111 రోజులుగా దీక్షలు
ABN , Publish Date - Jul 11 , 2026 | 10:49 PM
ఉభయ రాష్ట్రాలకు విద్యుత్ కాంతులు అందించిన శ్రీశైలం ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన నిర్వాసితులు నాలుగు దశాబ్దాలుగా అంధకారంలోనే మగ్గిపోతున్నారు.
శ్రీశైలం ముంపు నిర్వాసితుల నిరంతర ఆందోళన
నమ్మించి మోసగించిన వైసీపీ
కూటమి ప్రభుత్వమైనా న్యాయం చేయాలి
40 ఏళ్లుగా హామీలతోనే సరిపెడుతున్నారు
ఉద్యోగాల కోసం నిర్వాసితుల పోరాటం
కనీసం ఇచ్చిన హామీలైనా నెరవేర్చాలని వేడుకోలు
ఉభయ రాష్ట్రాలకు విద్యుత్ కాంతులు అందించిన శ్రీశైలం ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన నిర్వాసితులు నాలుగు దశాబ్దాలుగా అంధకారంలోనే మగ్గిపోతున్నారు. అధికారంలోకి వచ్చే ముందు ప్రతి పార్టీకీ వారి సమస్య ఒక ఆయుధం. అధికారం చేపట్టాక ప్రభుత్వాలు ఆ హామీని నెరవేర్చడంలో నిర్లక్ష్యం చూపుతున్నాయి. 1986లో నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో సర్వం కోల్పోయిన బాధితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జీవో 98ను తీసుకొచ్చారు. 2013-24 వరకు 968 మందికి విడతల వారీగా ఉద్యోగాలు వచ్చాయి. ఈ జాబితాలో ఇంకా 674 మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కూటమి నేతలు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ నిర్వాసితులు గత 111 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు.
నందికొట్కూరు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల, నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పాముల పాడు, కొత్తపల్లి మండలాల్లోని పలు గ్రామాలు శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో నీట మునిగాయి. వారికి నష్టపరిహారంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జీవో నెం:98ను విడుదల చేశారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,652 మందితో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబితాను ఇరిగే షన్ అధికారులు సిద్ధం చేశారు. అయితే మొదటి జాబితాలోని 968 మందికి 2013-24 వ్యవధిలో విడతల వారీగా ఉద్యోగాలు వచ్చా యి. మిగిలిన 674 మంది ముంపు బాధితులు ఉద్యోగాల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తు న్నారు. గత వైసీపీ హయాంలో 111 రోజుల పాటు నందికొట్కూరు పట్టణంలోని పొట్టిశ్రీ రాములు సర్కిల్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆ ప్రభుత్వం మొండి చేయి చూపింది. 2019, 2024 ఎన్నికల ముందు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో శ్రీశైలం నీటి ముంపు బాధితులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా తమకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో కూటమి నేతలు నిర్లక్ష్యం చూపుతున్నారంటూ ప్రస్తుతం శ్రీశైలం నీటి ముంపు బాధితులు 111 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. నేటికీ ఏ నాయకుడూ వారి వైపు కన్నెత్తి చూడలేదు.
భిక్షాటన చేస్తున్న ముంపు బాధితులు
శ్రీశైలం ప్రాజెక్టు ప్రారంభం పుణ్యమా అంటూ గ్రామాలకు గ్రామాలు తుడిచిపెట్టుకుని పోయా యి. ఆ సమయంలో భూస్వాములుగా ఉన్న రైతులు బంధువుల ఊళ్లకు, ఇతర గ్రామాలకు పొట్ట చేత పట్టుకొని వలసలు వచ్చారు. కొత్త ప్రదేశం చేతిలో చిల్లిగవ్వలేదు. ఉండడానికి నిలువ నీడలేదు. అయిన రెక్కలను నమ్ముకుని పిల్లా పాపలకు కడుపు నింపారు. జీవో నెం 98 వచ్చాక చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడంతో ఆశతో గత 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇందులో కొందరు బిక్షాటన చేస్తూ చనిపోయిన వారు కొందరు ఉండగా.. మరికొందరు మతిస్థిమితం కోల్పోయారు. ఇప్పటికీ కొందరు భిక్షాటన చేస్తూనే ఉన్నారు.
