దర్శనాల్లో ప్రక్షాళన
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:28 PM
శ్రీశైల క్షేత్రంలో స్వామి, అమ్మ వార్ల దర్శనాల విధి విధానాల్లో ప్రక్షాళన చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు అన్నారు.
భక్తుల సౌకర్యం కోసం విధానాల్లో మార్పు
భక్తులను మోసగిస్తే ఉపేక్షించేది లేదు
ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు
ఆలయంలో ఆకస్మిక తనిఖీలు
శ్రీశైలం, జులై 14 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో స్వామి, అమ్మ వార్ల దర్శనాల విధి విధానాల్లో ప్రక్షాళన చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు అన్నారు. మంగళవారం ఆయన క్యూలైన్లు, కంపార్టుమెంట్లతో పాటు గర్భాలయం వద్ద ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలువురు దళారులను పసిగట్టి బయటకు పంపించారు. కొందరు భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసుకుని టెకెట్లు తీసుకోకుండా ఆలయ ప్రవేశం కల్పించేందుకు యత్నించిన వారిని అడ్డుకున్నారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల విశ్వాసాన్ని మోసగించేందుకు ప్రయత్నించిన వారిని ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. దేవస్థానానికి వచ్చే ఆదాయాన్ని తమ సొంత ఖాతాల్లో వేసుకునే దళారులను ప్రోత్సహించడం సమంజసం కాదని అధికారులకు, సిబ్బందికి సూచనలిచ్చారు. భక్తులు స్వామివారిని సంతృప్తికరంగా దర్శించుకునేలా విధివిధానాలను మార్చబోతున్నామని అన్నారు. ఉభయ దేవాలయాల్లో జరిగే ఆర్జిత సేవలు, దర్శనాలు సంతృప్తికరంగా చేసుకునేందుకు అవసరమైన సానుకూల ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకే ట్రస్ట్‌బోర్డు కృషి చేస్తుందని భక్తులకు తెలియపరిచారు. క్యూలైన్లలో పలువురి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు.