శ్రీశైలం ప్రాజెక్టుకు రక్షణ చర్యలు..!
ABN , Publish Date - Jan 21 , 2026 | 10:44 PM
శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, డ్యాం భద్రతకు ప్రమాదకరంగా మారిన ప్లంజ్‌పూల్ భారీ గొయ్యి పూడ్చివేత పనుల్లో కదలిక మొదలైంది.
డ్యాం సిలిండర్ల మరమ్మతులు
ప్లంజ్‌పూల్ గుంత పూడ్చివేతకు మోక్షం
టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేసిన సీడబ్ల్యూసీ
ఇప్పటికే కూటమి ప్రభుత్వం రూ.203 కోట్లు కేటాయింపు
కేంద్రం జోక్యంతో మరమ్మతుల్లో వేగం
శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, డ్యాం భద్రతకు ప్రమాదకరంగా మారిన ప్లంజ్‌పూల్ భారీ గొయ్యి పూడ్చివేత పనుల్లో కదలిక మొదలైంది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) సిఫారుసులు, ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక నిపుణుల కమిటీ (టెక్నికల్ టీం) ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఎం చంద్ర బాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం డ్యాం భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. డ్యాం, పంజ్‌పూల్ మరమ్మతులు, ప్రొటెక్టివ్ స్టీల్ సిలిండర్ల ఏర్పాటు పనులకు రూ.208 కోట్లు మంజూరు చేసింది. గతేడాది ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్ అనిల్ జైన్ డ్యాం భద్రతపై ఆందోళన వ్యక్తిం చేసిన విషయం తెలిసిందే. ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కర్నూలు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం.. తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీరు అందించడంతో పాటు విద్యుత్తు ఉత్పత్తి చేసే బహుళార్ధక సాధక ప్రాజెక్టు. ముఖ్యంగా నిత్యం కరువు, వలసలతో తల్లడిలే రాయలసీమ ప్రాంతం రైతుల జీవనాడి. డ్యాం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు. 2009 అక్టోబరులో 25.5 లక్షల క్యూసెక్కులకు పైగా అత్యంత భారీ వరద రావడంతో ప్రాజెక్టు భారీగా దెబ్బతింది. డ్యాం పర్యవేక్షణ, మరమ్మతులకు కీలకమైన అప్రోచ్ రోడ్డు వరదకు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు గేట్లు దిగువన ఆప్రాన్ ముందు భాగంలో ప్లంజ్‌పూల్ భారీ గొయ్యి ఏర్ప డింది. ప్రాజెక్టు పునాదుల కంటే లోతులో ఈ గుంత ఉన్నట్లు ఇప్పటికే నిపుణులు గుర్తించారు. ప్లంజ్‌పూల్ గొయ్యి విస్తరించకుండా డ్యాం పునాదులకు రక్షణగా ఏర్పాటు చేసిన ప్రొటెక్టివ్ స్టీల్ సిలిండర్లు పూర్తిగా శిథిలావస్థవకు చేరుకున్నాయి.
రాష్ట్ర విభజన తరువాత మరమ్మతు చర్యలు
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం నామమాత్రపు మరమ్మతులతో సరిపుచ్చింది. రాష్ట్ర విభజన తరువాత 2014 సెప్టెంబరు 23న ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ శ్రీశైలం ప్రాజెక్టు భద్రత, నిర్వహణ లోపాలను అధ్యయనం కోసం తొలిసారిగా నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఆ తరువాత పదేళ్లలో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ డాక్టర్ వైకే మూర్తి ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్, డ్యాం భద్రత నిపుణుడు ఏబీ పాండ్యా ఆధ్వర్యంలో మరో కమిటీ, ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్ వివేక్ త్రిపాఠి నేత్వత్యంలోని నిపుణుల కమిటీ.. ఇలా అనేక మంది నిపుణుల కమిటీలు, ప్యానెళ్లు ప్రాజెక్టును సందర్శించారు. డ్యాం భద్రతపై పలు లోపాలను ఎత్తిచూపారు. అదే క్రమంలో భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన మరమ్మతులపై పలు సూచనలు, సిఫార్సులు చేశారు. అధ్యయనాల్లోనే గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లు కాలం గడిచిపోయింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం హయాంలో మరమ్మతులు, నిర్వహణకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
అనిల్ జైన్ సందర్శనతో కదలిక
