కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:27 PM
జిల్లాలో జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించి ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు.
ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్
కలెక్టరేట్ ఎదుట ధర్నా
నంద్యాల నూనెపల్లి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించి ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ ముందు జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రుడు ఆధ్వర్యంలో రైతులు జొన్నలు, మొక్కజొన్నలు పోసి ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 72 వేల ఎకరాల్లో జొన్న, లక్ష అరవై ఏడు వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారన్నారు. ఎకరాకు దాదాపు 40వేల వరకు పెట్టుబడి పెట్టి పంటలు పండించి పంటలు చేతికొచ్చాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో మధ్యదళారులకు అతి తక్కువ ధరలకు అమ్మి తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు రైతుల బాధను గుర్తించి మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ కార్తీక్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా సహాయ కార్యదర్శులు సురేశ్, రామ్మోహన్, శ్రీనివాసరెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లాకార్యదర్శి సుధాకర్‌తో పాటు గడివేముల, పాణ్యం, బేతంచెర్ల, గోస్పాడు, నంద్యాల, రుద్రవరం, చాగలమర్రి, శిరివెళ్ల, ఆళ్లగడ్డ మండల్లాలోని రైతులు పాల్గొన్నారు.