Share News

టిడ్కోలో ప్రజాధనం వృథా

ABN , Publish Date - Aug 30 , 2026 | 11:42 PM

వందల కోట్ల రూపాయల ప్రజా ధనం వెచ్చించారు.

టిడ్కోలో ప్రజాధనం వృథా
కర్నూలు నగరం జగనాథగట్టులో నిర్మించిన ఏపీ టిడ్కో ఇళ్లు

నిర్మాణ చేపట్టింది 30,448 ఇళ్లు, పూర్తయినవి 11,768

నివాసం ఉన్నది కేవలం 1,495 గృహాల్లోనే

మౌలిక వసతులు లేకపోవడమే ప్రధాన కారణం

వందల కోట్ల రూపాయల ప్రజా ధనం వెచ్చించారు. వేలాది ఇళ్ల నిర్మాణం పూర్తయింది. దూరం నుంచి చూస్తే ఆ ఇళ్ల సముదాయం అద్భుత నగరాన్ని తలపిస్తున్నది. అయితే.. ఆ ఇళ్లలో నివాసం ఉండడానికి పేదలు ముందుకు రావడం లేదు. ఎందుకుంటే ఇళ్లు నిర్మించారే తప్ప మౌలిక వసతులు సమకూర్చు లేదు. తాగడానికి నీళ్లు లేవు. పట్టణాల్లోకి రావాలంటే రవాణా సౌకర్యం లేదు. అర్ధరాత్రి ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటోలు కూడా అందుబాటులో ఉండవు. ఫలితంగా పేదలకు నీడ ఇవ్వాల్సిన ప్రభుత్వ పక్కా ఇళ్లు నిరుపయోగంగా మారి పాలకుల వైఫల్యాలను ఎత్తిచూపుతున్నాయి. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏపీ టిడ్కో గృహాల దుస్థితి ఇది. పురపాలక కమిషనర్లకు 11,768 ఇళ్లు అప్పగించామని ఏపీ టిడ్కో ఇంజనీర్లు పేర్కొంటున్నారు. కాపురం ఉన్నది మాత్రం 1,495 గృహాల్లోనే. ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా కర్నూలు నగరం, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, డోన్‌, ఆళ్లగడ్డ పట్టణాలో పేదలకు సొంతింటి కల సాకారం కోసం గత టీడీపీ ప్రభుత్వంలో పీఎం అవాస్‌ యోజన - ఎన్టీఆర్‌ ఇళ్లు పథకంలో భాగంగా 30,448 ఏపీ టిడ్కో ఇళ్లు మంజూరు చేశారు. నగర, పట్టణ శివారులో బహుళ అంతస్తుల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. నాటి సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా వీటిని చేపట్టారు. రూ.1,650 కోట్ల అంచనా వ్యయం, షేర్‌వాల్‌ టెక్నాలజీతో చేపట్టిన జీ+3 ఇళ్ల సముదాయ నిర్మాణాలను ఏపీ టౌన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ టిడ్కో) ఇంజనీర్ల పర్యవేక్షణలో పెట్టారు. రెండు విడతల్లో చేపట్టిన 30,448 ఇళ్లకు గాను పది వేలకు పైగా ఇళ్లు దాదాపుగా పూర్తయ్యాయి. మౌలిక వసతులు కల్పించి పేదలకు వాటిని అప్పగించే సమయంలో 2019 మేలో జగన్‌ ఆధ్వర్యంలో కొలువుదీరిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల నిర్లక్ష్యం శాపంగా మారింది. ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. అన్ని విధాలుగా పూర్తయిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు అప్పగించలేదు. నిరుపయోగంగా మారిన ఇళ్లలో దొంగలు పడి విద్యుత్‌ వైర్లను దోచుకెళ్లారు.

కూటమి ప్రభుత్వంలోనూ అదే నిర్లక్ష్యం

సీఎం చంద్రబాబు సారథ్యంలో మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చినా టిడ్కో ఇళ్ల నిర్మాణం, పేదలకు పంపిణీ చేయడంలో అదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. నాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడితే.. నేడు ఆనాటి చిత్తశుద్ధి కనిపించడం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలోనే కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, డోన్‌ పట్టణాల్లో 9,723 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించినా మౌలిక వసతులు లేక గృహ ప్రవేశాలు చేయలేదు. కూటమి ప్రభుత్వం రావడంతో టిడ్కో ఇళ్లు కేటాయిస్తారని భావించిన పేదలు ఆశలు ఎండమావులే అయ్యాయి. గత ఫిబ్రవరిలో సీఎం చంద్రబాబు ఏటీ టిడ్కో ఇళ్లపై సమీక్షా నిర్వహించి, ఉగాది పర్వదినాన రాష్ట్రంలో లక్ష ఇళ్లను పేదలకు అప్పగించి గృహ ప్రవేశాలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉగాది పోయింది..వినాయక చవితి వస్తోంది. ! గృహ ప్రవేశాలు మాత్రం జరగలేదు. నిర్మాణాలు చేసిన ఇళ్లను ఎప్పటికప్పుడు నగర, పురపాలక కమిషనర్లకు అప్పగించామని టిడ్కో ఇంజనీర్లు పేర్కొనడం కొసమెరుపు.

వేల ఇళ్లు.. వందల్లో నివాసాలు:

ఉమ్మడి జిల్లాలో 30,448 ఇళ్లు చేపట్టి 11,768 ఇళ్లను నివాసానికి యోగ్యంగా అన్ని విధాలుగా నిర్మాణాలు పూర్తి చేసి కమిషన్లకు అప్పగించినట్లు ఏపీ టిడ్కో ఇంజనీర్లు తెలిపారు. అయితే.. గృహ ప్రవేశాలు చేసిన కేవలం 1,495 కుటుంబాలు మాత్రమే నివాసం ఉన్నాయి. కనీస మౌలిక వసతులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మౌలిక వసతులు కల్పించి పేదలకు నీడ కల్పించాలని పలువురు కోరుతున్నారు.