శ్రీశైలం డ్యాంను 2025 ఏప్రిల్‌లో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) చైర్మన్ అనిల్‌జైన్ సందర్శించారు. డ్యాం రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రొటెక్టివ్ స్టీల్ సిలిండర్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నట్లు గుర్తించారు. వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోతే.. ప్రమాదకరంగా మరిన ప్లం జ్‌పూల్ గుంత మరింతగా విస్తరించి డ్యాం పునాదులకే ప్రమాదంగా మారుతుందని ఆయన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఆయన సూచనల మేరకు కూటమి ప్రభుత్వం ప్లంజ్‌పూల్ గొయ్యి తీవ్రతపై పూణేకు సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీ ఆర్‌ఎస్) సంస్థ, డ్యాంకు రక్షణగా ఏర్పాటు చేసిన సిలిండర్ల దుస్థితిపై విశాఖకు చెందిన సిలైన్ ఆఫ్‌షోర్ డైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో అధ్యయనం చేయించారు. వివిధ పద్ధ్దతుల్లో ప్లంజ్‌పూల్ గుంతపై ఆధ్యయనం చేసిన సీడబ్ల్యూపీఆర్‌ఎస్ సంస్థ ప్లంజ్‌పూల్ గుంత 43-45 మీటర్లు లోతు, 400 మీటర్లు పొడవు, 270 మీటర్లు వెడల్పుతో ఉందని, 2018 నాటి గుంత లోతుతో పోలిస్తే పెద్దగా తేడా లేకపోయినా.. డ్యాం ఆనకట్ట పునాదుల లోతు కంటే ప్లంజ్‌పూల్ గుంత లోతే ఎక్కువగా ఉందని నివేదిక ఇచ్చింది. అలాగే డ్యాం భద్రతలో ఎంతో కీలకమైన ప్రొటెక్టీవ్ స్టీల్ సిలిండర్ల తాజా పరిస్థితిపై అధ్యయనం చేసిన సీలైన్ ఆఫ్‌షోర్ డైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 62 సిలిండర్లు పూర్తిగా దెబ్బతిని శిథిలావస్థకు చేరుకున్నాయని, కొన్ని సిలిండర్లు నీటిలో ఎలాంటి ఆధా రం లేకుండా తేలుతున్నట్లు గుర్తిం చాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో డ్రిల్లింగ్ చేసి కొత్త ప్రొటెక్టీవ్ సిలిండర్లు ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చింది.
రూ.203 కోట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
శ్రీశైలం డ్యాం భద్రతకు సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభు త్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రూ.203.95 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే డ్యాం ఇరువైపున కొండరాళ్లు ఊడిపోకుండా రూ.5.90 కోట్లతో షాట్‌క్రీటింగ్, రూ.25.50 కోట్లతో కీలకమైన అప్రోచ్ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. డ్యాం భద్రత కోసం ప్రొటెక్టీవ్ స్టీల్ సిలిండర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే పంజ్‌పూల్ గుంత 43-45 మీటర్ల లోతులో ఉంది. నిత్యం నీటితో నిండి ఉంటుంది. ఆ నీళ్లలో సిలిండర్లు ఎలా ఏర్పాటు చేయాలి..? పంజ్‌పూల్ గుంతను శాశ్వతంగా పూడ్చివేసేందుకు ఉన్న అవకాశాలు ఏమిటన్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతున్న ప్రశ్నలు. దీంతో సిలిండర్ల ఏర్పాటుపై సాంకేతిక సలహాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సీడబ్ల్యూసీని కోరింది.
సాంకేతిక నిపుణులతో కమిటీ
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) చైర్మన్ అనిల్‌జైన్ సిఫార్సు, ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక నిపుణుల కమిటీని నియమించింది. సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీరు (డిజైన్) వివేక్ త్రిపాటి నేత్వత్యంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో సీడబ్ల్యూసీ డైరెక్టర్లు సోమేశ్‌కుమార్, సమర్థ్ అగర్వాల్, డిప్యూటీ డైరెక్టర్లు అరుణ్ ప్రతాప్ సింగ్, మధుకాంత్ గోయల్, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త మనీశ్ గుప్తా, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త ఎంకే వర్మ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ శైలేంద్ర సింగ్, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ కబీర్‌బాషాలు సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ డ్యాంను పరిశీలించి డ్యాం మరమ్మతులు, ప్రొటెక్టీవ్ సిలిండర్ల ఏర్పాటు, ప్రమాదకరంగా మారిన పంజ్‌పూల్ గుంత మరమ్మతులపై పలు సూచనలు చేయనుంది. డ్యాం మరమ్మతుల్లో వేగం పుంజుకోనుంది. ఈ విషయాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ కబీర్‌బాషా దృష్టికి ఆంధ్రజ్యోతి తీసుకెళ్లగా శ్రీశైలం డ్యాం మరమ్మతులు, ప్రొటెక్టీవ్ స్టీల్ సిలిండర్ల ఏర్పాటు, పంజ్‌పూల్ గుంతపై అధ్యయనం చేసిన సూచనలు, సలహాల కోసం సీడబ్ల్యూసీ నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిందని వెల్లడించారు.