Share News

పుర పోరుకు సై

ABN , Publish Date - Oct 12 , 2026 | 11:58 PM

పుర పోరుకు సై

పుర పోరుకు సై

మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు

మహిళలకు పెద్దపీట

ఎస్సీ మహిళకు కర్నూలు మేయర్‌

ఆదోని జనరల్‌ మహిళ, గూడూరు బీసీ మహిళకు..

ఎమ్మిగనూరు చైర్మన్‌ జనరల్‌

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వార్డుల కేటాయింపు

పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ

నోటిఫికేషన్‌ ఎప్పుడైనా రావొచ్చు?

కర్నూలు, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి) ‘పుర’ పోరులో భాగంగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇప్పటికే వార్డుల విభజన, ఓటర్ల జాబితా, బ్యాలెట్‌ బ్యాక్సులు సిద్ధం చేయడంతో పాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కూడా సన్నద్ధం చేసింది. సామాజికవర్గాల వారిగా ఓటర్లు విభజించారు. రెండు నెలల నుంచే రాష్ట్ర ఎన్నికల ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేసింది. కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసింది. నగర మేయర్‌, మున్సిపాలిటీల చైర్మన్లు, వార్డులు రిజర్వేషన్లు ఖారారు చేస్తూ సోమవారం పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి గెజిట్‌ రాగానే జిల్లా వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. ఇన్నాళ్లు చైర్మన్‌ పీఠంపై ఆశలు పెట్టుకున్న నాయకులకు రిజర్వేషన్లు వారి ఆశలపై నీళ్లు పోస్తే, కొందరికి అనుకోని అవకాశాలు దక్కేందుకు అడుగులు పడ్డాయి.

బీసీలకు 31.01 శాతం వార్డులు

జిల్లాలో కర్నూలు మేయర్‌, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు చైర్మన్‌ స్థానాలతో పాటు 187 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. చైర్మన్లను రాష్ట్ర పురపాలక శాఖ ఖరారు చేశారు. మున్సిపాలిటీలు యూనిట్‌గా వార్డులు రిజర్వేషన్ల ప్రకారం కేటాయించారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో 187 వార్డులు ఉంటే, ఎస్టీ జనరల్‌కు నాలుగు స్థానాలు కేటాయించారు. మొత్తం స్థానాల్లో ఎస్సీ జనరల్‌కు 16, మహిళలకు 15 కలిపి ఆ వర్గానికి 31 వార్డులు (16.58 శాతం) కేటాయించారు. బీసీ జనరల్‌కు 30, మహిళలకు 28 కలిపి 58 వార్డులు (31.01 శాతం) కేటాయించారు. అన్‌ రిజర్వుడు 44, జనరల్‌ మహిళలకు 50 కలిపి 94 వార్డులు (50.27 శాతం) కేటాయించారు. బీసీలకు 31.01 శాతం వార్డులు కేటాయించి కూటమి ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. మొత్తం వార్డుల్లో మహిళలకు 93 స్థానాలు కేటాయించారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్‌ జారీ అవకాశం ఉంది.

మేయర్‌, చైర్మన్‌ రిజర్వేషన్లు ఇలా

నగర/మున్సిపాలిటీ రిజర్వేషన్‌

కర్నూలు ఎస్సీ మహిళ

ఆదోని జనరల్‌ మహిళ

గూడూరు బీసీ మహిళ

ఎమ్మిగనూరు అన్‌ రిజర్వుడు

మున్సిపాలిటీల వారిగా ఏ వర్గానికి ఎన్ని వార్డులు రిజర్వేషన్‌ కల్పించారంటే..

రిజర్వేషన్‌ కర్నూలు ఆదోని ఎమ్మిగనూరు గూడూరు మొత్తం

ఎస్టీ జనరల్‌ 1 1 1 1 4

ఎస్టీ మహిళ 0 0 0 0 0

మొత్తం 1 1 1 1 4

ఎస్సీ జనరల్‌ 6 5 2 3 16

ఎస్సీ మహిళ 6 4 2 3 15

మొత్తం 12 9 4 6 31

బీసీ జనరల్‌ 11 8 9 2 30

బీసీ మహిళ 10 8 8 2 28

మొత్తం 21 16 17 4 58

జనరల్‌ మహిళ 18 14 12 6 50

అన్‌ రిజర్వుడు 16 12 10 6 44

మొత్తం 34 26 22 12 94

మొత్తం వార్డులు 68 52 44 23 187

మరోసారి ఎస్సీలకు ప్రాధాన్యం

ఎస్సీ మహిళకే మేయర్‌ పీఠం

కూటమి అభ్యర్థిగా బొల్లెద్దుల ప్రత్యూష?

