Share News

మళ్లీ పెంచేశారు..

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:04 AM

ఏటా ఖరీఫ్‌లోనే ఎరువుల ధరలు పెంచడం పరిపాటి. ఈసారి రబీలోనూ ఎరువుల ధరలను కంపెనీలు పెంచేశాయి. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.

మళ్లీ పెంచేశారు..

రబీలోనూ పెరిగిన ఎరువుల ధరలు

ఉమ్మడి జిల్లా రైతులపై రూ.60 కోట్ల భారం

బస్తా ఎరువుపై 100 నుంచి రూ.150 అదనం

అన్నదాత నడ్డి విరుస్తున్న ఎరువుల తయారీ కంపెనీలు

ఏటా ఖరీఫ్‌లోనే ఎరువుల ధరలు పెంచడం పరిపాటి. ఈసారి రబీలోనూ ఎరువుల ధరలను కంపెనీలు పెంచేశాయి. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎరువుల తయారీకి ముడిసరుకును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం.. దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఎరువుల లభ్యత దేశీయంగా తగినంత లేకపోవడంతో వివిధ కంపెనీల యజమానులు ఇతర దేశాల నుంచి ముడిసరుకులు దిగుమతి చేసుకుని ఇక్కడే తయారు చేస్తున్నారని వ్యవసాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. దీని వల్ల ఎరువుల తయారీ ధర బాగా పెరిగిందని అంటున్నారు. కారణం ఏమైనా ఎరువుల ధరలు బాగా పెరగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

కర్నూలు అగ్రికల్చర్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): రబీలోనూ రైతులకు ఎరువుల భారం తప్పడం లేదు. ఎరువుల తయారీ కంపెనీలు ధరలు పెంచేశాయి. బస్తా ఎరువుపై ఇప్పుడున్న ధరలకు అదనంగా రూ.100 నుంచి అధికంగా రూ.150కు పెరగడంతో రైతులు కోట్లభారం మోయాల్సి వస్తుంది. యూరియా, డీఏపీ ధరల్లో మార్పు లేకున్నా మిగిలిన ధరల్లో బస్తాపై అదనంగా 100 నుంచి రూ.150 పెంచుతూ 20 రోజుల కిందట ఆయా ఎరువుల కంపెనీల యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయంపై రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రస్తుత రబీ సీజన్‌లో రైతులు 1.70 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలను సాగు చేశారు. ప్రధానంగా శనగ, వేరుశనగ, కంది, మొక్కజొన్న, తదితర పంటలను సాగు చేశారు. ఆయా పంటలకు ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఒక ఎకరాకు 6 నుంచి 10బస్తాల ఎరువు వేయాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఇందులో యూరియా 30 శాతం, పొటాష్‌, సూపర్‌ ఫాస్పేట్‌ మిశ్రమ ఎరువులు 70 శాతం వినియోగిస్తారు. మిశ్రమ ఎరువులో పొటాష్‌, సూపర్‌ ఫాస్పేట్‌, మిశ్రమ ఎరువులు వంటివి ఎక్కువగా ఉంటాయి.

వ్యాపారులు లింకు పెట్టి..

మరో వైపు యూరియా కావాలంటే వేరే ఎరువులు కూడా కొనుగోలు చేయాలని వ్యాపారులు లింకు పెట్టి రైతులపై అదనపు భారం వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల కంపెనీల యజమానులకు వాటి ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇస్తుందని, తమ బాధత కేవలం ఎంఆర్‌పీ ధరలకే వ్యాపారులు రైతులకు అమ్మేలా చూడటమేనని వారు స్పష్టం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఎరువుల..

కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచుకునేందుకు వాటి తయారీ యజమానులకు అనుమతి ఇవ్వడంతో ఉమ్మడి జిల్లా రైతులపై దాదాపు రూ.60 కోట్ల భారం పడనుంది. ఇప్పటికే వివిద కారణాలతో పంట సాగుకు ఖర్చులు పెరిగిపోయి రైతులు పంట సాగును చేపట్టలేక చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది.

పెరిగిన ధరలు ఇలా

ఎరువు రకం ఒక బస్తాపై

ధర (రూ.లలో)

పొటాష్‌ రూ .1,800-00

10-26-26రకం రూ.2,050-00

28-28-0 రకం రూ.1,900-00

14-35-14 రకం రూ.1,950-00

28-20-20-0-13 రకం రూ.1,500-00

15-15-15 రకం రూ.1,650-00

16-16-16 రకం రూ.1,650-00

ఆర్థిక భారం పెరిగిపోతుంది

గతంలో సంవత్సరానికి ఒకసారి ఎరువుల ధరలను పెంచేవారు. ప్రస్తుతం సంవత్సరంలో రెండు సార్లు ఎరువుల ధరలను పెంచుతుంటంతో రైతులపై ఆర్థిక భారం పెరిగిపోతుంది. కేంద్ర ప్రభుత్వం ఆయా పంటలకు మద్దతు ధరను ప్రకటించడం వరకే పరిమితమవుతోందని ఆ ధరలను కచ్చితంగా బహిరంగ మార్కెట్‌లో రైతుల నుంచి అందేలా చర్యలు తీసుకోవడం లేదు. కనీసం ఎరువుల ధరలనైనా నిలకడగా ఉంచితే రైతులకు ఎంతో భారం తప్పుతుంది.

రామకృష్ణ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, కర్నూలు

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

ఇటీవల కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరిగాయి. వాటిని తయారు చేస్తున్న సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో ముడిసరుకుల ధరలు పెరిగాయని కేంద్రానికి వివరించాయి. ప్రభుత్వం ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఒక బస్తా ఎరువుపై ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మాత్రమే డీలర్లు విక్రయించాలి. అధిక ధర వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం.

శాలురెడ్డి, ఏడీఏ, కర్నూలు

Updated Date - Jan 10 , 2026 | 12:04 AM