రైల్వే గేటు పడిందా.. అంతే
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:13 AM
కోసిగిలో రైల్వేగేటు పడిందంటే చాలా ఇక అం తే సంగతలు. నిత్యం వందలాది వాహనాలతో బిజీగా ఉండే కోసిగి రైల్వేగేటు వద్ద గురువారం సాయంత్రం ఓ గుండె నొప్పి బాధితుడు పడరాని పాట్లు పడ్డాడు.
అరగంట పాటు ఆటోలోనే కొట్టుమిట్టాడిన గుండెనొప్పి బాధితుడు
ఒకేసారి మూడు రైళ్ల రాకతో నిలిచిన రాకపోకలు
కోసిగి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): కోసిగిలో రైల్వేగేటు పడిందంటే చాలా ఇక అం తే సంగతలు. నిత్యం వందలాది వాహనాలతో బిజీగా ఉండే కోసిగి రైల్వేగేటు వద్ద గురువారం సాయంత్రం ఓ గుండె నొప్పి బాధితుడు పడరాని పాట్లు పడ్డాడు. వివ రాలు.. మండలంలోని దుద్ది గ్రామానికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తికి ఒక్కసారిగా ఛాతిలో తీవ్రమైన నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆటోలో కోసిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దురదృష్ణవశాత్తు అదే సమయంలో రైల్వేగేటు పడడం, ఒకేసారి మూడు రైళ్లు రాకపోకలు సాగించడంతో సుమారు అరగంటకు పైగా గేటు తీయలేదు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. తీవ్రమైన గుండెనొప్పితో ఆటోలోనే ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న దుర్గయ్యను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతూ ఆటోలోనే ప్రథమ చికిత్స చేస్తూ ఇబ్బందులు పడ్డారు. గేటు తీసిన అనంతరం బాధితుడిని ఆస్పత్రికి తరలించగా డ్యూటీలో ఉన్న ఎంఎల్‌హెచ్‌పీ ఉదయ్, ఎంపీహెచ్‌ఓ శ్రీనివాసులు తక్షణమే స్పందించి అత్యవసర చికిత్స అందించారు.
ప్రతి రోజూ 120కి పైగా..
కోసిగి మీదుగా ప్రతిరోజూ 120కి పైగా రైళ్లు నడుస్తుండడంతో ప్రతి అరగంటకు ఒకసారి రైల్వేగేటు పడుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన మంత్రాలయం, ఉరుకుంద ఈ మార్గంలోనే ఉండడంతో నిత్యం వేలాది మంది భక్తులు, వాహనదారులు ఇక్కడే గంటల తరబడి చిక్కుకుపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి కోసిగి వద్ద రైల్వే ఫ్లై ఓవర్ లేదా అండర్ బ్రిడ్జిని నిర్మించి తమ ప్రాణాలను కాపాడా లని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.