అతీ గతీ లేని ఆధునిక రైతుబజార్
ABN , Publish Date - Apr 26 , 2026 | 12:01 AM
రైతులు పండించిన కూరగాయలకు మంచి ధర అందించడానికి, దళారుల బెడదను నివారించడానికి గత తెలుగుదేశం ప్రభుత్వం రైతుబజార్లను ఏర్పాటు చేసింది.
శంకుస్థాపన దాకా వచ్చి వాయిదా
ప్రభుత్వం నిధులు కేటాయించినా అధికారుల్లో సమన్వయ లేమి
కర్నూలు అగ్రికల్చర్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన కూరగాయలకు మంచి ధర అందించడానికి, దళారుల బెడదను నివారించడానికి గత తెలుగుదేశం ప్రభుత్వం రైతుబజార్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కర్నూలు నగరంలోని సీ. క్యాంపు రైతుబజార్‌ను ఏర్పాటు చేశారు. రైతులకు, వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా మారిన ఈ రైతుబజార్ రాష్ట్రంలోనే గుర్తింపు పొందింది. గత మే నెలలో సీఎం చంద్రబాబు నాయుడు రైతుబజార్‌ను తనిఖీ చేసిన సమయంలో.. ఈ రైతుబజార్‌కు అనుబంధంగా కేటాయించిన స్థలంలో ఆధునిక రైతుబజార్‌ను నిర్మించాలని రైతులు కోరారు. దీనికి సీఎం చంద్రబాబు స్పందించి రూ.6.50 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే ఆధునిక రైతుబజార్ నిర్మాణాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ అధికారులు ఇంజనీరింగ్ అధికారులను సమన్వయం చేసుకుని ఆధునిక రైతుబజార్ నిర్మించడంలో ఘోరంగా విఫలమయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతుబజార్‌ను ఏర్పాటు చేస్తే మరో 600 మంది రైతులకు కూరగాయలు అమ్ముకునేందుకు అవకాశం ఉంటుందని, వినియోగదారులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మంత్రి టీజీ భరత్ ఇటీవల ఆధునిక రైతుబజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే.. ప్రొటోకాల్ ప్రకారం ఏ ఏ ప్రభుత్వ విభాగాల అధికారులను పిలవాలో సరైన నిర్ణయం తీసుకోవడంలో ఇంజనీరింగ్ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు విఫలమయ్యారు. దీంతో శంకుస్థాపన వాయిదా పడింది. మళ్లీ శంకుస్థాపన ఎప్పుడు చేస్తారో, పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక రైతులు ఆవేదన చెందుతున్నారు.