383 నామినేషన్లు వచ్చాయి. కూటమి పార్టీలు, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ సహా వివిధ పార్టీలు, స్వతంత్రులు స్వేచ్ఛగా నామినేషన్లు వేశారు. కర్నూలు నగరంలో ఊరేగింపులు, డబ్బులు, డీజే సౌండ్లు లేకుండా సాదాసీదాగా ఇరు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో నగర ప్రజలు ఎన్నికలంటే ఇలా జరగాలి..! అంటూ ప్రశంసలు కురిపించారు.

జిల్లాలో కర్నూలు నగరపాలక సంస్థ మేయర్‌, 68 వార్డులు (డివిజన్లు), ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీల చైర్మన్లు, 119 వార్డుల ఎన్నికల నిర్వహణకు ఈ నెల 14న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారు. 16న నగర, మున్సిపాలిటీల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు (ఆర్వో) నోటిఫికేషన్‌ జారీ చేసి నామినేషన్ల స్వీకరణకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తొలి రోజు కూటమి పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు జరగకపోవడం, అభ్యర్థుల ఎంపిక కసరత్తు కారణంగా ఆశించిన స్థాయిలో నామినేషన్లు రాలేదు. రెండో రోజు కూడా దాదాపుగా అదే పరిస్థితి ఉంది. ఆదివారం చివరి రోజు కావడంతో మేయర్‌, చైర్మన్‌ స్థానాలతో పాటు కార్పొరేటరు, కౌన్సిలర్ల స్థానాలకు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు రావడం, అధికార కూటమి పార్టీలు, వైసీపీ అభ్యర్థులు కూడా నామినేషన్ల వేసేందుకు సన్నాహాలు చేసుకోవడంతో ఎలాంటి ఘటనలు జరగకుండా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ నేతృత్వంలో భారీ పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు. కర్నూలు మేయర్‌ నామినేషన్‌ కేంద్రానికి వంద మీటర్లకు పైగా దూరంలోనే ప్రజలు, కార్యకర్తలను ఆపేశారు. అభ్యర్థి, మరో ఇద్దరిని మాత్రమే అనుమతించారు. మేయర్‌, చైర్మన్‌ స్థానాలకు 59.. కార్పొరేటర్లు, కౌన్సిలర్ల స్థానాలకు 1,383 కలిపి 1,442 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసి పుర పోరుకు సై అన్నారు. చివరి రోజు ఆదివారం ఒక్కటే 1,001 మంది నామినేషన్లు వేశారు.

కర్నూలులో 622 నామినేషన్లు

కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో మేయర్‌ స్థానానికి 25 మంది, 68 వార్డులకు 597 మంది నామినేషన్లు వేశారు. కూటమి టీడీపీ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూష మంత్రి టీజీ భరత్‌, ఎంపీ బస్తిపాటి నాగరాజు, టీడీపీ యువనేత గౌరు జనార్దన్‌రెడ్డితో పాటు బీజేపీ, జనసేన నాయకులతో కలసి వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. చివరి రోజు ఒక్కటే మేయర్‌కు 18, కార్పొరేటర్లుగా 412 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసిన వారిలో పార్టీల వారిగా టీడీపీ 175, వైసీపీ 176, బీజేపీ 23, జనసేన 24, సీపీఎం 16, సీపీఐ 11, కాంగ్రెస్‌ 12, ఇతర పార్టీలు 18, స్వతంత్రులు 126 మంది ఉన్నారు.

ఆదోని మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ కూటమి టీడీపీ అభ్యర్థి నాగమణి ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షరాలు గుడిసె కృష్ణమ్మ, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మదిరె భాస్కరరెడ్డితో కలసి వెళ్లి నామినేషన్‌ వేశారు. చైర్మర్‌ స్థానానికి 14 మంది, 52 వార్డులకు 415 మంది నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు ఒక్కటే చైర్మన్‌కు 12, కౌన్సిలర్లుగా 283 మంది నామినేషన్లు అందజేశారు. పార్టీల వారిగా.. టీడీపీ 84, వైసీపీ 98, బీజేపీ 40, జనసేన 11, సీపీఎం 2, సీపీఐ 6, కాంగ్రెస్‌ 10, ఇతర పార్టీలు 17, స్వతంత్రులు 24 మంది నామినేష్లను వేశారు.

