క్యాన్సర్ రోగికి అరుదైన ఆపరేషన్
ABN , Publish Date - Nov 22 , 2026 | 12:16 AM
కిడ్నీ క్యాన్సర్ పెద్ద రక్తనాళానికి పాకిన 55 ఏళ్ల ఓ రోగికి కర్నూలు జీజీహెచ్ యూరాలజీ వైద్యులు అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు.
కిడ్నీ నుంచి పెద్ద రక్తనాళానికి పాకిన క్యాన్సర్
7 గంటలు శ్రమించి శస్త్రచికిత్స చేసిన వైద్యులు
కర్నూలు హాస్పిటల్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): కిడ్నీ క్యాన్సర్ పెద్ద రక్తనాళానికి పాకిన 55 ఏళ్ల ఓ రోగికి కర్నూలు జీజీహెచ్ యూరాలజీ వైద్యులు అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా మద్దికెర మండలానికి చెందిన ఓ వ్యక్తి గత 18 నెలలుగా చికిత్స కోసం రాయలసీమలోని పలు కార్పొరేట్ ఆసుపత్రులను సంప్రదించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కర్నూలు జీజీహెచ్‌లో కిడ్నీ క్యాన్సర్ నుంచి ఇన్ఫీరియర్ వీనా కావా (ఐవీసీ) అనే ప్రధాన రక్తనాళంలోకి వ్యాప్తించి ఉన్న ఆ రక్తనాళాన్ని పూర్తిగా మూసివేసి ఇతర రక్తనాళాలకు ఇబ్బంది కలగకుండా అనస్థీషియా వైద్యుల సహకారంతో ఆరోగ్యశ్రీ కింద యురాలజీ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. రోగి అక్టోబరు 23వ తేదీన యురాలజీ వార్డులో అడ్మిషన్ పొందారు. అన్ని పరీక్షలు నిర్వహించగా.. రోగికి కుడి కిడ్నీ క్యాన్సర్ పెద్ద నాళానికి పాకినట్లు స్టేజ్-3 క్యాన్సర్‌గా యురాలజీ వైద్యులు గుర్తించారు. దీంతో ఈ నెల 12న యూరాలజీ హెచ్‌వోడీ డా.ముత్యశ్రీ అసోసియేట్ ప్రొఫెసర్ డా.సేపూరి బాలరవితేజ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాజశేఖర్, మహేశ్, అరుణ్, గౌతమ్, అనస్థీషియా వైద్యులు అరుణలత, సౌజన్య పీజీల వైద్య బృందం దాదాపు ఏడు గంటలు శ్రమించి క్యాన్సర్ సోకిన పెద్ద నాళాన్ని పూర్తి మూసివేసి, రక్తాన్ని సరఫరా చేసే ఇతర నాళాలకు ఇబ్బంది కలగకుండా విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఆపరేషన్ చేయడం ఉమ్మడి రాష్ట్రంలోనే మొదటి కేసు అని ఆపరేషన్ చేసిన యూరాలజీ వైద్య బృందాన్ని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లు అభినందించారు. యూరో అంకాలజిస్టు డా.బాలరవితేజ మాట్లాడుతూ కిడ్నీ క్యాన్సర్ ఐవీసీలోకి వ్యాపించి ఆ రక్తనాళం పూర్తిగా మూసుకుపోయిన పరిస్థితిలో ఆపరేషన్ చేయడం అత్యంత సవాలుతో కూడుకున్న విషయమని వివరించారు. ముఖ్యంగా రక్తనాళాన్ని పూర్తిగా తొలగించి మిగిలిన ఎడమ కిడ్నీ నుంచి రక్తప్రసరణకు అవసరమైన మార్గాన్ని కాపాడినట్లు తెలిపారు.