Share News

శరవేగంగా రైల్వే ప్రాజెక్టులు

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:40 PM

రాష్ట్రంలో గతేడాది మే 1న ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన వివిధ రైల్వే ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి.

శరవేగంగా రైల్వే ప్రాజెక్టులు
కర్నూలు రైల్వే స్టేషన్‌

రూ.4,687 కోట్లతో ముద్ఖేడ్‌-డోన్‌ వయా కర్నూలు విద్యుదీకరణ

గతేడాది మేలో ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన

కర్నూలు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గతేడాది మే 1న ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన వివిధ రైల్వే ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మేరకు పనుల ప్రగతిపై సోమవారం రైల్వే శాఖ నివేదిక ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని ముద్ఖేడ్‌ - డోన్‌ వయా కర్నూలు రైల్వేలైన్‌ విద్యుదీకరణ కోసం రూ.4,687.09 కోట్లతో చేపట్టారు. 417.88 కిలో మీటర్లు ఉన్న ఈ లైన్‌ కర్నూలు-డోన్‌ మధ్య 73 కిలో మీటర్లు పనులు జోరుగా సాగుతున్నాయి. గుంతకల్లు - గుంటూరు వయా మద్దికెర, తుగ్గలి, ఆర్‌ఎస్‌ పెండేకల్లు, డోన్‌, బేతంచర్ల, నంద్యాల మీదుగా డబుల్‌ రైల్వేలైన్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి. 401 కిలోమీటర్ల ఈ రైలుమార్గం డబ్లింగ్‌, విద్యుదీకరణకు రూ.3,887 కోట్లతో కేంద్రం ఆమోదం తెలపడంతో గతేడాది పనులు చేపట్టారు. ఈ రైలు మార్గంలో నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లి-ప్రకాశం జిల్లా దిగువమెట్ట మధ్యలో దాదాపు 30 కిలోమీటర్లు నల్లమల అభయారణ్యం ఉంది. నల్లమల అడవిలో అత్యంత కీలకమైన రెండు రైల్వే టన్నెల్‌ పనులు పూర్తి చేశారు. అలాగే.. గుంతకల్లు రైల్వే జంక్షన్‌ నుంచి కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు వివిధ ప్రాంతాలను కలుపుతూ ఏడు రైల్వే లైన్లను అనుసంధానం చేశారు. బళ్లారి జిల్లాలో జిందాల్‌ స్టీల్‌ పరిశ్రమ నుంచి గూడ్స్‌ రాకపోకలు భారీగా పెరగడంతో రైల్వే ట్రాఫిక్‌ను నియంత్రణలో భాగంగా గుంతకల్లు-గుంటూరు రైలుమార్గంలో చిప్పగిరి మండలం మల్లప్పగేట్‌ (నంచర్ల) స్టేషన్‌ మధ్య రూ.293.30 కోట్లతో 9.64 కిలోమీటర్లు రైల్‌ ఓవర్‌ రైల్‌ (ఆర్‌ఓఆర్‌) డబుల్‌ రైల్వేలైన్‌, రూ.164.58 కోట్లతో 11 కిలోమీటర్లు బైపాస్‌ రైల్వే పనులకు ప్రధాని మోదీ గత మే నెలలో శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.351.83 కోట్లతో అనంతపురం జిల్లా గుత్తి- కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పెండేకల్లు మధ్య 29.23 కిలో మీటర్లు డబ్లింగ్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

Updated Date - Feb 02 , 2026 | 11:40 PM