బాబోయ్ ఎలుకలు
ABN , Publish Date - Mar 21 , 2026 | 01:17 AM
పట్టణ శివారులో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో ఎలుకల బెడదతో విద్యా ర్థినులు అల్లాడుతున్నారు
అంబేడ్కర్ గురుకులంలో ముగ్గురు విద్యార్థినులపై దాడి, ఆసుపత్రిలో చికిత్స
పట్టించుకోని నిర్వాహకులు
కోవెలకుంట్ల, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): పట్టణ శివారులో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో ఎలుకల బెడదతో విద్యా ర్థినులు అల్లాడుతున్నారు. తమపై దాడిచేసి గాయపపరుస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. హాస్టల్‌లో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు.
ముగ్గురు విద్యార్థినులపై దాడి..
ఈ వసతి గృహంలో 80 మంది పదో తరగతి విద్యార్ధినులు చదువుతున్నారు. రాత్రి వేళలో ఎలుకలు సంచరిస్తూ బాలికలపై దాడిచేసి గాయపరుస్తున్నాయి. ఈ నెల 18న రాత్రి ముగ్గురు విద్యార్ధులను గాయపరిచాయి. దీంతో వారిని కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. కాగా మరుసటి రోజు రాత్రి ఇద్దరు విద్యార్థినులను గాయపరచగా ఒకరు స్పృహ తప్పి పడిపోవడంతో వైద్యులు వైద్యం చేసి పంపించారు. అసలే పరీక్షలు జరుగుతుండటంతో ఇలా ఎలుకలు గాయపరిస్తే పరీక్ష ఎలా రాయాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రిన్సిపాల్, వార్డెన్ పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఎలుకలను నిర్మూలించి, విద్యార్థినులను కాపాడాలని కోరుతున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ సౌభాగ్యలక్ష్మిని వివరణ కోరగా ఎలుకల దాడిలో విద్యార్ధులు గాయపడిన మాట వాస్తవమేనన్నారు. ఎలుకలను పట్టేందుకు బోన్లు ఏర్పాటు చేశామని ఇంటర్ విద్యార్థినులకు పరీక్షలు అయిపోయినందున వారు ఇళ్లకు వెళ్లిపోయారని వారి గదులను 10వ తరగతి విద్యార్ధులకు ఇచ్చామని తెలిపారు.