గ్రీన్‌కో... ఓకే
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:06 AM
గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు సామర్థ్యం 1200 మెగావాట్ల నుంచి 1680 మెగావాట్ల పెంపునకు లైన్ క్లియర్ అయింది.
ఓర్వకల్లులో ప్రాజెక్టు సామర్థ్యం పెంపునకు ప్రతిపాదన
కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ
సానుకూలంగా స్పందించిన మూడు గ్రామాల ప్రజలు
ఓర్వకల్లు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు సామర్థ్యం 1200 మెగావాట్ల నుంచి 1680 మెగావాట్ల పెంపునకు లైన్ క్లియర్ అయింది. మెగావాట్ల పెంపు ప్రతిపాదనపై గురువారం ఓర్వకల్లు మండల పరిధిలోని గుమితంతండా, కాల్వ, బ్రాహ్మణపల్లి పిన్నాపురం గ్రామాలకు చెందిన ప్రజలతో కలెక్టర్ డాక్టర్ సిరి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ దిగువ జలాశయానికి బండ్ నిర్మాణం చేపట్టడంతో పాటు టర్బ్‌లైన్ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1680 మెగావాట్లకు పెరుగుతోందని వివరించారు. ప్రాజెక్టుకు పర్యావరణ ప్రభావ అంచనాలో భాగంగా గాలి నాణ్యత, ఉపరితల జలాలు, భూగర్బ జలాల నాణ్యతపై అధ్యయనం నిర్వహించినట్లు తెలిపారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో 30 కిలోమీటర్ల పరిధిలోని 10 గ్రామాల్లో పర్యావరణ పరిస్థితులపై అధ్యయనం జరిగిందన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల కింద సంస్థ చేపట్టిన అభివృద్ది పనులను కూడా కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు, కల్వర్టుల నిర్మాణం, స్కిల్ డెవల్‌పమెంట్ కేంద్రాల ఏర్పాటు, శిక్షణ, వైద్యశిబిరాల నిర్వహణ, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. గ్రామస్థులు ఏకీభవించి అంగీకారం తెలిపారు. ప్రాజెక్టు మరింత విజయవంతంగా కొనసాగి పరిసర గ్రామాలఅభివృద్ధికి కృషి చేయాలని ప్రజలు కలెక్టర్‌ను కోరారు. ప్రాజెక్టు ఏర్పాటుతో భూముల విలువ పెరగడంతో పాటు రైతులు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ రమేష్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కిషోర్ రెడ్డి, గ్రీన్‌కో సంస్థప్రతినిధులు, తహసీల్దార్ విద్యాసాగర్, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసనాయుడు తదితరులు పాల్గొన్నారు.
దశలవారీగా అభివృద్ధి చేస్తాం
పవర్ ప్రాజెక్టు సమీపంలోని గ్రామాలను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నాం. మరింత అభృవృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్‌తో చర్చించి సంస్థ పరిధిలో సాధ్యమయ్యే కార్యక్రమాలను ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా అమలు చేస్తాం. గుమితంతండా గ్రామాన్ని తమ సొంత గ్రామంగా భావించి ప్రాజెక్టు ప్రారంభం నుంచి మంచి సహాకారం లభిస్తోంది. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు కలెక్టర్‌తో చర్చించి సాధ్యమైన మేరకు ఒక్కొక్కటిగా అమలు చేస్తాం. - శ్రీనివాసులు, గ్రీన్‌కో ప్రాజెక్టు డైరెక్టర్