Share News

ప్రజారోగ్యాన్ని కాపాడాలి

ABN , Publish Date - Mar 31 , 2026 | 11:53 PM

బంగారం ముడి లోహాన్ని వేరు చేసే ప్రక్రియలో వివిధ ముడి లోహాలను శుద్ధి చేయడానికి సైనెడ్‌ వినియోగిస్తూ ప్రజల ప్రాణాలతో జియో మైసూరు కంపెనీ చెలగాటమాడుతోందని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని బీజేపీ నాయకులు కోరారు

ప్రజారోగ్యాన్ని కాపాడాలి
మంత్రులకు వినతి పత్రం ఇస్తున్న బీజేపీ నాయకులు

సైనైడ్‌ వినియోగించి జియో మైసూరు కంపెనీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది

మంత్రులకు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు

తుగ్గలి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): బంగారం ముడి లోహాన్ని వేరు చేసే ప్రక్రియలో వివిధ ముడి లోహాలను శుద్ధి చేయడానికి సైనెడ్‌ వినియోగిస్తూ ప్రజల ప్రాణాలతో జియో మైసూరు కంపెనీ చెలగాటమాడుతోందని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని బీజేపీ నాయకులు కోరారు. కర్నూలులో మంగళవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గీతామాధురి, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు కొత్తకాపు హేమసుందర్‌రెడ్డి తదితరులు కలిశారు. జియో మైసూరు కంపెనీ ప్రాణాంతకమైన సైనైడ్‌ రసాయనాలు ఉపయోగించి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారని మంత్రులకు వివరించారు. వారు మాట్లాడుతూ పగిడిరాయి, బొండ్లవానిపల్లె, జొన్నగిరి గ్రామాల మధ్యలో వెలసిన జియో మైసూరు కంపెనీ ఆధ్వర్యంలో బంగారం నిక్షేపాలు వెలికితీస్తున్నారని, అయితే బయటకు తీసిన తర్వాత శుద్ధి చేయడానికి ప్రాణాంతకమైన రసాయనాలు వాడుతున్నారని చెప్పారు. ఈ రసాయనాల వల్ల ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న గాలి, నీరు కలుషితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ గ్రామాల్లో క్యాన్సర్‌, కిడ్నీ, అంతుచిక్కని వ్యాధులతో బాధపడుతూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పంట పొలాలు సక్రమంగా పండటం లేదని, పండ్లతోటలు కాపునకు రావడం లేదని వివరించారు. గతంలో కూడా బొండ్లవానిపల్లెకు చెందిన రైతుల జామతోట, సపోట తోటలు దెబ్బతిన్నాయని కలెక్టర్‌కు కూడా వినతిపత్రం అందించారని గుర్తుచేశారు. అంతేగాకుండా భూగర్భజలాలు కూడా ఇంకిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు పరిహారం అందించలేదన్నారు. అధికారులు స్పందించి జియో మైసూరు కంపెనీపై విచారణ జరిపి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, వాల్మీకి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మురళి నాయుడు, నారాయణ, నాగేశ్వరరావు, సాయి, చలపతి పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 11:53 PM