గిట్టుబాటు ధర ఇవ్వండి
ABN , Publish Date - Oct 23 , 2026 | 11:34 PM
ఎల్‌నినో కారణంగా రైతులు తీవ్ర నష్టాలకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు కర్నూలు మార్కెట్ కమిటీ అధికారులను ఆదేశించారు.
సక్రమంగా సెస్సును రాబట్టండి
మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు
కర్నూలు అగ్రికల్చర్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో కారణంగా రైతులు తీవ్ర నష్టాలకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు కర్నూలు మార్కెట్ కమిటీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం విజయవాడ నుంచి వచ్చిన డైరెక్టర్ శ్రీనివాసులు కర్నూలు మార్కెట్ కమిటీ యార్డును అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి, ఏడీఎం నారాయణమూర్తి డైరెక్టర్ శ్రీనివాసులును కలిసి కర్నూలు మార్కెట్ కమిటీలో ఏ ఏ పంట ఉత్పత్తులను రైతులు అమ్మకానికి తెస్తున్నారో.. వారికి ప్రస్తుతం లభిస్తున్న మద్దతు ధరలతో పాటు మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు అందిస్తున్న సౌకర్యాలు, సేవలను వివరించారు. డైరెక్టర్ శ్రీనివాసులు మార్కెట్ యార్డుకు ఉల్లిగడ్డలను అమ్మకానికి తెచ్చిన రైతులతో మాట్లాడారు. ప్రస్తుతం యార్డులో మంచి ధర లభిస్తోందని, అయితే.. ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడి భారీగా దిగుబడి తగ్గిందని, దీనివల్ల మంచి ధర లభించినా ఉల్లి సాగుకు చేసిన ఖర్చు అందే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డైరెక్టర్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్యం మేరకు సెస్సును వ్యాపారుల నుంచి రాబట్టాలని, ఇందు కోసం చెక్‌పోస్టుల్లో నిఘా పెంచాలని, ఈ-పర్మిట్ విధానం సక్రమంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంట ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరిగే కర్నూలు మార్కెట్ యార్డులో రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, వీటిపై ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.