ఈతకు వేళైంది..
ABN , Publish Date - Apr 26 , 2026 | 11:52 PM
వేసవి కాలం వచ్చిందంటే పిల్లలు సరదాగా నీటి కుంటలు, కాలువలు, బావులకు ఈతకు వెళ్తుంటారు.
తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి
గత అక్టోబరులో డీపీలో ఈతకు వెళ్లిన ముగ్గురు బీటెక్ విద్యార్థులు మృత్యువాత
గోనెగండ్ల, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి) : వేసవి కాలం వచ్చిందంటే పిల్లలు సరదాగా నీటి కుంటలు, కాలువలు, బావులకు ఈతకు వెళ్తుంటారు. గురువారం బడులకు సెలవులు ప్రకటించడంతో ఇంటి దగ్గర పుస్తకాల సంచులు పారవేసి గోనెగండ్ల గంజహళ్లి రోడ్డులోని ఎల్లెల్సీకాలువకు ఈతకు వెళ్తున్నారు. మనకు సమయం బాగున్నంతవరకు అంతా బాగానే ఉంటుంది. సమయం మనది కానప్పుడే చెడు జరుగుతుంది. గాజులదిన్నెప్రాజెక్టు గుంతలు, బావులు, కుంటలు, చెరువుల్లో ఈత కు వెళ్లే ముందు పిల్లల పట్ల వారి తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది.. ఈత అడే సమయంలో వారి అనందానికి హద్దు ఉండదు, బావి గట్టు మీద నుండి దూకడం వల్ల బావిలోని పూడికలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. చెరువులు, కుంటల పరస్ధితి కూడా ఇదే. ఏటా గోనెగండ్ల మండలంలో ఈత ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్ 17న ఎమ్మిగనూరు చెందిన బీటెక్ విద్యార్థులు గాజులదిన్నె ప్రాజెక్టులో ఈతకు వెళ్లి ముగ్గురు మృత్యువాత పడ్డారు. గాజుల దిన్నె ప్రాజెక్టు ఇప్పటికి ఆరుగురు ప్రాణాలను బలికొంది. గోనెగండ్లలోని ఎల్లెల్సీ కాలువలో ఈతకు వెళ్లిన అరుణ్‌కుమార్ అనే ఆరేళ్ల పిల్లవాడు నీట మునిగి మృతి చెందాడు. 2023న ఐరన్‌బండ గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న బాషా అనే విద్యార్థి ఎల్లెల్సీ కాలువలో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. నాలుగేళ్ల క్రితం గోనెగండ్ల మండలం నెరుడుప్ప గ్రామానికి చెందిన మల్లికార్జున, ప్రకాష్ అనే ఇద్దరు విద్యార్థులు ఈతకు వెళ్లి గాజులదిన్నె ప్రాజెక్టులోని గుంత లో పడి తల్లిదండ్రులకు కన్నీటిని మిగిల్చారు. ఎనిమిది నెలల క్రితం గోనెగండ్ల కురువ వీధికి చెందిన ఇద్దరు బాలికలు పొలంలోని నీటి గుంటలో ఈత ఆడేందుకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఇప్పటికైనా పిల్లలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.