Share News

రోడ్డు ప్రమాద బాధితుడికి పునర్జన్మ

ABN , Publish Date - May 14 , 2026 | 11:54 PM

నంద్యాల జిల్లాకు చెందిన 17 ఏళ్ల తౌపిక్‌ అనే యువకుడు 2025 ఆగస్టు 30వ తేదీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. జేసీబీ, బైక్‌ ఢీ కొన్న ప్రమాదంలో ఆ యువకుని చిన్న, పెద్ద పేగులు పూర్తిగా దెబ్బతిని బయటకు వచ్చాయి.

రోడ్డు ప్రమాద బాధితుడికి పునర్జన్మ
వైద్యులను అభినందిస్తున్న కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

జీజీహెచ్‌ వైద్యులకు సూపరింటెండెంట్‌ అభినందన

కర్నూలు హాస్పిటల్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాకు చెందిన 17 ఏళ్ల తౌపిక్‌ అనే యువకుడు 2025 ఆగస్టు 30వ తేదీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. జేసీబీ, బైక్‌ ఢీ కొన్న ప్రమాదంలో ఆ యువకుని చిన్న, పెద్ద పేగులు పూర్తిగా దెబ్బతిని బయటకు వచ్చాయి. పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో కర్నూలు జీజీహెచ్‌ను ఆశ్రయించారు. జనరల్‌ సర్జరీ ఐదవ యూనిట్‌ చీఫ్‌ డా.మాధవీ శ్యామల నేతృత్వంలో వైద్య బృందం 7 గంటలు శ్రమించి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ నిర్వహించి దెబ్బతిన్న పేగులకు చికిత్స అందించారు. ప్రస్తుతం తౌఫిక్‌ పూర్తిగా ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అయ్యారు. ఇంతటి క్లిష్టమైన సవాలుగా తీసుకుని తౌఫిక్‌కు పునర్జన్మ ప్రసాదించిన సర్జరీ ఐదవ యూనిట్‌ను హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లు వార్డుకు వచ్చి అభినందించారు. ఆయన మాట్లాడుతూ కార్పొరేట్‌ ఆస్పత్రులు సైతం చికిత్స అందించలేమని వెనుకడగు వేసిన తరుణంలో డా.మాధవీ శ్యామల బృందం వైద్యం అందించి రోగి ప్రాణాలను కాపాడారన్నారు. డా.మాధవీ శ్యామల మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను యువత తప్పనిసరిగా పాటించాలన్నారు. చిన్న నిర్లక్ష్యం జీవితాంతం బాధలకు దారితీస్తుందన్నారు. జనరల్‌ సర్జరీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డా.డీవీ చంద్రారెడ్డి, డా.ఎ్‌స.శృతి, అనస్థీషియా వైద్యులు డా.మహేష్‌ సర్జరీ పీజీ వైద్యవిద్యార్థులు డా.సాయి కుమార్‌, డా.దేవిక, డా.షమీర్‌ పాల్గొన్నారు

Updated Date - May 14 , 2026 | 11:54 PM