అకాల వర్షం..అపార నష్టం
ABN , Publish Date - Apr 22 , 2026 | 11:52 PM
మండలంలో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. మండలంలో రైతులు అధికంగా సాగు చేసే అరటి చెట్లు నిలువునా నేలకూలాయి.
ఈదురు గాలులకు నేలవాలిన అరటిచెట్లు
నేల కూలిన విద్యుత్ స్తంభాలు
గ్రామాల్లో అంధకారం
మహానంది, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): మండలంలో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. మండలంలో రైతులు అధికంగా సాగు చేసే అరటి చెట్లు నిలువునా నేలకూలాయి. వేలాది హెక్టార్లల్లో చెట్లు నేలకూలడంతో రూ.లక్షలాది పంట నష్టం జరిగింది. మండు వేసవిలో వర్షం కురియడంతో ప్రజలు ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందారు. మండలంలోని గ్రామాల్లో ఈదురుగాలులకు కొన్ని చెట్లు నేలకూలి విద్యుత్త్ స్తంభాలపై పడటంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది.
గాలివాన బీభత్సం
రుద్రవరం, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): మండలంలో బుధవారం సాయంత్రం గాలీవాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. రహదారికి అడ్డంగా చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురి సింది. రహదారుల వెంట ఆరబోసిన వరి ధాన్యం మొక్కజొన్నలు తడిచి ముద్ద య్యాయి. కోటకొండ, యల్లావత్తుల, చిన్నకంబలూరు, శ్రీరంగాపురం, డి.కొట్టాల గ్రామాల్లో వర్షం కురిసింది. రైతులకు తీవ్ర నష్టం కలిగింది. విపరీతమైన గాలి వీచడంతో వరి పంట నేలవాలిందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడంతో గ్రామాలు అంధకారంలో మునిగాయి.