Share News

రాయలసీమను పట్టించుకోరా?

ABN , Publish Date - Aug 04 , 2026 | 01:09 AM

రాయలసీమను విస్మరించి కోస్తాలోనే అభివృద్ధిని కేంద్రీకరించడం సరైన విధానం కాదని, వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి పట్టదా? అని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కుంచం వెంకటసుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రాయలసీమను పట్టించుకోరా?
మాట్లాడుతున్న కుంచం వెంకట సుబ్బారెడ్డి

ఏక ప్రాంత అభివృద్ధి తగదు

రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు కుంచం

కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రాయలసీమను విస్మరించి కోస్తాలోనే అభివృద్ధిని కేంద్రీకరించడం సరైన విధానం కాదని, వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి పట్టదా? అని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కుంచం వెంకటసుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భారీ ప్రాజెక్టులు, అభివృద్ధి అంతా రాజధాని, ఉత్తరాంధ్ర ప్రాంతానికే పరిమితం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. సీమ నుంచే ముఖ్యమంత్రులు అవుతున్నా నేటికీ ఈ ప్రాంతం వెనుకబాటుతనానికి గురవుతూనే ఉందన్నారు. రాయలసీమలో ఇంటర్నేషనల్‌ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదన్నారు. రాయలసీమ ప్రజలు భోగాపురానికి వెళ్లి విమానం ఎక్కాలంటే సమయం, డబ్బు ఎంతో వృథా అన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేయాల్సిన విమానాశ్రయాన్ని బోగాపురంలో ఏర్పాటు చేయడం సీమకు ద్రోహం చేసినట్లే అవుతుందని అన్నారు. రాయలసీమ ప్రాంతాన్ని విస్మరిస్తే పుట్టగతులు ఉండవన్నారు. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, వేలూరు, కృష్ణగిరి, బళ్లారి, రాయచూరు, చిత్రదుర్గ, కోలార్‌తో కలిపి ప్రత్యేక రాయలసీమ ఏర్పాటుకు పోరాడాలని పిలుపునిచ్చారు. రాయలసీమ హక్కుల సాధన కోసం ఈ నెల 22న అనంతపురం పట్టణంలోని ఎన్జీఓ ప్రాంగణంలో ఉదయం 11 గంటలకు పార్టీ ప్లీనరీ సమావేశాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్లీనరీకి మేధావులు, విద్యావంతులు, సీమ ప్రజలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీమకు రావాల్సిన పరిశ్రమలను ఆంధ్ర, కోస్తాకు తరలిపోతున్నా సీమ నేతలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మైనార్టీ నాయకుడు పి.సాదర్‌ వలి, మహిళా విభాగం అధ్యక్షురాలు రెడ్డిపోగు కళావతమ్మ, రెడ్డి సంఘం రాష్ట్ర నాయకుడు కే.రామాంజనేయరెడ్డి, హసీనా, ముప్పసాని సుధాకర్‌, సంజీవరాజు పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2026 | 01:09 AM