నగర నిర్మాణంలో ప్రజల సహకారం అవసరం
ABN , Publish Date - May 23 , 2026 | 11:30 PM
కర్నూలు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజల సహకారం అవసరమని కలెక్టర్, నగర పాలక ప్రత్యేక అధికారి సిరి అన్నారు.
‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ ప్రారంభోత్సవంలో కలెక్టర్ సిరి
కర్నూలు న్యూసిటీ, మే 23(ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజల సహకారం అవసరమని కలెక్టర్, నగర పాలక ప్రత్యేక అధికారి సిరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని శనివారం నగరంలోని వినాయక ఘాట్ వద్ద నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. మున్సిపల్ కార్మికులు, విద్యార్థులు, స్థానిక ప్రజలతో కలిసి కేసీ కెనాల్‌లో, అలాగే ఒడ్డున స్వచ్ఛత పనులు చేపట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని 52 వార్డులలో సోర్స్ సెగ్రిగేషన్‌ను మరింత బలోపేతం చేస్తున్నామని, ప్లాస్టిక్, ఈ-వేస్ట్, సీఅండ్‌డీ వ్యర్థాలు వంటి చెత్తను ప్రత్యేకంగా సేకరించే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. త్వరలో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని, నాలుగు వారాల ప్రత్యేక పారిశుధ్య కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీశ్‌కుమార్‌రెడ్డి, డీఎస్‌డీవో భూపతిరాజు, నగర పాలక కార్యదర్శి నాగరాజు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు, ఎస్‌ఈ రమణమూర్తి, ఆర్వోలు స్వర్ణలత, వాజిద్, ఇన్‌చార్జి సిటీ ప్లానర్ వైవీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.