రిటైర్ అయిన స్థానాలతోనైనా..
ప్రస్తుతం 2013లో ఇరిగేషన్ శాఖలో లస్కర్లుగా ఉద్యోగ అవకాశాలు పొందిన వారిలో అధికారుల లెక్కల ప్రకారం 205 మంది ఇప్పటికే రిటైర్ అయ్యారు. వీరి స్థానాల్లో రెండో జాబితాలోని 674 మందికి ఉద్యోగ అవకాశం కల్పించాలని శ్రీశైలం నీటి ముంపు బాధితులు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం రిటైర్డ్, పదోన్నతులు పొందుతున్న లస్కర్ల స్థానంలో ఈ జాబితాలోని వ్యక్తులను భర్తీ చేస్తే వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ విధానం ద్వారా ప్రభుత్వంపై అదనపు భారం పడదు. 674 మంది బాధితులకు ఉద్యోగాలు వచ్చాక జీవో నెం:98ను రద్దు చేయవచ్చని నిర్వాసితులు వాపోతున్నారు.
క్లీనర్‌గా పని చేస్తున్నా..
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో మా పొలాలు నీట మునిగాయి. పొట్ట కూటి కోసం నాగటూరులో జీవనం సాగిస్తున్నాం. లారీలకు క్లీనర్‌గా వెళ్తూ జీవనం సాగించాను. 98 జీవో ప్రకారం లస్కర్ ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కాని మాకు న్యాయం చేయడం లేదు.
- నాగేంద్రుడు, నాగటూరు
వ్యవసాయ కూలీగా...
సంకిరేణిపల్లె గ్రామం నీట మునగడంతో నూతనంగా సంకిరేణిపల్లెను నిర్మించుకున్నాం. అక్కడ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాం. 98 జీవో కింద ఉద్యోగం కల్పిస్తే సీఎంకు రుణపడి ఉంటాం.
- లక్ష్మన్న, సంకిరేణిపల్లె, పగిడ్యాల మండలం
ఆటో వేస్తూ కుటుంబ పోషణ
మల్యాల గ్రామంలో తమ పొలం నీట మునగడంతో పొట్టకూటి కోసం నందికొట్కూరుకు వలస వచ్చాం. ఇక్కడే ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాం. ఎన్నికల ముందు తమరు ఇచ్చిన హామీని నెరవేర్చితే 674 కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపినవారవుతారన్నారు. ఈ కుటుంబాలన్నీ సీఎంకు రుణపడి ఉంటాయి.
- మౌలాలి, నందికొట్కూరు
జీవో తెచ్చిన ప్రభుత్వమే పట్టించుకోలేదు
1986లో శ్రీశైలం నీటి ముంపు బాధితుల కోసం అప్పటి సీఎం నందమూరి తారకరామారావు జీవో నెం:98ను తీసుకొచ్చారు. కానీ ఈ జీవో వచ్చి 40 ఏళ్లు పూర్తి అవుతున్నా... టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క వ్యక్తికి ఉద్యోగ అవకాశం కలగలేదు. ప్రస్తుతం లస్కర్లు 205 మంది రిటైర్ అయి ఉన్నారు. వారి స్థానాల్లో 647 మందిని క్రమ పద్ధతిలో భర్తీ చేయాలి. 2024 ఎన్నికల ముందు పటేల్ సెంటర్‌లో నారా చంద్రబాబు నాయుడు, యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌లు శ్రీశైలం నీటి ముంపు బాధితులకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడంతో గత 106 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదు. ఇప్పటికైనా మా గోడును విని మానవీయ కోనంలో ముఖ్యమంత్రి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
- జయన్న, శ్రీశైలం నీటి ముంపు బాధితుల సంఘం నాయకులు, నెహ్రూనగర్