కేంద్రం చేతిలో కీలుబొమ్మలు
ABN , Publish Date - Apr 18 , 2026 | 11:27 PM
కేంద్రం చేతిలో వైసీపీ, టీడీపీ కీలుబొమ్మలుగా మారాయని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
డీ లిమిటేషన్‌తో రాష్ర్టానికి నష్టం
వైసీపీ, టీడీపీపై సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు
నంద్యాల రూరల్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): కేంద్రం చేతిలో వైసీపీ, టీడీపీ కీలుబొమ్మలుగా మారాయని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం సీఐటీయూ 17వ రాష్ట్ర మహాసభలకు విచ్చేసిన ఆయన సీపీఎం కార్యాలయంలో మాట్లాడుతూ మహిళాబిల్లుకు మెజారిటీ లేనప్పుడు ప్రతిపక్షంతో సంప్రదించకుండా ఏకపక్షంగా పార్లమెంట్‌లో ఎలా ప్రవేశపెడతారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం, పార్లమెంట్‌పై ఏమాత్రం గౌరవం లేదన్నారు. 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు అమలు చేయలేదని, ఇప్పుడు ఎందుకు ప్రవేశపెట్లారో చెప్పాలని ప్రశ్నించారు. డీ లిమిటేషన్ వల్ల రాష్ర్టానికి నష్టం వాటిల్లుతుందన్నారు. డీ లిమిటేషన్ ప్రక్రియ జనాభా ప్రతిపాదికన సాగుతుందని, 50 శాతం సీట్లు పెరుగుతాయనడం వాస్తవం కాదన్నారు. 2029 నాటికి మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారం కోసం మాటతప్పడం బీజేపీకి పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ, టీడీపీ పాటుపడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మహిళా కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రమే్‌షకుమార్, నరసింహ పాల్గొన్నారు.