Share News

రూ.21లక్షలకు పుట్టపాశం సర్పంచ్‌ పదవి ఏకగ్రీవం

ABN , Publish Date - Nov 17 , 2026 | 11:16 PM

గోనెగండ్ల మండల పరిధిలోని పుట్టపాశం గ్రామ సర్పంచ్‌ పదవికి నిర్వహించిన వేలం పాటలో రూ. 21లక్షలకు గ్రామానికి చెందిన బోయ తలారి తిమ్మగురుడు సర్పంచ్‌ పదవిని దక్కించుకున్నాడు.

రూ.21లక్షలకు పుట్టపాశం సర్పంచ్‌ పదవి ఏకగ్రీవం
ఏకగ్రీవంగా ఎంపిక అయిన మహిళా సర్పంచ్‌ బీటీ లలితమ్మ

గ్రామంలో వేలంపాట నిర్వహించిన గ్రామస్థులు

గోనెగండ్ల, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): గోనెగండ్ల మండల పరిధిలోని పుట్టపాశం గ్రామ సర్పంచ్‌ పదవికి నిర్వహించిన వేలం పాటలో రూ. 21లక్షలకు గ్రామానికి చెందిన బోయ తలారి తిమ్మగురుడు సర్పంచ్‌ పదవిని దక్కించుకున్నాడు. గ్రామంలో మంగళవారం ఉదయం గ్రామ సర్పంచ్‌ పదవికి గ్రామస్థులు రాజకీయాలకు ఆతీతంగా మూకుమ్మడిగా ఆంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో వేల పాట నిర్వహించారు. పుట్టపాశం గ్రామం బీసీకి రిజర్వేషన్‌ అయింది. అయితే గ్రామానికి చెందిన రవిరెడ్డి, బోయ తలారి తిమ్మగురుడు వేలం పాటలో పాల్గొన్నారు. ఇందులో ఎవరు ఎక్కువగా డబ్బు చెల్లిస్తే వారికి సర్పంచ్‌ పదవి దక్కుతుంది. వచ్చిన డబ్బుతో గ్రామంలోని సుంకులమ్మ, పెద్దమ దేవాలయాలను అభివృద్ధి చేయాలని తీర్మానం చేశారు. ఇద్దరి మధ్య వేలం పాట రూ. 15 లక్షల నుంచి పాట ప్రారంభమై చివరికి రూ. 21 లక్షలకు చేరింది. తలారి తిమ్మగురుడు తన భార్య బీటీ లలితమ్మ పేరుపై రూ. 21 లక్షలు చెల్లిస్తానని చెప్పడంతో రవిరెడ్డి వెనక్కి తగ్గారు. దీంతో గ్రామ పెద్దలు సర్పంచ్‌ పదవి ఏకగ్రీవానికి ఆమోదం తెలిపారు. ఇక గ్రామంలో తిమ్మగురుడు కుటుంబసభ్యులు తప్ప ఎవ్వరు సర్పంచ్‌కు నామినేషన్‌ వేయరాదని తీర్మానించుకున్నారు. సర్పంచ్‌ పదవి ఏకగ్రీవం చేయడంతో వచ్చే రూ. 21 లక్షలతో గ్రామంలోని సుంకులమ్మ, పెద్దమ్మ దేవాలయాల అభివృద్ధికి ఖర్చు చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఏకగ్రీవం అయిన పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన వచ్చే పోత్రాహక బహుమతి రూ 10లక్షలు ప్రభుత్వం నుంచి పుట్టపాశంకు వస్తుంది. ఈ డబ్బు గ్రామంలోని సీసీరోడ్లకు, తాగునీటి పథకాలకు ఖర్చు చేస్తామని గ్రామ పెద్దలు తెలిపారు.

Updated Date - Nov 17 , 2026 | 11:16 PM