ఎమ్మిగనూరు మున్సిపల్‌ చైర్మన్‌ కూటమి టీడీపీ అభ్యర్థి మాచాని సునీత ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, టీడీపీ అధ్యక్షుడు మాచాని మహేశ్‌, రాష్ట్ర పరిశీలకుడు మనిశేఖర్‌రెడ్డితో కలసి మున్సిపల్‌ ఆఫీసుకు ఊరేగింపుగా వెళ్లి నామినేషన్‌ వేశారు. చైర్మన్‌ పీఠం కోసం 12 మంది, 44 వార్డులకు 226 మంది పోటీకి సై అన్నారు. చివరి రోజు ఒక్కటే చైర్మన్‌కు 8 మంది, కౌన్సిలర్లుగా 141 మంది నామినేషన్లు వేశారు. మొత్తం నామినేషన్లలో పార్టీల వారిగా టీడీపీ 75, వైసీపీ 68, బీజేపీ 3, జనసేన 3, సీపీఎం 3, సీపీఐ 3, స్వతంత్రులు 65 మంది నామినేష్లను వేశారు.

గూడూరు నగర పంచాయతీ చైర్మన్‌ కూటమి బీజేపీ అభ్యర్థి డమాం సునీతాబాయి భర్త బీజేపీ నాయకుడు డమాం సురేశ్‌ కలిసి సాదాసీదాగా రెండో సెట్టు నామినేషన్‌ వేశారు. రెబల్‌గా టీడీపీ అభ్యర్థి కె.వెంకటేశ్వరమ్మ భర్త టీడీపీ పట్టణ అధ్యక్షుడు రామాజంనేయులు, సింగిల్‌ విండో డైరెక్టర్‌ రేమట వెంకటేశ్వర్లుతో కలసి వచ్చి నామినేషన్‌ వేశారు. వైసీపీ అభ్యర్థి ఎల్‌.పద్మావతి నామినేషన్‌ వేశారు. చైర్మన్‌గా 8 మంది, 23 వార్డులకు 145 మంది పోటీ నామినేషన్లు వేశారు. చివరి రోజు ఒక్కటే చైర్మన్‌కు ఏడుగురు, కౌన్సిలర్లుగా 120 మంది నామినేషన్‌ దాఖలు చేశారు. మొత్తం నామినేషన్లలో పార్టీల వారిగా.. టీడీపీ 52, వైసీపీ 33, బీజేపీ 13, జనసేన 6, కాంగ్రెస్‌ 3, స్వతంత్రులు 38 మంది నామినేష్లన్‌ పత్రాలను ఆర్‌వోలకు అందజేశారు.

ఆదోని, గూడూరులో రెబల్స్‌:

ఆదోని, గూడూరులో అధికార కూటమి అభ్యర్థులకు రెబల్‌ బెడద తప్పేతట్లు లేదు. కూటమి సీట్లు సర్దుబాటులో భాగంగా ఆదోని జనసేనకు కేటాయిస్తారని ఆశించిన ఆ పార్టీ ఇన్‌చార్జి ఎన్‌.మల్లప్పకు నిరాశ మిగలడంతో, ఆయన భార్య స్వప్న నాయకర్‌ను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దింపారు. తొలిరోజే నామినేషన్‌ దాఖలు చేయగా చివరి రోజు ఊరేగింపుగా వెళ్లి రెండవ సెట్టు నామినేషన్‌ వేశారు. కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా గూడూరు చైర్మన్‌ పీఠం బీజేపీకి కేటాయించారు. పట్టణంలో బలంగా ఉన్న టీడీపీ నాయకులకు మింగడ పడడంలేదు. టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి, కేడీసీసీబీ చైర్మన్‌ ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి అత్యంత సన్నిహితుడు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రామాంజనేయులు తన భార్య వెంకటేశ్వరమ్మ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయించారు. టీడీపీ, జనసేన అధిష్ఠానం రంగంలోకి దిగి రెబల్‌ అభ్యర్థుల నామినేషన్‌ విత్‌డ్రా చేయించకపోతే ఆ రెండు చోట్ల కూటమి అభ్యర్థులకు రెబల్స్‌ నుంచి గట్టి పోటీ ఎదుర్కొవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Oct 19 , 2026 | 12:33 AM