వేధిస్తున్న సమస్యలు ఇవి:

కర్నూలు నగర శివారులో జగన్నాథగట్టుపై 9,952 టిడ్కో ఇళ్లు నిర్మించారు. 3,056 ఇళ్లు పూర్తి చేసి నగరపాలక సంస్థ కమిషనర్‌కు అప్పగించారు. తాగునీరు సమస్య తీవ్రంగా ఉంది. ఇళ్లకు నీటి సరఫరా లేదు. నగరానికి దాదాపు 8-10 కిలో మీటర్ల దూరంలో ఉండడంతో రవాణా సౌకర్యం లేదు. దీంతో 300-400 మంది లబ్ధిదారులకు మించి నివాసాలు లేరని అధికారులే పేర్కొంటున్నారు.

ఎమ్మిగనూరు పట్టణంలో శివన్న నగర్‌, మైనార్టీ కాలనీల పక్కనే 4,272 ఏపీ టిడ్కో ఇళ్లు నిర్మాణాలు చేట్టారు. 2,928 ఇళ్లు కమిషనర్‌కు అప్పగించారు. లబ్ధిదారులకు ఇంటి తాళాలు కూడా ఇచ్చారు. 50-75 కుటుంబాలకు మించి నివాసం లేరని తెలుస్తోంది. ఇక్కడ కూడా తాగునీరు అందడం లేదు. అస్తవ్యస్తంగా డ్రైనేజీ సమస్య ఉంది. దట్టంగా పెరిగిన ముళ్ల పొదలు తొలగించకపోవడంతో విషకీటకాల భయం వెంటాడుతోంది.

ఆదోని పట్టణానికి దూరంగా సిరుగుప్ప కూడలిలో 4,544 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. రెండు వేల ఇళ్లు నివాసానికి యోగ్యంగా పూర్తి చేసిన అప్పగించామని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా 110 మంది లబ్ధిదారులు మాత్రమే నివాసం ఉన్నారు. తాగునీటి సమస్య ఉంది. దట్టంగా పెరిన ముళ్ల పొదలు ఇబ్బందిగా మారింది. దైరంగా ఉండడంతో రవాణా సౌకర్యం ప్రధాన సమస్యగా మారింది.

నంద్యాల పట్టణ శివారులో ఎస్‌ఆర్‌బీసీ కాలనీ ఆనుకొని పది వేలు ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. 2,096 ఇళ్లు పూర్తి చేసి కమిషనర్‌కు అప్పగించామని, అందులో మెజార్టీ ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించామని అధికారులు అంటున్నారు. కేవలం 60 కుటుంబాలు మాత్రమే అక్కడ ఉంటున్నాయి.

ఈ సౌకర్యాలు కల్పిస్తే..:

నివాసానికి అనుకూలంగా అన్ని విధాలుగా నిర్మాణాలు పూర్తి చేసిన ఇళ్లకు తాగునీరు, విద్యుత్‌, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలి.

నగరం, పట్టణాలకు దూరంగా నిర్మించడం వల్ల వివిధ పనుల కోసం వెళ్లే పెద్దలు, చదువు కోవడానికి పాఠశాల, కళాశాలలకు వెళ్తున్న విద్యార్థుల కోసం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యం కల్పించాలి.

ఆ కాలనీల్లో నివాసం ఉండే యువతకు ప్రభుత్వమే రాయితీపై ఆటోలు కొనుగోలు చేసి ఇస్తే, అర్థరాత్రి ఏ అసరం వచ్చినా ఇబ్బంది ఉండదు.

ఏపీ టిడ్కో కాలనీల్లోనే రేషన్‌ బియ్యం, నెలనెల పింఛన్లు పంపిణీ చేయాలి. లేదంటే.. ప్రస్తుతం వారుండే కాలనీల్లోకి వెళ్లి తెచ్చుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

అంగన్‌వాడి కేంద్రాలు, 24 గంటలు పని చేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

ఉమ్మడి జిల్లాలో మంజూరైన ఏపీ టిడ్కో ఇళ్లు, అన్ని విధాలుగా పూర్తై కమిషనర్లకు అప్పగించిన ఇళ్లు, ప్రస్తుతం నివాసం ఉన్న కుటుంబాల వివరాలు

నగరం/పట్టణం మంజూరు అప్పగించినవి నివాసాలు

కర్నూలు నగరం 9,952 3,056 400

ఆదోని 4,544 2,000 110

ఎమ్మినూరు 4,272 2,928 75

నంద్యాల పట్టణం 10,000 2,096 60

ఆళ్లగడ్డ 1,392 1,392 850

డోన్‌ 288 288 --

మొత్తం 30,448 11,768 1,495

పూర్తయిన ఇళ్లు కమిషనర్లకు అప్పగిస్తున్నాం

ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 11,768 టిడ్కో ఇళ్లను నివాసాలకు యోగ్యంగా ఉండేలా పూర్తి చేసి ఆయా మున్సిపల్‌ కమిషనర్లకు అప్పగించాం. వారే లబ్ధిదారులకు అప్పగిస్తారు. టిడ్కో కాలనీల్లో మౌలిక వసతుల సమస్యలు లేవు. వచ్చే డిసెంబరు ఆఖరు నాటికి వంద శాతం ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

- రవికుమార్‌ గుప్తా, ఈఈ, ఏపీ టిడ్కో, కర్నూలు

Updated Date - Aug 30 , 2026 | 11:42 PM