అభ్యర్థి అన్వేషణలో వైసీపీ

కర్నూలు, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరపాలక సంస్థ మేయర్‌ పీఠం మరోసారి ఎస్సీలకు దక్కింది. 1995లో జరిగిన తొలి కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎస్సీ జనరల్‌గా పోటీ చేసిన బంగి అనంతయ్య ప్రత్యక్ష పద్ధతిలోనే నెగ్గారు. తర్వాత 30 ఏళ్లకు మళ్లీ ఎస్సీ (మహిళ)కు కేటాయించారు. నగరపాలక సంస్థ మేయర్‌, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల చైర్మన్లు సహా వార్డుల రిజర్వేషన్లు ఖారారు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మేయర్‌, చైర్మన్‌ బరిలో దిగేదెవరు..? పోరులో తలపడేదెవరు..? జిల్లాలో ఇదే హాట్‌ టాపిక్‌. కర్నూలు మేయర్‌ పీఠం తొలిసారిగా ఎస్సీ మహిళలకు రిజర్వు చేయడంతో నగర ప్రథమ పౌరురాలిగా ఎస్సీ మహిళ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమం కావడంతో ఆ సామాజిక వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మేయర్‌గా బాధ్యతలు చేపట్టేబోయే తొలి ఎస్సీ మహిళ ఎవరు..? నగరంలో ఏ ఇద్దరు కలసి ఇదే చర్చ. కూటమి అభ్యర్థిగా టీడీపీ మాజీ కార్పొరేటర్‌ బొల్లెద్దుల విజయ ప్రత్యూషను బరిలో దింపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంత్రి టీజీ భరత్‌ మద్దతు కూడా ఆమెకే ఉన్నట్లు సమాచారం. ఇదే క్రమంలో టీడీపీకి చెందిన మరికొందరు నాయకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీకి పోటీగా బలమైన వ్యక్తిని బరిలో దింపేందుకు వైసీపీ అభ్యర్థి అన్వేషణలో నిమగ్నమైంది. కర్నూలు కార్పొరేషన్‌కు 160 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రిటీష్‌ పాలనలోనే 1866లో మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. 1994లో అప్పటి ఉమ్మడి ఏపీ టీడీపీ ప్రభుత్వం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌ (నగరపాలక సంస్థ)గా హోదా ఏర్పాటు చేసింది.1995లో నగరపాలక సంస్థకు తొలిసారిగా ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో మేయర్‌ పీఠం ఎస్సీ జనరల్‌కు రిజర్వు చేశారు. నాడు ప్రత్యక్ష పద్దతిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బంగి అనంతయ్య విజయం సాధించి తొలి మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2000లో జరిగిన ఎన్నికల్లో జనరల్‌ మహిళలకు రిజర్వు చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు చెందిన ఫిరోజ్‌ బేగం విజయం సాధించి తొలి మహిళా మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2005లో మూడవ పర్యాయం జరిగిన ఎన్నికల్లో అన్‌ రిజర్వుడ్‌ (ఓసీ) చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించిన రఘురామిరెడ్డి పీఠంపై కూర్చుంటే, 2021లో బీసీ జనరల్‌గా రిజర్వు చేయడంతో వైసీపీ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన బీవై రామయ్య మేయర్‌ పీఠాన్ని అధిష్టించారు.

బరిలో తలపడేది ఎవరు?

కీలకమైన మేయర్‌ పీఠం ఎస్సీ మహిళకు రిజర్వు చేయడంతో కూటమి అభ్యర్థిగా ఎవరు బరిలో దిగుతారు..? టీడీపీ సహా బీజేపీ, జనసేన శిబిరాల్లో ప్రధాన చర్చగా మారింది. అయితే.. కూటమి పార్టీల మద్దతులో టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ మాజీ కార్పొరేటర్‌ బొల్లెద్దుల విజయ ప్రత్యూషను బరిలో దింపుతారనే చర్చ జోరుగా జరుగుతోంది. దివంగత టీడీపీ నాయకుడు బొల్లెద్దుల రామకృష్ణ కూతురే విజయ ప్రత్యూష. 2010 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న బొల్లెద్దుల రామకృష్ణ కుటుంబం ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ టీజీ వెంకేటేశ్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటోంది. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌కు బొల్లెద్దుల రామకృష్ణ కుమారులు బొల్లెద్దుల పవన్‌ కాంత్‌, ప్రశాంత్‌, కుమార్తె విజయ ప్రత్యూషలు అంత్యంత సన్నిహితంగా మారారు. 2021 ఎన్నికల్లో వైసీపీ అధికారం ముసుగులో అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడినా, వాటిని ఎదుర్కొని టీజీ భరత్‌ మద్దతు 52వ వార్డు టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన విజయప్రత్యూష విజయ సాధించారు. దీంతో ఆమెను మేయర్‌ అభ్యర్థిగా బరిలో దింపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే.. టీజీ భరత్‌కు సన్నిహితంగా ఉంటున్న జూటూరు రవి కూడా తన భార్య నంది సంధ్యారాణికి మేయర్‌ టికెట్‌ కోసం ఆశిస్తున్నట్లు తెలిసింది. తెలుగుయువత నంద్యాల జిల్లా కార్యదర్శి, పాణ్యం క్లస్టర్‌ ఇన్‌చార్జి ప్రభాకర్‌ సతీమణి కొప్పుల లావణ్య కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మణిగాంధి సతీమణి సుశీలమ్మ, కోడుమూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆదిమూలపు సతీశ్‌ భార్య స్టెల్లా సలినా, సీహెచ్‌ మద్దయ్య కూతురు డాక్టర్‌ సీహెచ్‌ రాణి ఈ ముగ్గురిలో ఒకరిని వైసీపీ బరిలో దింపే అవకాశం ఉందని ఆ పార్టీలో చర్చజరుగుతోంది.

Updated Date - Oct 12 , 2026 | 11:58 PM