Share News

పెద్దాసుపత్రిలో ఆక్సిజన్‌ లీకేజీ

ABN , Publish Date - Aug 10 , 2026 | 11:32 PM

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గ్యాస్ర్టో ఎంట్రాలజీ ఐసీయూ వార్డుకు సరఫరా అయ్యే ఆక్సిజన్‌ పైపు లైన్‌లపై ప్రమాదవశాత్తు చెట్టుకొమ్మ విరిగి పడింది.

పెద్దాసుపత్రిలో ఆక్సిజన్‌ లీకేజీ
రోగిని ఐసీయూ వార్డు నుంచి గ్యాస్ర్టో ఎంట్రాలజీ విభాగానికి తరలిస్తున్న బంధువులు

చెట్టు కొమ్మ విరిగి పడటంతో ఆక్సిజన్‌ పైపులైన్‌ ధ్వంసం

గ్యాస్ర్టో ఎంట్రాలజీ ఐసీయూ విభాగానికి నిలిచిన ఆక్సిజన్‌ సరఫరా

కర్నూలు హాస్పిటల్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గ్యాస్ర్టో ఎంట్రాలజీ ఐసీయూ వార్డుకు సరఫరా అయ్యే ఆక్సిజన్‌ పైపు లైన్‌లపై ప్రమాదవశాత్తు చెట్టుకొమ్మ విరిగి పడింది. ఉదయం 8.30 గంటల సమయంలో ఎండోస్కోపి గది ఎదురుగా చెట్టు కొమ్మ విరిగి పడటంతో ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలో రోగులు అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డా.కే. వెంకటేశ్వర్లు తక్షణమే దెబ్బతిన్న ఆక్సిజన్‌, వాటర్‌ సప్లయ్‌ పైపులైన్‌లకు మరమ్మతుల పనులు చేపట్టాలని ఆదేశించారు. లైఫ్‌ సపోర్టు సిస్టమ్‌ అనే ప్రైవేటు ఏజెన్సీకి చెందిన ఆక్సిజన్‌ టెక్నీషియన్‌లను రప్పించి మరమ్మతుల పనులు చేపట్టారు. ఆర్‌ఎంవో డా. వెంకటరమణ పనులను పర్యవేక్షించి గ్యాస్ర్టో ఎంట్రాలజీ ఐసీయూలో ఉన్న రోగులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఐసీయూలో ఆక్సిజన్‌ మీద ఉన్న ఓ రోగికి రెండు డీ-టైప్‌ సిలిండర్‌ అమర్చిన తర్వాత రోగి పరిస్థితి దృష్ట్యా రోగిని ఆక్సిజన్‌ సరఫరా ఉన్న గ్యాస్ర్టో ఎంట్రాలజీ వార్డుకు షిప్టు చేశారు. చివరకు సాయంత్రం 5 గంటలకు ఆక్సిజన్‌ మరమ్మతుల పనులు పూర్తయి ఆక్సిజన్‌ సరఫరా మొదలవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 120 ఎకరాలు ఉన్న ఇంత పెద్దాసుపత్రిలో తరచూ ఆక్సిజన్‌ లీకేజీ ప్రమాదాలు జరుగుతుంటాయి. గతంలో ఈ ఆక్సిజన్‌ లీకేజీగానీ ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు లైఫ్‌ సపోర్టు సిస్టమ్‌ అనే సంస్థకు చెందిన ఆక్సిజన్‌ టెక్నీషియన్లు మరమ్మతుల పనులు చేపట్టి ఇబ్బందులు లేకుండా చేసేవారు. కానీ ఈ సంస్థ గడువు గత రెండేళ్ల క్రితం ముగియడంతో ఆసుపత్రిలో ఎప్పుడు ఆక్సిజన్‌ లీకేజీ జరుగుతుందో ప్రమాదాలు జరుగుతాయోనన్న భయంతో రోగులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Aug 10 , 2026 | 11:32 PM